Maha Kumbh 2025: ప్రయాగ్ రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్..కుంభమేళా ఈ 4 ప్రదేశాల్లోనే ఎందుకు!
Kumbh Mela 2025: పన్నెండేళ్లకోసారి జరిగే కుంభమేళా మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. కుంభమేళా అంటే ఈ 4 ప్రదేశాల్లోనే ఎందుకు చేస్తారో తెలుసా...
Maha Kumbh 2025: భోగి రోజు ప్రారంభమయ్యే కుంభమేళా.. శివరాత్రితో పూర్తవుతుంది... ఈ ఆధ్యాత్మిక ఉత్సవం నాలుగు ప్రదేశాల్లో జరుగుతుంది. దీని వెనుక పురాణాల్లో ఓ కథనం ఉంది. అమృతం కోసం క్షీరసాగర మథనం చేశారు దేవతలు-రాక్షసులు. అప్పుడు వెలువడిన అమృత కలశాన్ని జయంతుడు అనే కాకి నోట కరుచుకుని భూమి చుట్టూ తిరుగుతుంది..ఈ జయంతుడు అనే కాకి ఎవరో కాదు ఇంద్రుడి కొడుకు. గౌతమ మహర్షి శాప ప్రభావంతో కాకిగా మారి చివరకు రాముడి చేతిలో శాపవిమోచనం పొందుతాడు. అహల్యపై మనసు పడిన తండ్రి కాంక్ష తీరాలంటే...గౌతముడిని బయటకు పంపించాలని ఆలోచిస్తాడు జయంతుడు. అందుకే కాకి రూపంలో గౌతమ మహర్షి ఇంటిముందుకు వెళ్లి అరుస్తాడు. కాకి అరుపు విని నదీస్నానానికి బయలుదేరుతాడు గౌతముడు. ఆ తర్వాత కాకి రూపంలో వచ్చింది జయంతుడు అని తెలిసి..కాకిగానే మారిపో అని శపించాడు.
Also Read: కుంభమేళాకి నాగ సాధువులు, అఘోరాలు ఎందుకొస్తారు - ఆధ్యాత్మిక ఉత్సవాల్లో అఖాడాల పాత్ర ఏంటి!
ఈ జయంతుడు అమృత కలశాన్ని తీసుకుని 12 రోజుల పాటూ భూమి చుట్టూ తిరిగాడు రాక్షసులకు అందకుండా. మానవులకు ఏడాది కాలం అంటే దేవతలకు ఓ రోజుతో సమానం. దక్షిణానయం రాత్రి సమయం..ఉత్తరాయణం పగటి సమయం అని అందుకే చెబుతారు. ఈ లెక్కన దేవతలకు 12 రోజులు అంటే మానవులకు 12 సంవత్సరాలు అని అర్థం. అందుకే 12 ఏళ్లకోసారి కుంభమేళా నిర్వహిస్తారు.
జయంతుడు అమృత కలశం తీసుకుని భూమిమొత్తం తిరిగినప్పుడు ఈ నాలుగు ప్రదేశాల్లోనే కుంభమేళా నిర్వహిస్తారు ఎందుకంటే.. ఆ అమృత కలశం నుంచి నాలుగు చుక్కలు ఈ నాలుగు ప్రదేశాల్లో పడ్డాయి. అందుకే ఇవి అత్యంత పవిత్రమైన ప్రదేశాలుగా చెబుతారు పండితులు. అమృతం పడిన ఆ నాలుగు ప్రదేశాలో ప్రయాగ్ రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్....అందుకే వీటిని వైకుంఠంతో సమానమైన ప్రదేశాలు అంటారు. గంగ, యమున నదుల సంగమ ప్రదేశంలో సరస్వతి అంతర్వాహినిగా ఉంటుంది. ఈత్రివేణి సంగమంలో కుంభమేళా సమయంలో రాజస్నానం ఆచరిస్తారు.
Also Read: 2025 భోగి నుంచి మహాశివరాత్రి వరకూ మహా కుంభమేళా - అది పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంలో రాజ స్నానం తేదీలివే!
జనవరి 13 భోగి రోజు నుంచి ప్రారంభమయ్యే మహా కుంభమేళాకి ఈ ఏడాది 40 లక్షల మంది వస్తారని అంచనా. 2013 లో జరిగిన కుంభమేళాకి 20 కోట్లమంది భక్తులు హాజరయ్యారని ఈ సంఖ్య ఈసారి రెట్టింపు ఉంటుందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా. గతంలో 4700 కోట్ల రూపాయలు ఖర్చు కాగా..ఈ సారి కుంభమేళాకి 6500 రూపాయలు ఖర్చవుతుందని ప్రభుత్వ అంచనా. ఇప్పటికే భక్తుల రాక ప్రారంభం కావడంతో ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభమేళా జరిగే ప్రదేశాలైన త్రివేణి సంగమం ఘాట్, హనుమాన్ ఆలయ కారిడార్, సరస్వతి ఘాట్, అరైల్ ఘాట్ మార్గాల్లో ఆంక్షలు కనిపిస్తున్నాయి. పారిశుధ్ద్య ఏర్పాట్లు, భారీ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
కుంభమేళాకు తరలివచ్చే కోట్లాది భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేస్తున్నారు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాధికారులు. ముఖ్యంగా స్నానపు ఘాట్లు, స్నానానంతరం దుస్తులు మార్చుకునే గదులు సిద్ధం చేస్తున్నారు. మరో వైపు టెంట్ల నిర్మాణం సాగుతోంది. కుంభమేళా ప్రాంతంలో ఫ్లోటింగ్ బ్రిడ్జిలు నిర్మిస్తున్నారు. ఈ బ్రిడ్జిలు కేవలం నడిచేందుకే కాదు..5 టన్నుల బరువున్న వాహనాలు కూడా ప్రయాణించే అవకాశం ఉంది. అఖాడాలు, శంకరాచార్య, మహామండలేశ్వర్లతో పాటు వివిధ సంస్థలకు టెంట్లు వేసుకునేందుకు ఉచితంగా స్థలం కేటాయిస్తున్నారు. భక్తుల కోసం టెంట్ సిటీ పేరుతో తాత్కాలిక టెంట్లు నిర్మిస్తున్నారు..మరోవైపు టూరిజం శాఖతో పాటూ ప్రైవేట్ సంస్థలు కూడా టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు..వీటిని ముందుగా బుకింగ్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది టూరిజం శాఖ.
Also Read: మహా కుంభమేళాకి ప్రయాగ్ రాజ్ లో భారీ ఏర్పాట్లు.. తెలుగు రాష్ట్రాల నుంచి IRCTC స్పెషల్ ట్రైన్స్!