Tax Refund: రెండున్నర నెలల్లోనే రూ.53,322 కోట్ల టాక్స్ రిఫండ్స్ - మీకు అందిందా?
Direct Tax Collection: పన్ను చెల్లింపుదార్లకు ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ రూ.53 వేల కోట్లకు పైగా రిఫండ్స్ జారీ చేసింది. గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు 34 శాతం ఎక్కువ మొత్తాన్ని విడుదల చేసింది.
Direct Tax Collection For 2024-25: ప్రస్తుత 2024-25 ఆర్థిక సంవత్సరంలో (FY25) ఇప్పటివరకు ప్రత్యక్ష పన్ను వసూళ్లు అద్భుతంగా ఉన్నాయి. ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన ఏప్రిల్ 01 నుంచి జూన్ 17, 2024 వరకు రూ. 4,62,664 కోట్ల ప్రత్యక్ష పన్ను వసూలైంది. ఇది గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఈ మొత్తం రూ. 3,82,414 కోట్లుగా ఉంది. అంటే, గత ఆర్థిక ఏడాదితో పోలిస్తే ప్రస్తుత సంవత్సరంలో స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు 22.19 శాతం పెరిగాయి. నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు కూడా 20.99 శాతం పెరిగాయి. స్థూల ప్రత్యక్ష పన్ను మొత్తం నుంచి రిఫండ్‌ను తీసేస్తే నికర ప్రత్యక్ష పన్ను మొత్తం వస్తుంది.
2024-25 ఆర్థిక సంవత్సరంలో జూన్ 17, 2024 వరకు రూ. 4,62,664 కోట్ల ప్రత్యక్ష పన్ను వసూలు చేసినట్లు చెబుతూ, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక తాత్కాలిక డేటాను విడుదల చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలోని ఇదే కాలంతో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 20.99 శాతం పెరిగాయని వెల్లడించింది. అంతేకాదు, ఇప్పటి వరకు (జూన్ 17 వరకు) రూ. 53,322 కోట్ల ఆదాయపు పన్ను రిఫండ్ (Income Tax Refund) జారీ చేసింది. ఇది గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇచ్చిన రిఫండ్ కంటే ఈసారి 33.70 శాతం ఎక్కువ మొత్తాన్ని జారీ చేసింది.
👉 Gross #DirectTaxCollections for the Financial Year (FY) 2024-25 register a growth of 22.19%
— Ministry of Finance (@FinMinIndia) June 18, 2024
👉 Net #DirectTaxCollections for FY2024-25 grow at over 20.99%
👉 Advance Tax collections for FY2024-25 stand at ₹1,48,823 crore with a growth of 27.34%
👉 Refunds… pic.twitter.com/QLmqhIJnHj
ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇచ్చిన తాత్కాలిక డేటా ప్రకారం... 2024-25 ఆర్థిక సంవత్సరంలో జూన్ 17 వరకు, రిఫండ్స్ సర్దుబాటు చేయడానికి ముందు స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ. 5,15,986 కోట్లుగా లెక్క తేలాయి. ఇది గత ఆర్థిక సంవత్సరం (FY24) ఇదే కాలంలో ఈ మొత్తం రూ. 4,22,295 కోట్లుగా ఉంది. అంటే, గత ఆర్థిక ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు 22.19 శాతం పెరిగాయి. ఇందులో... కార్పొరేట్ పన్ను (Corporate Tax Collection) రూపంలో రూ. 2,26,280 కోట్లు, వ్యక్తిగత ఆదాయపు పన్ను (Individual Income Tax Collection) రూపంలో రూ. 2,88,993 కోట్లు వసూలయ్యాయి. ఇందులో సెక్యూరిటీ లావాదేవీల పన్ను కూడా కలిసి (STT) ఉంది.
డేటా ప్రకారం, 2024-25 ఆర్థిక సంవత్సరంలో ముందస్తు పన్ను వసూలు (Advance Tax Collection) రూ. 1,48,823 కోట్లకు చేరింది. TDS రూపంలో రూ. 3,24,787 కోట్లు; సెల్ఫ్ అసెస్‌మెంట్ ట్యాక్స్ కింద రూ. 28,471 కోట్లు; రెగ్యులర్ అసెస్‌మెంట్ ట్యాక్స్ కింద రూ. 10,920 కోట్లు, మైనర్ హెడ్ కింద పన్ను వసూళ్లు రూ. 2,985 కోట్లు కేంద్ర ఖజానాలో జమ అయ్యాయి.
ఈ ఏడాది ఏప్రిల్ 01 నుంచి జూన్ 17 వరకు రూ. 1,48,823 కోట్ల అడ్వాన్స్ ట్యాక్స్ వసూలైతే, గత ఏడాది ఇదే కాలంలో రూ.1,16,875 కోట్లు వచ్చింది. అంటే, గత ఏడాదితో పోలిస్తే ఈసారి కేంద్రానికి 27.34 శాతం ఎక్కువ మొత్తం వసూలైంది.
మరో ఆసక్తికర కథనం: మనకు తెలీకుండానే ఇన్ని పన్నులు కడుతున్నామా? మైండ్ బ్లాంక్ అయ్యే సమాచారం ఇది