Tiger Zone: అర్ధరాత్రి టైగర్ జోన్లో దారులు మూసివేత, ఫోన్ రావడంతో హుటాహుటీన అక్కడికి వెళ్లిన ఎమ్మెల్యే
రాత్రిపూట టైగర్ జోన్ పరిధిలోని దారులు మూసివేయడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న ఖానాపూర్ ఎమ్మెల్యే అర్ధరాత్రి ఉట్నూర్ కొత్తగూడ చెక్ పోస్ట్ వద్దకు వెళ్లారు.
Khanapur Congress MLA Vedma Bojju Patel | ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గతంలో ఎన్నడు లేని విధంగా నిబంధనలు తీసుకొచ్చారు. రాత్రి 9 గంటల తరువాత కవ్వాల్ అభయ్యారణ్యం నుంచి వాహనాలు వెళ్ళకూడదని అటవీ అధికారులు కొత్త నిబంధనలు తీసుకురావడం స్థానికులను ఇబ్బందులకు గురిచేసింది. శనివారం రాత్రి ఉట్నూర్ మండలంలోని కొత్తగూడ చెక్ పోస్ట్ వద్ద భారీగా కార్లు, ఇతర చిన్న వాహనాలను చెక్ పోస్ట్ సిబ్బంది నిలిపివేశారు. దీంతో ఎముకలు కొరికే చలిలో కార్లలో ప్రయాణిస్తున్న చిన్నారులు, స్త్రీలు, వృద్దులు పడరాని పాట్లు పడ్డారు.
అర్థరాత్రి పూట వెళ్లి ప్రయాణికుల అవస్థలు తెలుసుకున్న ఎమ్మెల్యే
చెక్ పోస్ట్ వద్ద భారీగా చిన్న వాహనాలు నిలిచిపోయాయని ఫోన్ రావడంతో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ హుటాహుటిన స్వయంగా కారు నడుపుకుంటూ అర్ధరాత్రి 12 గంటలకు కొత్తగూడ చెక్ పోస్ట్ కు చేరుకున్నారు. అక్కడ ప్రయాణికులతో మాట్లాడారు. చలిలో వారు పడుతున్న బాధలు చూసి చలించి పోయారు. చెక్ పోస్ట్ సిబ్బందిని నిలదీశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాము వాహనాలు నిలిపి వేశామని చెప్పడంతో ఎమ్మెల్యే నిర్మల్ ఎఫ్డిపిటి శాంతారాంకు ఫోన్ చేసి మాట్లాడారు.
కొత్త నిబంధనలు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. తాను ఎమ్మెల్యేనే కాకుండా వైల్డ్ లైఫ్ బోర్డు సభ్యుడుగా ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తనకు తెలియకుండా కొత్త నిభందనలు ఎలా అమలు చేస్తారని అధికారులను నిలదీశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విపరీతంగా చలి పెరిగింది. మరోవైపు అర్ధరాత్రి పూట చలిలో కిలోమీటర్ల మేర వాహనాలను నిలిచిపోయాయని, ప్రయాణికులు చలితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే వాహనాలు విడిచి పెట్టాలని కొరారు.
ఎమ్మెల్యే చొరవతో ఊపిరి పిల్చుకున్న ప్రయాణికులు
ఆదిలాబాద్ డిఎఫ్ఓతో కూడ ఫోన్ లో మాట్లాడారు. ప్రజలకు ఇబ్బందికి గురిచేసే చర్యలు మానుకోవాలని సూచించారు. చిన్న వాహనాల అనుమతి విషయంలో తాను అటవీ శాఖ మంత్రితో, ప్రిన్సిపల్ చీఫ్ కంజర్వెటర్ తో ఉదయమే మాట్లాడుతానని, ఈ అంశం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. ఉన్నతా స్థాయి నిర్ణయం జరిగే వరకు చిన్న వాహనాలను ఆపకూడదని సూచించారు. అధికారులపై ఎమ్మెల్యే ఒత్తిడి తీసుకోరావడంతో అధికారుల ఆదేశం మేరకు బిర్సాయిపేట రేంజ్ అధికారి అరుణ చెక్ పోస్ట్ సిబ్బందికి చెప్పి వాహనాలను విడిచిపెట్టారు. దీంతో సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
అర్ధరాత్రి చలిలో తమ కోసం వచ్చి తమకు సహాయం చేసిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కు ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఈ నిబంధనలు ఇంకా మున్ముందు కొనసాగుతాయా.. లేక అటవీశాఖ అధికారులు అలాగే నిబంధనలను కొనసాగిస్తారా అనేది తెలియాల్సి ఉంది. అసలే పులులు, చిరుతలు ఆ ప్రాంతంలో సంచరిస్తుంటాయి. మరోవైపు స్థానిక నేతలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కొత్త రూల్స్ అమలు చేయడంపై నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.