పాతపట్నం ఎమ్మెల్యేకి వరుస చేదు అనుభవాలు - మొన్న పార్టీ క్యాడర్, నేడు ప్రజలు ఫైర్!
బోయ, వాల్మీకిలను ఎస్.టి జాబితాలో చేర్చడంపై ఆగ్రహంఎమ్మెల్యే రెడ్డి శాంతిని ప్రశ్నిస్తూ ఫైర్ అవుతున్న గిరిజన యువత
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనేందుకు గ్రామాల బాట పట్టిన పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతికి నిరసనల సెగ తగులుతోంది. గిరిజన గ్రామాలకి వెళ్తున్న సమయంలో వరుసగా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. బోయ, వాల్మీకిలను ఎస్.టి జాబితాలో చేర్చడాన్ని నిరసిస్తూ గిరిజనులు ఎమ్మెల్యేను నిలదీస్తున్నారు. గిరిజనులకి అన్యాయం చేస్తున్నా రని, సమస్యలను పట్టించుకోవడం లేదంటూ ఎవరికి వారుగా మహిళలు, యువకులు నిరసనలను వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేను అంతా కలిసి నిలదీయడంతో ఆమె ఎటూ సమాధానం చెప్పలేక మౌనం వహిస్తున్నారు. ఇతరులు సర్ధిచెప్పే ప్రయత్నం చేస్తున్నా గిరిజన యువత మాత్రం ఫైర్ అవుతున్నారు.
తాజాగా మెళియాపుట్టి మండలంలోని వివిద గ్రామాలకు వెళ్ళినప్పుడు గిరిజనుల నుంచి ఊహించని చేదు అనుభవాలు ఎదుర్కొంటున్నారు. మెళియాపుట్టి మండలంలోని అర్చనపురం గ్రామం వద్ద తమ గ్రామానికి ఎమ్మెల్యే రెడ్డి శాంతి రావద్దంటూ ప్లకార్డులను స్థానికులు పెట్టారు. గో బ్యాక్ ఎమ్మెల్యే అంటూ ప్లకార్డులను ఏర్పాటు చేశారు. దారికి అడ్డంగా కర్రలు కట్టలు ఏర్పాటు చేశారు. బోయ, వాల్మీకిలను ఎస్.టి జాబితాలో చేర్చేందుకు అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులను ప్రదర్శించారు. అనంతరం ఎమ్మెల్యే రెడ్డి శాంతి అక్కడ నుంచి వెనుతిరిగారు. అనంతరం జన్నిబంద గ్రామాన్ని సందర్శించగా పెద్ద ఎత్తున మహిళలు, యువకులు ఆమెను గ్రామంలోకి రావద్దని నిరసనలను తెలిపారు. దీంతో అక్కడ గందరగోళం నెలకొంది. ఈ సందర్భంలో ఓ యువకుడు సెల్ ఫోన్ లో అక్కడ జరుగుతున్న తతంగాన్ని చిత్రీకరిస్తుండగా ఎమ్మెల్యే గన్ మెన్ ఆ వ్యక్తి మొబైల్ ను లాక్కోవడంతో వారు మరింతగా రెచ్చిపోయారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
గిరిజన యువకులు ఆగ్రహం వ్యక్తం చేసినా ఎమ్మెల్యే రెడ్డి శాంతి మాత్రం మౌనం వహిస్తూ నిలుస్తున్నారు. ఆమె వ్యక్తిగత సహాయకులు ఇతరులు గిరిజనులను శాంతింప జేసే ప్రయత్నం చేసినా వారు కనీసం విన్పించుకోలేదు. చివరికి చేసేది లేక ఎమ్మెల్యే రెడ్డి శాంతి అక్కడ నుంచి వెళ్ళిపోయారు. అలాగే శుక్రవారం సైతం మెళియాపుట్టి మండలంలోని సవరజీడి పాలెంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆమె పాల్గోని గిరిజనులకి కరపత్రాలకి పంపిణీ చేయగా వాటిని వారంతా తగులబెట్టారు. జీడిపాలెం, సవరజీడి పాలెం గ్రామాల్లో పర్యటించి వైకాపా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి సంబందించి సీఎం జగన్ ఫోటోతో ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఆమె గ్రామం నుంచి వెళ్ళిన వెంటనే వాటంన్నింటినీ తగులబెట్టారు. బోయ, వాల్మీకులను ఎస్.టి జాబితాలో చేర్చేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపగా దానిని గిరిజనులు అంతా కూడా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఆ తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ నిరసనలను తెలియజేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ కి సైతం వినతిపత్రాలను అందజేశారు. గిరిజనులకు నష్టం చేకూరే విధంగా వైకాపా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తునే ఉన్నారు. ఈ క్రమంలో ఏజెన్సీ ప్రాంతంలోని ఎమ్మెల్యేలకి ఆ నిరసనలను తగులుతున్నాయి. వీటితో పాటు గిరిజనుల సమస్యలను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. పాతపట్నం నియోజకవర్గంలో ఈ నిరసనలపై చర్చ జరుగుతుంది. పాతపట్నం నియోజకవర్గంలో ఇప్పటికే అధికార పార్టీలో గ్రూపుల గొల పెరిగింది. రెడ్డి శాంతి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న వర్గం ఆమె వ్యవహార శైలిని తప్పుపడుతూ అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు. ఇప్పుడు గిరిజనులు కూడా నిరసనలను తెలియజేస్తుండడంతో ఈ నియోజకవర్గంలోని అధికార పార్టీ పరిస్థితి అయోమయంగా మారుతుంది. రానున్న రోజుల్లో రాజకీయంగా కూడా ఇబ్బందికర పరిణామాలు చోటు చేసుకోవచ్చని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు