Telangana Grameena Bank: ఈ బ్యాంకులో మీకు అకౌంట్ ఉందా - ఐతే వెంటనే ఈ డిటెయిల్స్ ను ఛేంజ్ చేయండి
Telangana Grameena Bank: మీకు ఏపీజీవీబీ బ్యాంకులో అకౌంట్ ఉన్నట్లయితే వెంటనే మీ డెబిట్ కార్డు, చెక్ బుక్ వంటివి మార్చుకోవాల్సి ఉంటుంది. జనవరి 1 నుంచి ఆ బ్యాంక్ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనమైంది.
Telangana Grameena Bank : దేశంలోనే అతిపెద్ద గ్రామీణ బ్యాంకుల్లో ఒకటిగా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నిలిచింది. గ్రామీణ బ్యాంకులను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో తలపెట్టిన ఒక రాష్ట్రం.. ఒక గ్రామీణ బ్యాంక్ అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (ఏపీజీవీబీ)కి చెందిన తెలంగాణలోని శాఖలన్నింటినీ ఇప్పుడు టీజీబీ లో విలీనం చేశారు. ఈ రెండు బ్యాంకుల విలీనం జనవరి 1, 2025 నుంచే అమలులోకి వచ్చింది. దీంతో ఇకపై తెలంగాణలో ఏపీజీబీవీ బ్యాంకు కనిపించదు. కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే ఈ బ్యాంక్ సేవలందించనుంది.
కస్టమర్లలో ఆందోళనకు చెక్
బ్యాంకుల విలీనంతో ఏపీజీవీబీ కస్టమర్లలో ఆందోళన మొదలైంది. తమ ఖాతాలు అలాగే ఉంటాయా.. లేదంటే నిలిచిపోతాయా.. ఏమైనా సమస్య ఉంటుందా అన్న ప్రశ్నలు ఇప్పుడు ఆలోచించాల్సిన విషయాలుగా మారాయి. ఈ సందర్భంగా కస్టమర్లకు సంబంధించి ఏటీఎం కార్డులు, చెక్ బుక్కులు, బ్యాంకింగ్ యాప్ లు, ఆన్ లైన్ బ్యాంకింగ్ లాంటి మార్పులు జరిగిన అన్ని విషయాలపైనా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. అవేంటంటే..
- తెలంగాణలోని ఏపీజీవీబీ కస్టమర్లు తమ బ్యాంక్ ఏటీఎం కార్డును మార్చుకోవాల్సి ఉంటుంది. అందుకు అకౌంట్ ఉన్న బ్రాంచీకి వెళ్లి వివరాలు సమర్పించాలి.
- పాత చెక్ బుక్కులు పనిచేయవు. కావున తమ పాత చెక్ బుక్ ను అకౌంట్ ఉన్న బ్రాంచీకి వెళ్లి వాటిని అప్పగించాలని టీజీబీ తెలిపింది.
- పాత చెక్ బుక్ ను సబ్మిట్ చేయగానే ఖాతాదారులకు కొత్త చెక్ బుక్కులు ఇస్తారు. చాలా మందికి ఇప్పటికే వారి వారి అడ్రస్‌లకు పంపించినట్లు టీజీబీ తెలిపింది.
- ఏపీజీవీబీ మొబైల్ బ్యాంకింగ్ యూజర్లు ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ నుంచి టీజీబీ మొబైల్ బ్యాంకింగ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని మళ్లీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- ఇప్పటికే ఎవరైనా చెక్ జారీ చేస్తే 90 రోజుల వరకు చెల్లుబాటు అవుతుంది. కాబట్టి ఎలాంటి ఆందోళన పడాల్సిన పని లేదు.
- ఇక ఇంటర్నెట్ బ్యాంకింగ్ కోసం www.tgbhyd.in ను సందర్శించి లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.
- RTGS, NEFT వంటి హై వాల్యూ ట్రాన్సాక్షన్ల కోసం IFSC కోడ్ మారుతుంది. కొత్త కోడ్ ప్రకారం లావాదేవీలు నిర్వహించాల్సి ఉంటుంది.
- అలాగే తెలంగాణ గ్రామీణ బ్యాంక్ వాట్సాప్ బ్యాంకింగ్ అండ్ మిస్డ్ కాల్ అలర్ట్ సేవల కోసం 92780 31313 ను సంప్రదించాలి.
- ఏపీజీవీబీ తెలంగాణ ప్రాంత కస్టమర్లకు మాత్రమే ఈ రూల్స్ వర్తిస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కస్టమర్లకు ఏపీజీవీబీనే యథావిధిగా సేవలందిస్తుంది