Srikakulam News: టెక్నాలజీ సాయంతో గంజాయి కట్టడి చేస్తున్న శ్రీకాకుళం పోలీసులు- రంగంలోకి డ్రోన్‌లు
Srikakulam: టెక్నాలజీ ఉపయోగించి శ్రీకాకుళంజిల్లా గంజాయిని నాశనం చేస్తామంటున్నారు పోలీసులు. డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా పెట్టి మరీ అక్రమార్కుల ఆట కట్టిస్తున్నారు.
Srikakulam News: శ్రీకాకుళం జిల్లాలో గంజాయి నిర్మూలనే ధ్యేయంగా పోలీసులు నడుంబిగించారు. జిల్లాను మాదకద్రవ్యరహితంగా తీర్చిదిద్దాలని ఎస్పీ కెవీ మహేశ్వర్ రెడ్డి సిబ్బందిలో ఉత్సాహాన్ని నింపారు. దీని కోసం రూపొందించిన ప్రత్యేక కార్యచరణనను వారికి వివరించారు. ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోతో కలిసి సంయుక్తంగా మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేశారు. పోలీస్ జాగిలాలతో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. నిర్మానుష్యమైన ప్రదేశాల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. అంతే కాకుండా ప్రజలు గంజాయి మోజు పడకుండా ఉండేందుకు సంకల్పం పేరుతో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. చాలా ప్రాంతాల్లో ప్రత్యేకంగా చెక్ పోస్టులు పెట్టారు.
మూడు ప్రధాన చెక్ పోస్టులు...
జిల్లా సరిహద్దుగా ఇచ్చాపురం పురుషోత్తపురం, పాతపట్నం, పైడిభీమవరం సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, అన్ని విభాగాల సమన్వయంతో స్థానిక పోలీసులతో అక్రమ రవాణాకు అవకాశం ఉన్న మార్గాల్లో ఆకస్మికంగా వాహన తనిఖీలు చేపట్టి, ఆర్టీసీ బస్సులు, లారీలు, కార్లు, స్టేజి క్యారియర్, ఇతర వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. విజిబుల్ పోలీసింగ్ అనే ప్రత్యేక డ్రైవ్ చేపట్టి, గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు వాహన తనిఖీలు నిర్వహించి చర్యలు చేపట్టారు
స్పెషల్ టాస్క్ ఫోర్స్..
గంజాయి మూలాలను కనిపెట్టేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఈ బృందాలు జిల్లాలో గంజాయి వినియోగంక్రయ విక్రయాలు, అక్రమ రవాణా, నిల్వలు గుర్తించేందుకు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. గంజాయి నిల్వలు గుర్తించేందుకు శ్రీకాకుళం టూ టౌన్, ఆమదాలవలస, సోంపేట, ఇచ్చాపురం పోలీసు స్టేషను పరిధిలో బృందాలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. పోలీసు జాగిలాల సహాయంతో రైల్వే స్టేషను, ఆర్.టి.సి కాంప్లెక్స్, పార్సిల్ సర్వీసు, ట్రాన్స్ పోర్టు కార్యాలయాలు, కార్గో సర్వీసులు, గొడౌన్లు, లాడ్జిలలో ముమ్మర వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. గంజాయ్ క్రయ విగ్రహాలు జరిగేందుకు అవకాశం ఉన్న అనుమానం ఉన్న ప్రాంతాలను క్షుణ్ణంగా సోదాలు చేస్తున్నారు.
డ్రోన్ కెమెరాతో నిఘా...
శ్రీకాకుళం పట్టణంతోపాటు జిల్లావ్యాప్తంగా నిర్మాణష్యమైన పట్టణ శివారు ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. జిల్లాలో గంజాయి వినియోగం రవాణా నియంత్రణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. నేరాల కట్టడికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ప్రతీ పోలీసు స్టేషను పరిధిలో శివారు ప్రాంతాలను, తోటలు, బహిరంగ ప్రదేశాలను, పార్కులు, నదీ పరీవాహక ముందుగా గుర్తించి, ఆయా ప్రాంతాలపై డ్రోన్స్ పంపి, నిఘా ఏర్పాటు చేస్తున్నారు.
'సంకల్పం' పేరుతో అవగాహనా..
మాదక ద్రవ్యాలు వినియోగం వలన కలిగే అనర్థాలు, దుష్ప్రభావాల గురించి క్షేత్ర స్థాయిలో జిల్లాలో పోలీసు అధికారులు, సిబ్బంది వారి పరిధిలో ఉన్న పాఠశాలలు, కళాశాలలు విద్యార్థిని, విద్యార్థులకు గ్రామ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. సంకల్పం పేరిట చైతన్యం కలిగిస్తున్నారు.
గంజాయి, డ్రగ్స్ తదితర మత్తు పదార్థాలు వినియోగంతో కలిగే అనర్థాలపై యువత, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్టు జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ క్రమంలో గంజాయి రవాణాదారులపై 2022 సంవత్సరంలో 10 కేసులు పెట్టి, 26 మందిని అరెస్టు చేశారు. 583.67 కేజీల సరకు స్వాధీనం చేసుకున్నారు. 2023లో 19 కేసులు నమోదు చేసి 65 మందిని అరెస్టు చేశారు. సుమారు 338.8 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 2024లో ఇప్పటివరకు 40 కేసుల్లో 106 మందిని అరెస్టు చేశారు. 1250.8 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గత రెండు నెలల్లో 26 కేసుల్లో 63మందిని అదుపులోకి తీసుకున్నారు. 885.43 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
జిల్లాలో గంజాయిని పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు. గంజాయి వినియోగం, సేవించడం, క్రయవిక్రయాలు, అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మాదక ద్రవ్యాలకు బానిసై అమూల్యమైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి కోరారు.
Also Read: ఒప్పందాల సమీక్షకు వెనుకాడం - ఏపీ తరపునా దర్యాప్తు - అదానీ వ్యవహారంపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్