WPI Inflation: WPI: టోకు ద్రవ్యోల్బణం నుంచి భారీ ఉపశమనం, మార్చిలో 1.34 శాతానికి క్షీణత
టోకు ద్రవ్యోల్బణం రేటు 2023 ఫిబ్రవరి నెలలోని 3.85 శాతంగా ఉంది. అక్కడి నుంచి మార్చి నెలలో ఒక్కసారే 2.51 శాతం తగ్గింది.
Wholesale Price Index: భారతదేశంలో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం (wholesale price index based inflation) భారీ ఉపశమనాన్ని ఇచ్చింది. 2023 మార్చి నెలలో, WPI ఇన్‌ఫ్లేషన్ 1.34 శాతంగా నమోదైంది. ఇది 29 నెలల కనిష్ట స్థాయి.
టోకు ద్రవ్యోల్బణం రేటు 2023 ఫిబ్రవరి నెలలోని 3.85 శాతంగా ఉంది. అక్కడి నుంచి మార్చి నెలలో ఒక్కసారే 2.51 శాతం తగ్గింది. అంతకుముందు, 2023 జనవరి నెలలో టోకు ద్రవ్యోల్బణం రేటు 4.73 శాతంగా ఉంది. గత కొన్ని నెలలుగా WPI ద్రవ్యోల్బణం వస్తోంది.
ఆహార ద్రవ్యోల్బణంలో భారీ పతనం
ప్రధానంగా, ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం రేటు తక్కువగా ఉండటం వల్ల టోకు ద్రవ్యోల్బణం రేటులో ఈ స్థాయి తగ్గుదల కనిపించింది. ఆహార ద్రవ్యోల్బణం ఫిబ్రవరి నెలలోని 2.76 శాతం నుంచి మార్చి నెలలో 2.32 శాతానికి తగ్గింది.
టోకు ద్రవ్యోల్బణం ఇంతలా తగ్గడానికి కారణం ఏంటి?
ప్రాథమిక లోహాలు, ఆహార ఉత్పత్తులు, వస్త్రాలు, ఆహారేతర వస్తువులు, ఖనిజాలు, రబ్బరు, ప్లాస్టిక్ ఉత్పత్తులు, ముడి పెట్రోలియం, సహజ వాయువుతో పాటు కాగితం, కాగితం ఉత్పత్తుల ధరలు తగ్గడం వల్ల ఈసారి టోకు ద్రవ్యోల్బణం తగ్గిందని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది.
ఇంధనం & విద్యుత్ ద్రవ్యోల్బణం 2023 ఫిబ్రవరిలోని 14.82 శాతం నుంచి మార్చిలో 8.96 శాతానికి తగ్గింది. తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలోని 1.94 శాతం నుంచి మార్చిలో 0.77 శాతానికి తగ్గింది. బంగాళదుంపల టోకు ద్రవ్యోల్బణం 2023 ఫిబ్రవరిలో -14.30 శాతంగా ఉండగా, మార్చి చివరి నాటికి -23.67 శాతానికి తగ్గింది. ఉల్లిపాయల టోకు ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో -40.14 శాతంగా ఉంది, మార్చిలో -36.83 శాతానికి పెరిగింది.
భారతదేశంలో ద్రవ్యోల్బణాన్ని కొలిచే రెండు సూచీల్లో ఒకటి WPI ఆధారిత ద్రవ్యోల్బణం, మరొకటి వినియోగదారు ధరల ఆధారిత (CPI) ద్రవ్యోల్బణం. కంపెనీ నుంచి కంపెనీ మధ్య చేతులు మారే వస్తువుల ధరలను, వాటి ఉత్పత్తి స్థాయిలో WPI ద్రవ్యోల్బణం కోసం పరిగణనలోకి తీసుకుంటారు. దీనికి వ్యతిరేకంగా, రిటైల్ వినియోగదార్ల స్థాయిలోని ధరలను CPI ద్రవ్యోల్బణం కోసం పరిగణనలోకి తీసుకుంటారు.
చిల్లర ద్రవ్యోల్బణం
దేశంలో చిల్లర ద్రవ్యోల్బణం (Retail Inflation) వరుసగా రెండో నెల మార్చిలో కూడా తగ్గింది. మార్చి నెలలో, వినియోగదారు ధరల సూచీ (Consumer Price Index - CPI) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 5.66 శాతంగా నమోదైంది. ఆహార పదార్థాల ధరలు తగ్గడం వల్లే ఇది కూడా తగ్గింది, 15 నెలల కనిష్ట స్థాయికి చేరింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గరిష్ట లక్ష్యమైన 6 శాతంలోపే మార్చి నెల ఇన్‌ఫ్లేషన్ నమోదైంది.
అంతకుముందు, ఫిబ్రవరి నెలలో చిల్లర ద్రవ్యోల్బణం 6.44 శాతంగా, జనవరిలో 6.52 శాతంగా ఉంది. ఏడాది క్రితం (2022) మార్చి నెలలో చిల్లర ద్రవ్యోల్బణం 6.95 శాతంగా ఉంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 5.20 శాతంగా ఉండొచ్చని RBI అంచనా వేసింది. మొదటి త్రైమాసికంలో 5.1 శాతం, రెండో త్రైమాసికంలో 5.4 శాతం, మూడో త్రైమాసికంలో 5.4 శాతం, నాలుగో త్రైమాసికంలో 5.2 శాతంగా ఉండొచ్చని లెక్కలు వెలువరించింది.