Sapta Sagaralu Dhaati - Side B : టికెట్ రేట్లు తక్కువే - 'సప్త సాగరాలు దాటి - సైడ్ బి'కి ప్రేక్షకులు వస్తారా?
Sapta Sagaralu Dhaati - Side B Tickets Price : రక్షిత్ శెట్టి హీరోగా నటించిన 'సప్త సాగరాలు దాటి - సైడ్ బి' సినిమా శుక్రవారం తెలుగులో కూడా విడుదలవుతోంది. టికెట్ రేట్లు ఎలా ఉన్నాయి? ఏమిటి?
కన్నడ కథానాయకుడు రక్షిత్ శెట్టి (Rakshit Shetty) నటించిన 'సప్త సాగరాలు దాటి - సైడ్ బి' (Saptha Sagaralu dhaati Side B) శుక్రవారం థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమాను నవంబర్ 17న కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నారు. తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా టికెట్ రేట్లు ఎలా ఉన్నాయి? అనేది చూస్తే...
తెలంగాణలో మ్యాగ్జిమమ్ 200 వందలే!
'సప్త సాగరాలు దాటి - సైడ్ ఏ' తెలుగులో సెప్టెంబర్ 22న విడుదల అయ్యింది. ఆ చిత్రానికి విమర్శకుల నుంచి మంచి స్పందన లభించింది. కానీ, ఆశించిన స్థాయి వసూళ్లు మాత్రం రాలేదు. విడుదలకు ముందు పబ్లిసిటీ చేయడానికి అప్పట్లో తక్కువ సమయం మాత్రమే ఉందని, అయినప్పటికీ కొన్ని ఏరియాలో షోలు హౌస్ ఫుల్స్ అయ్యాయని... 'సప్త సాగరాలు దాటి - సైడ్ బి'కి మంచి ఓపెనింగ్స్ వస్తాయని ఆశిస్తున్నట్లు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల తెలిపారు. టికెట్ రేట్లు కూడా తగ్గించారు.
శుక్రవారం విడుదల అవుతున్న 'మంగళవారం' టికెట్ రేట్లు మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ. 300 ఉంటే... 'సప్త సాగరాలు దాటి సైడ్ బి' సినిమా టికెట్ రేటు రూ. 200 మాత్రమే పెట్టారు. మరో వైపు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ రేట్లు రూ. 50 నుంచి రూ. 150 వరకు ఉన్నాయి. ఏపీలోనూ అంతే! టికెట్ రేట్లు ఎక్కువ లేవు. మరి, సినిమా కలెక్షన్లు ఎలా ఉంటాయో చూడాలి.
Also Read : 50 రూపాయలకు 'మంగళవారం' సినిమా - ఏపీ, తెలంగాణలో టికెట్ రేట్లు చూశారా?
రక్షిత్ శెట్టి కథానాయకుడిగా నటించడంతో పాటు కన్నడలో 'సప్త సాగరాలు దాటి సైడ్ బి' చిత్రాన్ని నిర్మించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి. విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రానికి హేమంత్ రావు దర్శకత్వం వహించారు.
Also Read : నేను అడిగితే బన్నీ చరణ్ సినిమాలు చేస్తారు - స్వాతి రెడ్డి గునుపాటి
'సప్త సాగరాలు దాటి సైడ్ ఏ'లో రక్షిత్ శెట్టి, రుక్మిణీ వసంత్ జంటగా నటించారు. ఈ రెండో పార్టులో వాళ్ళిద్దరితో పాటు చైత్ర జె. ఆచార్ ప్రధాన పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమా పాటలు ఆల్రెడీ హిట్ అయ్యాయి. విమర్శకుల ప్రశంసలతో పాటు ఈ సినిమాకు కమర్షియల్ విజయం కూడా లభించాలని ఆశిద్దాం.
తెలుగులో 'సప్త సాగరాలు దాటి సైడ్ బి' సినిమాకు థియేటర్లలో గట్టి పోటీ ఉంది. 'ఆర్ఎక్స్ 100' కాంబినేషన్ హీరోయిన్ పాయల్, దర్శకుడు అజయ్ భూపతి చేసిన 'మంగళవారం' కూడా శుక్రవారం థియేటర్లలో విడుదల అవుతోంది. దాంతో పాటు విక్రాంత్, మెహరీన్, రుక్సార్ థిల్లాన్ హీరో హీరోయిన్లుగా నటించిన 'స్పార్క్' విడుదల అవుతోంది. హన్సిక 'మై నేమ్ ఈజ్ శృతి'తో పాటు మరో రెండు మూడు సినిమాలు వస్తున్నాయి.