(Source: Poll of Polls)
AP Group 2 Exams: ఆంధ్రప్రదేశ్ గ్రూపు 2 పరీక్షలు యథాతథం- వాయిదా లేదని ఏపీపీఎస్సీ ప్రకటన
APPSC Group 2 News: ఎన్నికల కోడ్ ఉన్నందున గ్రూప్2 పరీక్షలు వాయిదా వేయలేమని ఏపీపీఎస్సీ ప్రకటించింది. ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరించింది.

AP Group 2 Exams: అభ్యర్థులు విన్నవించుకున్నా, ప్రభుత్వం ఆదేశించినా ఏపీపీఎస్సీ వెనక్కి తగ్గలేదు. ఆదివారం గ్రూప్2 పరీక్ష వాయిదా వేయలేదు. ఎమ్మెల్సీ కోడ్ ఉన్నందున గ్రూప్2 పరీక్ష వాయిదా వేయలేమని ప్రకటించింది.
రోస్టర్ విధానంలో తప్పులు ఉన్నాయని ప్రస్తుతానికి గ్రూప్ 2 వాయిదా వేయాలని ప్రభుత్వం సూచనను ఏపీపీఎస్సీ పట్టించుకోలేదు. అభ్యర్థనల ఆర్తనాథాలు వినలేదు. అందరినీ కాదని అనుకున్నట్టుగానే గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించేందుకే ఏపీపీఎస్సీ మొగ్గు చూపింది. వాయిదా ప్రచారాన్ని ఖండిస్తూ పరీక్ష ఉంటుందని ఆలస్యంగా ప్రకటించింది.
24గంటల నుంచి నెలకొన్న ఉత్కంఠకు ఏపీపీఎస్సీ ఎట్టకేలకు తెరదించింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆదివారం రెండు పరీక్షలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించింది. పోస్టుపోన్ ఆలోచనే లేదని స్పష్టం చేసింది. విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి జోక్యం చేసుకున్నప్పటికీ ప్రయోజనం లేకపోయింది.
ఎమ్మెల్సీ ఎన్నికలను సాకుగా చూపించి పరీక్షలు వాయిదా వేసేందుకు ఏపీపీఎస్సీ నిరాకరించింది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పరీక్ష వాయిదా వేయలేమని స్పష్టం చేసింది. అసలే గ్రాడ్యుయేట్స్ పాల్గొనే ఎన్నికలు కాబట్టి ఇప్పుడు వాయిదా వేస్తే ప్రభావితం చేసినట్టు అవుతుందని పేర్కొంది. అందుకే గ్రూప్ 2 పరీక్షలు వాయిదా ప్రసక్తే లేదని తేల్చింది.
Also Read: గ్రూప్ 2 వివాదంలో ప్రభుత్వ సూచన లెక్కచేయని ఏపీపీఎస్సీ
ఈ గ్రూప్ 2 వివాదం ఇప్పటిది కాదు. 2023 డిసెంబర్‌లో నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఉంది. నోటిఫికేషన్‌తోనే వివాదం మొదలైంది. వివిధ సామాజిక వర్గాలకు పోస్టుల కేటాయింపు సరిగా జరగలేదని ఇందులో తప్పులు ఉన్నాయని గుర్తించిన అభ్యర్థులు వాటిని సరి చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. అప్పటి వరకు పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. అప్పటి వైసీపీ ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదు. గత ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది.
ప్రిలిమ్స్ పరీక్ష అయిన తర్వాత కూడా అభ్యర్థులు తమ పోరాటాన్ని ఆపలేదు. దీనిపై కోర్టుకు వెళ్లారు. ఈ కేసులో, మరోవైపు ఎన్నికలు, ప్రభుత్వం మారడం ఇలా వివిధ కారణాలతో మెయిన్స్ పరీక్ష వాయిదా పడుతూ వచ్చింది. ఓవైపు కోర్టుల్లో విచారణ సాగుతుండగానే మరోవైపు పరీక్ష నిర్వహణకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేసింది. ఫిబ్రవరి 23 పరీక్ష ఉంటుందని ప్రకటించింది.
మెయిన్స్ పరీక్ష తేదీ వచ్చిన వెంటనే అభ్యర్థులు ఏపీ హైకోర్టులో మరిన్ని పిటిషన్లు వేశారు. రోస్టర్ విధానంపై కేసు విచారణలో ఉన్న టైంలో పరీక్ష తేదీ ప్రకటించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై స్టే ఇవ్వాలని కోర్టును రిక్వస్ట్ చేశారు. పరీక్ష పోస్ట్‌పోన్ చేయడానికి కోర్టు నిరాకరించింది.
కోర్టు నిరాకరించడంతో అభ్యర్థులు రోడ్లపైకి వచ్చారు. ప్రభుత్వానికి, ఏపీపీఎస్సీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడం మొదలుపెట్టారు. దీంతో ప్రభుత్వం కూడా అభ్యర్థుల తరఫున ఆలోచించి పరీక్ష వాయిదా వేయాలని ఏపీపీఎస్సీకి లేఖ రాసింది. అయినా ఏపీపీఎస్సీ వినిపించుకోలేదు. పార్టీ ప్రతినిధులతో రివ్యూ మీటింగ్‌లో కూడా ఈవిషయంపై క్లారిటీ ఇచ్చారు. వాయిదా వేయాలనే ఉద్దేశంలో ప్రభుత్వం ఉందని ఏపీపీపీఎస్సీ మాత్రం అంగీకరించడం లేదని చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన ఆడియో వైరల్ అయింది.
Also Read: టెస్లాకు భారీ ఆఫర్లు ఇస్తున్న ఏపీ - ఎలాన్ మస్క్ ప్లాంట్ పెట్టేస్తారా ?





















