Palasa Tension: పలాసలో హైటెన్షన్ - కాశీబుగ్గ పీఎస్‌లో వైసీపీ నేతల్ని చితక్కొట్టిన టీడీపీ శ్రేణులు, సీదిరి అప్పలరాజు హౌస్ అరెస్ట్
Kasibugga Police Station | వైసీపీ నేతలపై టీడీపీ శ్రేణులు హత్యాయత్నం చేయడం పలాస నియోజకవర్గంలో కలకలం రేపుతోంది. ఏకంగా పీఎస్ లోనే బట్టలు చించిమరీ వైసీపీ నేతలపై టీడీపీ శ్రేణులు దాడి హాట్ టాపిక్ అయింది.
TDP leaders attacks YSRCP leader at Kasibugga Police Station | పలాస నియోజకవర్గంలో రాజకీయ కక్షలు తారాస్థాయికి చేరాయి. కాశీబుగ్గ పోలీసు స్టేషను లో వైసిపి నేతలపై టీడీపీ వర్గీయులు విచక్షణారహితంగా దాడి చేశారు. వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అనుచరుడు వైసిపి నేత అల్లు రమణపై టీడీపీ వర్గీయులు శనివారం హత్యాయత్నం చేశారు. టీడీపీ నేతల దాడి నుండి తప్పించుకున్న అల్లు రమణ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి కాశీబుగ్గ స్టేషనుకు వెళ్ళారు. తనపై దాడికి ప్రయత్నించిన కత్తితో పాటు వెళ్లి ఫిర్యాదు చేయడానికి స్టేషను కు వచ్చిన వైసిపి నేతలు అల్లు రమణ, మొదలవలస మన్మదరావు లపై టీడీపీ నేతలు ఇష్టరీతిన దాడి చేయడం కలకలం రేపుతోంది. పలాస నియోజకవర్గం వైసీపీ శ్రేణులు దీన్ని తీవ్రంగా ఖండించాయి. పోలీస్ స్టేషన్ లో కూడా తమకు రక్షణ కల్పించలేరా అని పోలీసులను, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
పీఎస్‌లోనే దాడులు చేస్తున్నా అడ్డుకోరా?
మన్మధ రావు చొక్కా చింపిన టీడీపీ కార్యకర్తలు విచక్షణారహితంగా కొట్టారు. అల్లు రమణ పై కూడా టీడీపీ వర్గీయులు పిడిగుద్దులతో రెచ్చిపోయి దాడి చేశారు. ఈ సంఘటన జరుగుతున్న సమయంలో టీడీపీ సీనియర్ నేత పీరుకట్ల విఠల్, బడ్డ నాగరాజు, సప్ప నవీన్లు అక్కడే ఉన్నారు. వీరభద్ర పురానికి చెందిన టీడీపీ నేత కొర్ల విష్ణు చౌదరి ఈ దాడి చేసినట్లు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసు స్టేషను లో దాడి జరిగినప్పుడు కేవలం ఒకే ఒక కానిస్టేబుల్ మాత్రమే అడ్డుకోవడానికి ప్రయత్నించారని... కాశీబుగ్గ పోలీస్ స్టేషనులో 15 మందికి పైన సిబ్బంది ఉన్నా మిగతా వారు అడ్డుకోవడానికి ప్రయత్నించలేదని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆందోళనకు దిగిన మాజీ మంత్రి సీదరి అప్పలరాజు
పలాస నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆందోళన చేపట్టారు. మైనర్ బాలికను దారి కాచి దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను అప్పలరాజు డిమాండ్ చేశారు. తప్పు చేసిన వారిని శిక్షించడానికి బదులుగా, బాధితులపైనే దాడులు జరగడం బాధాకరం అన్నారు. కాశిబుగ్గ పోలిస్ స్టేషన్ లో వైసీపీ నేతలపై దాడి చేసిన టీడీపీ శ్రేణులపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని మాజీ మంత్రి అప్పలరాజు డిమాండ్ చేశారు.
పలాసలో వైసీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి తన ఇంటి నుంచి బయలుదేరుతున్న మాజీ మంత్రి అప్పలరాజును పోలీసులు అడ్డుకున్నారు. ఇంట్లో నుండి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. తాను పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయడానికి వస్తున్నా అని చెబుతున్నా పోలీసులు ఆయన మాట వినిపించుకోలేదు. మాజీ మంత్రి అప్పలరాజు ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. అప్పలరాజు ఇంటి నుంచి బయటకు వెళ్తే శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతుందని, అందుకే ఆయనను నిలువరించినట్లు పోలీసులు చెబుతున్నారు. పలాస నియోజకవర్గంలో రాజకీయ దాడులు పెరిగిపోయాయని, పోలీసులు సైతం తమకు రక్షణ కల్పించడం లేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.