Father's Day Special: నాన్న ఒక ఎమోషన్.. తండ్రి సెంటిమెంట్‌తో వచ్చిన అలనాటి చిత్రాలివే - చూస్తే, కన్నీళ్లు పెట్టుకుంటారు
Father's Day: తెలుగులో మదర్ సెంటిమెంటుతో తెరకెక్కిన సినిమా చాలానే ఉన్నాయి కానీ, ఫాదర్ సెంటిమెంట్ తో వచ్చిన చిత్రాలు చాలా తక్కువగా ఉన్నాయి. తండ్రి ప్రేమను తెర మీద ఆవిష్కరించిన పాత సినిమాలు ఏవంటే...
Father's Day 2024 Special: నాన్న.. మన జీవితంలో మొదటి హీరో. అమ్మ మనల్ని తన కడుపులో నవమాసాలు మోస్తే, తండ్రి జీవితాంతం తన గుండెల మీద పెట్టుకుని చూసుకుంటాడు. మంచి చెడులు నేర్పించి సరైన మార్గంలో నడిపిస్తాడు. ఈ సమాజంలో బాధ్యత గల పౌరుడిగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తాడు. అందుకే తండ్రుల ఔన్నత్యాన్ని, వారితో ఉండే అనుబంధాన్ని గుర్తు చేసుకోడానికి ప్రతీ ఏడాది జూన్ మూడవ ఆదివారం 'ఫాదర్స్ డే' ను సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ నేపథ్యంలో ఓల్డెన్ డేస్‌లో తెలుగు తెరపై తండ్రి ప్రేమను ఆవిష్కరించిన చిత్రాలు, ఫాదర్ సెంటిమెంట్ తో వచ్చిన సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం!
జస్టిస్ చౌదరి:
నందమూరి తారక రామారావు, శ్రీదేవి, శారద ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం 'జస్టిస్ చౌదరి'. 1982 లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర మంచి విజయం సాధించింది. ఇందులో ఎన్టీఆర్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి విలువనిచ్చే జస్టిస్ చౌదరిగా.. తల్లికి అన్యాయం చేశాడనే కోపంతో తండ్రి మీద పగ తీర్చుకోవాలనుకునే మెకానిక్ రాముగా రామారావు అలరించారు. ‘తెలుగుదేశం’ పార్టీ పెట్టిన రెండు నెలల తర్వాత రిలీజైన ఈ చిత్రం 250 రోజులకు పైగా ప్రదర్శించబడింది.
ఓ తండ్రి ఓ కొడుకు:
వినోద్ కుమార్, దాసరి నారాయణరావు ప్రధాన పాత్రల్లో రూపొందించిన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా 'ఓ తండ్రి ఓ కొడుకు'. దీనికి మౌళి దర్శకత్వం వహించారు. ఇందులో నదియా హీరోయిన్ గా నటించింది. 1994లో విడుదలైన ఈ సినిమాలో ఫాదర్ సెంటిమెంట్ ను అద్భుతంగా చూపించారు. చిన్నప్పుడే కొడుక్కి దూరమైన కన్న తండ్రి ప్రేమ కంటే, పెంచి పెద్ద చేసిన పెంపుడు తండ్రి ప్రేమ గొప్పదని చెప్పే చిత్రమిది. దీని కంటే ముందు దాసరి, వినోద్ కుమార్ కాంబోలో వచ్చిన 'మామగారు' మూవీలో తండ్రీ కొడుకులుగా మారిన మామా అల్లుళ్ళ కథను చూపించారు.
రాయుడు:
మంచు మోహన్ బాబు టైటిల్ రోల్ లో రూపొందిన కుటుంబ కథా చిత్రం 'రాయుడు'. రచనా బెనర్జీ, ప్రత్యూష, సౌందర్య ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. తండ్రీ కూతుర్ల సెంటిమెంట్ తో ఈ సినిమా తెరకెక్కింది. కన్న కూతురు కాకపోయినా కంటిరెప్పాలా కాపాడుకునే తండ్రి కథని వివరిస్తుంది. ఇందులో కూతురిగా ప్రత్యూష, పెంపుడు తండ్రిగా మోహన్ బాబు నటించారు. రవిరాజా పినిశెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇది తమిళ చిత్రం 'వల్లల్' కు అధికారిక రీమేక్. 1998 లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద విజయవంతమైంది.
సూర్యవంశం:
విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన చిత్రం 'సూర్యవంశం'. ఇందులో రాధిక, మీనా, సంఘవి కీలక పాత్రలు పోషించారు. రీమేక్స్ స్పెషలిస్ట్ భీమనేని శ్రీనివాసరావు 1998లో తీసిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. దీంట్లో హరిశ్చంద్ర ప్రసాద్, భాను ప్రసాద్ లుగా తండ్రీ కొడుకుల పాత్రల్లో వెంకీ నటన ఆకట్టుకుంటుంది. ఇది తమిళంతో శరత్ కుమార్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన సూర్యవంశం చిత్రానికి రీమేక్. ఆ తర్వాత ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్, సౌందర్య, జయప్రద ప్రధాన పాత్రల్లో హిందీలో రీమేక్ చేయబడింది.
సుస్వాగతం:
తండ్రీ కొడుకుల మధ్య అనుబంధాన్ని చాటి చెబుతూ భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ప్రేమకథా చిత్రం 'సుస్వాగతం'. పవన్ కల్యాణ్, దేవయాని హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రఘువరన్ కీలక పాత్రలు పోషించారు. కొడుకుకి అన్నివేళలా అండగా నిలిచే తండ్రి, అవసరమైతే ఒక ఫ్రెండ్ గా మారి ప్రేమ విషయంలోనూ సపోర్ట్ చేస్తాడనే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. ఇందులో ప్రేమ కోసం పరితపించే కొడుకుగా పవన్.. ప్రేమ విషయంలో కొడుక్కి హెల్ప్ చేసే ఫాదర్ గా రఘువరన్ అలరించారు. క్లైమాక్స్ లో హీరో తన తండ్రిని చివరి చూపు చూసుకోలేకపోయానని కుమిలిపోతూ ఏడ్చే సీన్ చూస్తే కన్నీళ్లు ఆగవు. ఇది 'లవ్ టుడే' అనే తమిళ చిత్రానికి రీమేక్. 1998లో వచ్చిన ఈ సినిమా కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయింది.
డాడీ:
చిరంజీవి, సిమ్రాన్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'డాడీ'. సురేష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరు డాటర్ గా అనుష్క మల్హోత్రా నటించింది. టైటిల్ కు తగ్గట్టుగానే తండ్రి కూతుర్ల బాండింగ్ ను ఈ సినిమాలో ఆవిష్కరించారు. కానీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకుంది. గతంలో చిరు నటించిన విజేత, రుద్రవీణ వంటి కొన్ని సినిమాల్లోనూ ఫాదర్ సెంటిమెంట్ ను చూపించారు.
Also Read: ఫాదర్స్ డే స్పెషల్ - తండ్రి సెంటిమెంట్‌తో వచ్చిన మోడ్రన్ సినిమాలివే!