Maha Kumbh Mela 2025 : మహా కుంభ మేళా 2025 తేదీలివే.. కుంభ మేళా అర్థం, చరిత్ర, ప్రాముఖ్యత వంటి ఇంట్రెస్టింగ్ విషయాలివే
Kumbh Mela 2025 : ఈ ఏడాది(2025)లో ప్రయాగలో మహా కుంభ మేళా జరుగుతుంది. అసలు దీని గురించి చరిత్ర ఏమి చెప్తుంది. కుంభ మేళాలో రకాలు ఏంటి? ఎన్ని సంవత్సరాలకు వీటిని చేసుకుంటారు?
Kumbh Mela History and Significance : మహా కుంభ మేళా 2025(Maha Kumbh Mela 2025). హిందువులు దీనిని ఎంతో ఘనంగా, భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ సంవత్సరం 2025లో కుంభమేళా జనవరి 13వ తేది నుంచి ఫిబ్రవరి 26వ తేదివరకు అలహాబాద్ (ప్రయాగ)లో జరగనుంది. అయితే అసలు ఈ కుంభ మేళాను ఎందుకు నిర్వహిస్తారు. దాని చరిత్ర ఏమిటి? కుంభ మేళాలో రకాలున్నాయా? ఈ కుంభ మేళాలు నిర్వహించడం వెనుక ఉన్న ప్రాముఖ్యత ఏమిటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
చరిత్ర ఏమి చెప్తుందంటే..
అమృతాన్ని గెలుచుకునేందుకు దేవతలు, అసురల సముద్ర మథనం చేస్తారు. ఆ సమయంలో ప్రయాగ్ రాజ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని నదులపై అమరత్వాన్ని ఇచ్చే అమృతం పడిందని చెప్తారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నక్షత్రాల స్థానం ప్రకారం.. కుంభ మేళా సమయంలో ఆ పవిత్ర నదుల నీరు అమృతంగా మారుతుందని భక్తులు భావిస్తారు. అందుకే ఈ కుంభ మేళా సమయంలో హిందువులు తమ పాపాలను పోగొట్టుకోవడానికి పవిత్ర నదుల వద్దకు వెళ్తూ ఉంటారు.
కుంభ మేళా అంటే..
కుంభ అంటే సంస్కృతంలో కుండ, కలశం అనే అర్థాలను ఇస్తుంది. అలాగే రాశుల్లో కూడా కుంభ రాశి ఉంటుంది. ఈ రాశిలోనే కుంభ మేళాను నిర్వహిస్తారు. మేళా అంటే జన సమూహం, కూటమి, జాతరను సూచిస్తుంది. పవిత్ర నదుల దగ్గర ఇలా కూటమిగా రావడాన్నే కుంభ మేళాగా పిలుస్తున్నారు.
కుంభ మేళాల్లో రకాలు..
సాధారణంగా కుంభ మేళా అనేది ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. అర్థ కుంభ మేళా అనేది ప్రతి ఆరు సంవత్సరాలకు చేస్తారు. హరిద్వార్, ప్రయాగలలో ఈ అర్థ కుంభ మేళా జరుగుతుంది. పూర్ణ కుంభ మేళా అనేది ప్రతి పన్నెండు సంవత్సరాలకు చేస్తారు. ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్‌లలో ఈ పూర్ణ కుంభ మేళా జరగుతుంది. ఇలాంటి పూర్ణ కుంభ మేళాలు పన్నెండు పూర్తి అయిన తర్వాత అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఓసారి మహా కుంభ మేళా జరుగుతుంది. ఇది అలహాబాద్‌లో నిర్వహిస్తారు. ఇప్పుడు జరిగేది మహా కుంభ మేళానే. దీనిని అలహాబాద్‌గా చెప్తోన్న ప్రయాగ్‌లో నిర్వహిస్తున్నారు.
ప్రాంతాలను ఇలా ఎంచుతారు..
సూర్యుడు, బృహస్పతి గ్రహం స్థానాల ఆధారంగా కుంభ మేళాను నిర్వహిస్తారు. సూర్యుడు, బృహస్పతి సింహ రాశిలో ఉన్నప్పుడు కుంభ మేళాను నాసిక్‌లోని త్రయంబకేశ్వర్‌లో నిర్వహిస్తారు. సూర్యుడు మేష రాశిలో ఉన్నప్పుడు హరిద్వార్‌లో చేస్తారు. బృహస్పతి, సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో నిర్వహిస్తారు. ఇలా ప్రతి స్థలంలోనూ కుంభ మేళా నిర్వహించే తేదీలను సూర్యుడు, బృహస్పతి స్థానాల ఆధారంగా లెక్కిస్తారు.
ఇంట్రెస్టింగ్ విషయాలివే..
2013లో అలహాబాద్‌లో జరిగిన కుంభ మేళాకు 30 మిలియన్లకు పైగా భక్తులు హాజరయ్యారు. ఇది గిన్నిస్ ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఈ ఏడాది సుమారు 40 కోట్ల మంది భక్తులు ప్రయాగ్ రాజ్‌కు వస్తారని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది. దానికి సంబంధించిన అంశాలపై దృష్టి సారిస్తుంది. భక్తులకు అసౌకర్యం కలగకుండా.. వసతులు కల్పించడం వంటి పనుల్లో నిమగ్నమైంది.
ప్రాముఖ్యతలివే..
మహా కుంభ మేళాను ఆధ్యాత్మిక మేల్కొల్పుగా చూస్తారు. ఇది మతసామర్యాన్ని పెంచే వేడుకగా చెప్తారు. ఈ కుంభ మేళా సమయాల్లో పవిత్ర నదుల్లో స్నానం చేస్తారు. తమ పాపాలను కడిగి.. ఆధ్యాత్మికంగా వృద్ధి చెందుతారని భావిస్తారు. ఈ కుంభ మేళాల్లో సాధువులు, ఋషులు, ఆధ్యాత్మిక నాయకులు కూడా హాజరవుతారు. సాంస్కృతిక గొప్పతనానికి ప్రతీకగా ఈ కుంభ మేళా ప్రతిబింబిస్తుంది. ఈ మేళాలో నాగ సాధువులు నగ్నంగా.. సన్యాసులు బూడిద రాసుకుని కనిపిస్తారు. వివిధ ప్రాంతాలు, కులాలు, మతాల ప్రజల మధ్య సాంస్కృతిక మార్పిడిని ఇది సులభం చేస్తుంది.