Bullet Bike Burnt: అనంతపురంలో పేలిన ఆయిల్ ట్యాంక్, బుల్లెట్ బైక్ దగ్ధం - కారణం అదే అంటున్న స్థానికులు
Bullet Bike Oil Tanker Blast: బండిని పార్కు చేసి స్వామి దర్శనానికి వెళ్లిన సమయంలో బైక్ ట్యాంకర్ నుంచి మంటలు చెలరేగి కొంత సమయానికే బుల్లెట్ బండి దగ్దమైనట్లు స్థానికులు చెబుతున్నారు.
Anantapur Bullet Bike Burnt: వేసవి కాలం మొదలైందని అనగానే కేవలం మన గురించి మాత్రమే జాగ్రత్తలు తీసుకుంటుంటాం. కానీ అది ఒక్కటే సరిపోదని, మనం వాడే వస్తువులు, వాహనాలపై సైతం ఫోకస్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని రోజుల కిందట తమిళనాడులో ఎలక్ట్రిక్ బ్యాటరీ బైక్ దగ్దమైంది. కానీ ఇక్కడ ప్రాణనష్టం సంభవించింది. ఛార్జింగ్ పెట్టి పడుకున్న తండ్రి, కూతురు మంటలకు కాలి సజీవ దహనం అయ్యారు. మహారాష్ట్ర పుణెలోనూ ఓలా కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ జనాలు చూస్తుండగానే మంటల్లో కాలి బూడిదైంది. తాజాగా అలాంటి ఘటన ఏపీలోని అనంతపురం జిల్లాలో జరిగింది.
దైవ దర్శనానికి కర్ణాటక నుంచి వచ్చిన భక్తుడు..
అనంతపురం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురంలో ఓ బుల్లెట్ బండి అగ్నికి ఆహుతైంది. బండిని పార్కు చేసి స్వామి దర్శనానికి వెళ్లిన సమయంలో బైక్ ట్యాంకర్ నుంచి మంటలు చెలరేగి కొంత సమయానికే బుల్లెట్ బండి దగ్దమైనట్లు స్థానికులు చెబుతున్నారు. తెలుగు నూతన సంవత్సరాది ఉగాది సందర్భంగా నెట్టికంటి ఆంజనేయ స్వామిని దర్శించుకోవాలని వచ్చిన కర్ణాటక భక్తుడికి నిరాశే ఎదురైంది. దైవ దర్శనానికి రాగా, తన బుల్లెట్ బండి కాలిపోవడంతో ఆవేదన వ్యక్తం చేశాడు.
అసలేం జరిగిందంటే..
కర్ణాటక రాష్ట్రం మైసూరుకు చెందిన రవిచంద్ర అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కసాపురం ఆంజనేయ స్వామిని దర్శించుకోవాలనుకున్నాడు. అయితే మైసూర్ నుంచి బుల్లెట్ వాహనంపై కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దర్శనం కోసం ఏకధాటిగా ప్రయాణించాడు. కసాపురంలో బుల్లెట్ బండి మైసూరు నుండి కసాపురానికి నాన్ స్టాప్ గా నడపడంతో బైక్ వేడెక్కిందని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు అనంతపురంలో గత మూడు నాలుగు రోజుల నుంచి 42 నుంచి 43 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. బుల్లెట్ బైక్ ఇంజిన్ వేడెక్కడం, మరోవైపు ఎండ వేడి అధికంగా ఉండటంతో ఒక్కసారిగా బుల్లెట్ బండి నుంచి మంటలు వచ్చాయి.
భయంతో పరుగులు..
ఒక్కసారిగా బుల్లెట్ బండి నుంచి మంటలు రావడంతో కొందరు భక్తులు భయంతో దూరంగా పరుగులు తీశారు. మరికొందరు మంటల్ని ఆర్పేందుకు యత్నించారు. నీళ్లు, ఇసుక చల్లుతూ మంటల్ని ఆర్పేవారు. ఇతర బైకులకు మంటలు అంటుకోకుండా చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఏకదాటిగా వాహనడం నడపడంతో ఇంజిన్ వేడెక్కడం, జిల్లాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో బుల్లెట్ బండి నుంచి మంటలు వచ్చినట్లు తెలుస్తోంది.
Also Read: AP New Districts: ఏపీలో 26 జిల్లాలపై తుది నోటిఫికేషన్ విడుదల - జిల్లాల సమగ్ర వివరాలు ఇవే
Also Read: New Districts In AP: కొత్త జిల్లాల ఏర్పాటులో మరో ముందడుగు- కలెక్టర్లను నియమించిన ప్రభుత్వం