Union Budget 2025 : నూనెగింజల ఉత్పత్తిని పెంచాలి, శుద్ది చేసిన నూనెల దిగుమతిని నిషేధించాలి - ప్రీ-బడ్జెట్ మెమోరాండంలో డిమాండ్స్
Union Budget 2025 : నూనెగింజల ఉత్పత్తిని పెంచడానికి, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి 'నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్'ని ప్రారంభించాలని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ కోరింది.

Union Budget 2025 : మరికొన్ని రోజుల్లో 2024 - 25కు గానూ బడ్జెట్ ప్రవేశపెడుతోన్న నేపథ్యంలో సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (SEA) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ప్రీ-బడ్జెట్ మెమోరాండం (Pre-Budget Memorandum) సమర్పించింది. శుద్ధి చేసిన నూనెల (refined edible oils) దిగుమతిని నియంత్రించాలని, దేశంలోకి సుంకం లేకుండా వచ్చే సబ్బులు, నూడుల్స్ వంటి తుది ఉత్పత్తుల దిగుమతి సరుకులను పరిమితం చేయాలని కోరింది. నూనె తీసిన బియ్యం ఊక (defatted rice bran)పై 5 శాతం జీఎస్టీ (GST) విధించాలని పరిశ్రమల సంఘం కోరింది. దాంతో పాటు నూనెగింజల ఉత్పత్తిని పెంచడానికి, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి 'నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్' (NMEO)ని ప్రతిపాదించింది.
ప్రీ-బడ్జెట్ మెమోరాండంలో ఎస్ఈఏ పేర్కొన్న అంశాలివే..
కనీస మద్దతు ధర (MSP), రైతులకు విద్య, విత్తనాలు, వ్యవసాయ పద్ధతులు, యంత్రాలు, వాతావరణ అంచనా, నిల్వ అలాగే ప్రాసెసింగ్ పరిశ్రమ ఆధునికీకరణపై భారీగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరముందని పరిశ్రమం సంఘం తెలిపింది. శుద్ధి చేసిన పామాయిల్ దిగుమతులపై ఆందోళన వ్యక్తం చేసిన ఎస్ఈఏ.. ఇండియన్ పామ్ రిఫైనింగ్ ఇండస్ట్రీ చాలా తక్కువ సామర్థ్య వినియోగంతో ఇబ్బందులు ఎదుర్కొంటోందని చెప్పింది. ముడి పామాయిల్ పన్నుపై ఎలాంటి మార్పు లేకుండా ఆర్‌బీడీ పామోలిన్‌పై దిగుమతి సుంకాన్ని ప్రస్తుతమున్న 12.5 శాతం నుంచి 15 శాతానికి పెంచాలని పరిశ్రమల సంఘం డిమాండ్ చేసింది. అన్ని రకాల నూనెగింజల ఉత్పత్తిని పెంచడానికి, దిగుమతులను తగ్గించడానికి ముడి, శుద్ధి చేసిన నూనెలపై అధిక దిగుమతి సుంకాలను కూడా కోరింది.
Also Read: రైల్వేలకు భారీ గుడ్ న్యూస్.. ఈ సారి ఏకంగా రూ.3లక్షల బడ్జెట్ కేటాయించే ఛాన్స్ ?
ఆ ఉత్పత్తులపై దిగుమతులు తగ్గించాల్సిందే
మలేషియా, ఇండోనేషియా, థాయ్‌లాండ్ వంటి ఆగ్నేయాసియా దేశాల నుంచి వచ్చే సబ్బులు, నూడుల్స్ వంటి ఉత్పత్తుల దిగుమతులను అరికట్టాలని ఎస్ఈఏ పిలుపునిచ్చింది. స్టెరిక్ యాసిడ్, సోప్ నూడుల్స్, ఒలిక్ యాసిడ్, రిఫైన్డ్ గ్లిజరిన్ వంటి తుది ఉత్పత్తుల దిగుమతిని ప్రభుత్వం నిషేధిత వస్తువుల జాబితాలో చేర్చాలని పరిశ్రమల సంఘం కోరింది. అన్ని శుద్ధి చేసిన నూనెలపై ఒకే రకమైన సుంకం (Tax) విధించాలని చెప్పింది. సోయాబీన్ కోసం బఫర్ స్టాక్‌ను రూపొందించడానికి, వాల్యూ బేస్డ్ సోయాబీన్ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి, వాటి దుర్వినియోగాన్ని తగ్గించడానికి డీ-ఆయిల్డ్ రైస్ బ్రాన్‌పై 5 శాతం జీఎస్టీ విధించాలని కోరింది. నూనెగింజల విస్తరణ కార్యక్రమాల్లో భాగంగా ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలని, మోడల్ ఫామ్‌ల ఏర్పాటుకు ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరింది. నూనెల కోసం ప్రస్తుతం దేశం 65శాతం ఇతర దేశాలపై ఆధారపడుతోందని, దాన్ని వచ్చే ఐదేళ్లలో 2029 -30 నాటికి 25-30 శాతానికి తగ్గించాలని చెప్పింది. అది కావాలంటే ప్రస్తుతం రూ.10వేల కోట్లకు బదులు కనీసం రూ.25వేల కోట్లు వెచ్చించాల్సిన అవసరం ఉందని తెలిపింది.
Also Read : Union Budget 2025: 2025 బడ్జెట్‌లో రక్షణ రంగానికి భారీగా కేటాయింపులు ఉంటాయా? నిధులు పెంచాల్సిన అవసరం ఏముంది?
Also Read: ఈ ఏడాది రియల్ ఎస్టేట్ రంగం హోదా పెరుగుతుందా.. అందుకు ఈ బడ్జెట్ సహకరిస్తుందా ?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

