భారత అభివృద్ధికి పునాది వేసిన మన్మోహన్, క్లైమాక్స్ మోదీ: అదానీ ప్రశంసలు
అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ప్రశంసించారు. మన్మోహన్ సంస్కరణలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
Gautam Adani: 90 దశకంలో భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత సవాలు పరిస్థితులను ఎదుర్కొన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా పురోభివృద్ధిని సాధించటం వెనుక భారత ప్రధానులు చేసిన కీలక నిర్ణయాలు ఉన్నాయని ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ పేర్కొన్నారు. ఈ క్రమంలో వారి పనితీరును కొనియాడారు.
యూపీఐ హయాంలో ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ ఆర్థిక వేత్త అని మనందరికీ తెలిసిందే. ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలను అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ తాజాగా గుర్తుచేసుకుంటూ ప్రశంసలు కురిపించారు. 1991లో దేశ ఆర్థిక వ్యవస్థను సరళీకృతం చేస్తూ లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ అనే నూతన ఒరవడికి పట్టం కట్టిన ఆయన ముందుచూపును అభినందించారు. అప్పట్లో మన్మోహన్ తీసుకున్న నిర్ణయాలు భారతదేశ మౌలిక సదుపాయాలకు పునాది వేశాయని ముంబైలో జరిగిన క్రిసిల్ కార్యక్రమంలో పాల్గొన్న అదానీ అన్నారు. మోదీ నేతృత్వంలో గడచిన దశాబ్ధకాల పాలనలో దేశం మౌలిక సదుపాయాల రంగంలో గణనీయమైన పురోగతిని సాధించిందని అదానీ పేర్కొన్నారు.
భారతదేశ మౌలిక సదుపాయాల అభివృద్ధికి సన్నాహాలు 1991లోనే ప్రారంభమయ్యాయని, అప్పటి ప్రధాని మన్మోహన్ 2014 తీసుకున్న నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థకు గట్టి పునాదిని వేశాయని అదానీ పేర్కొన్నారు. అయితే ఆతర్వాత అధికారంలోకి వచ్చిన మోదీ సర్కార్ 2014-2024 వరకు దానిని టేకాఫ్ చేసిందని చెప్పారు. మన్మోహన్ దేశంలో లైసెన్స్ పాలనకు ముగింపు పలికారని, ఇది వ్యాపారాలకు పెట్టుబడి పెట్టడానికి లేదా ధరలను నిర్ణయించడానికి అవకాశం ఇచ్చింది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మోదీ అధికారంలోకి రాగానే అదానీ వ్యాపారాల వృద్ధి చాలా వేగంగా కొనసాగింది. మోదీ మూడోసారి అధికారంలోకి రాగానే అదానీ నిర్మాణ, మౌలిక సదుపాయాల రంగంపై ఫోకస్ కొనసాగిస్తూ కొత్త సిమెంట్ కంపెనీలు, పవర్ ట్రాన్స్మిషన్, పవర్ ప్రాజెక్టులు, గ్రీన్ ఎనర్జీ వంటి వ్యాపారాలపై తన దృష్టిని సారించారు. అలాగే తన పోర్ట్ వ్యాపారాలను ఇతర దేశాలకు సైతం విస్తరిస్తున్నారు. నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వ, ప్రయివేటు రంగాలు కలిసి రావాలని తాజాగా అదానీ అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం అదానీ గ్రూప్ గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో అవసరమైన అన్ని భాగాలను తయారు చేస్తోందని గౌతమ్ పేర్కొన్నారు. దీనికోసం గ్రీన్ ఎనర్జీ రంగంలో గ్రూప్ ఏకంగా 100 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీ ప్రకారం రూ.8340 కోట్లను వెచ్చిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే 2050 నాటికి భారత్ 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందనే తన అంచనాను వెల్లడించారు. భారతదేశ ప్రస్తుత మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు 5 ట్రిలియన్ డాలర్లతో పోలిస్తే.. రానున్న 26 ఏళ్లలో స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 40 లక్షల కోట్ల డాలర్లను అధిగమిస్తుందని ఆశావాదం వ్యక్తం చేశారు.