TTD News: చిరుత దాడిలో చనిపోయిన బాలిక కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం
TTD News: తిరుమల నడక దారిలో శుక్రవారం రాత్రి చిరుత దాడికి గురై మరణించినట్లు భావిస్తున్న బాలిక లక్షిత కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా అందిస్తామని టీటీడీ చైర్మన్ భూమన ప్రకటించారు.
![TTD News: చిరుత దాడిలో చనిపోయిన బాలిక కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం Rs 10 lakh compensation to the family of the girl who was mauled by a cheetah on the walkway of Tirumala TTD News: చిరుత దాడిలో చనిపోయిన బాలిక కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/12/b8c222f6ffb2126632c58fecfe3ae9df1691846114110798_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
TTD News: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. సంఘటనకు దారి తీసిన పరిస్థితులపై శనివారం సాయంత్రం అధికారులతో ఆయన మాట్లాడారు. అనంతరం చిరుత దాడిలో మృతి చెందినట్లుగా భావిస్తున్న బాలిక లక్షిత మృతదేహం లభించిన ప్రాంతాన్ని అధికారులతో కలసి భూమన పరిశీలించారు.
క్రూరమృగం బాలికను ఎలా అడవిలోకి తీసుకుని వచ్చి ఉండవచ్చనే విషయాన్ని అటవీ, టీటీడీ అటవీ, విజిలెన్స్ అధికారులు ఆయనకు వివరించారు. అనంతరం చైర్మన్ మీడియాతో మాట్లాడారు. జరిగిన సంఘటన బాధాకరమన్నారు. జూన్ 22 వ తేదీ ఇలాంటి సంఘటనే జరిగిన నేపథ్యంలో భక్తుల భద్రత విషయంపై టీటీడీ ఇప్పటికే అనేక జాగ్రత చర్యలు తీసుకుందన్నారు. అటవీ, పోలీస్, టీటీడీ అధికారులు చర్చించి భద్రతా పరమైన ప్రతిపాదనలు చేస్తే టీటీడీ ఖర్చుతో ఏర్పాటు చేస్తామని చెప్పారు.
భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా సాంకేతికంగా కూడా ఎలా ఎదుర్కోవాలనే దిశగా ఆలోచన చేస్తామని భూమన తెలిపారు. అటవీ సంరక్షణ చట్టాలు సమర్థవంతంగా అమలు జరుగుతున్నందువల్ల వన్య ప్రాణుల సంఖ్య కూడా పెరిగిందని, భక్తులు వీటి బారిన పడకుండా ఎలా రక్షణ కల్పించాలనేదే టీటీడీకి ముఖ్యమన్నారు. బాలిక కనిపించడం లేదన్న సమాచారం అందిన వెంటనే టీటీడీ అటవీ, పోలీస్,విజిలెన్స్, ప్రభుత్వ అటవీ శాఖ అధికారులు, సిబ్బంది అడవిలో గాలింపు ప్రారంభించారని అన్నారు.
ఎవరి నిర్లక్ష్యం లేదు
బాలిక మృతిలో ఎవరి నిర్లక్ష్యం లేదని ఒక ప్రశ్నకు భూమన సమాధానం ఇచ్చారు. బాలిక కుటుంబాన్ని టీటీడీ తరపున ఆదుకుంటామని చెప్పారు. చిన్న పిల్లలతో నడక మార్గంలో తిరుమలకు వచ్చే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని, ఎటువంటి పరిస్థితుల్లో కూడా పిల్లలను పక్కకు వదల వద్దని చైర్మన్ విజ్ఞప్తి చేశారు. టీటీడీ డిప్యూటీ సీఎఫ్ శ్రీనివాస్, డీఎఫ్వో సతీష్, వీజీఓ గిరిధర్, సీఐ జగన్మోహన్ రెడ్డి, ఇతర అధికారులు చైర్మన్ వెంట ఉన్నారు.
లక్షిత కుటుంబానికి రూ 10 లక్షల ఎక్స్ గ్రేషియా
తిరుమల నడక దారిలో శుక్రవారం రాత్రి చిరుత దాడికి గురై మరణించినట్లు భావిస్తున్న బాలిక లక్షిత కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా అందిస్తామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రకటించారు. మృతురాలి కుటుంబసభ్యులకు ఆయన సానుభూతి తెలిపారు. టీటీడీ రూ5 . లక్షలు, అటవీ శాఖ రూ.5 లక్షలు కలిపి మొత్తం రూ.10 లక్షలు లక్షిత కుటుంబానికి అందజేస్తామని ఆయన చెప్పారు.
శ్రీవారి దర్శనానికి వచ్చి
నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డి పాలెం వాసులు దినేష్, శశికళ కుటుంబం శ్రీవారి దర్శానానికి వెళ్లారు. అలిపిరిలోని నడక మార్గంలో రాత్రి ఎనిమిది గంటలకు బయల్దేరారు. రాత్రి 11 గంటలకు లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి చేరుకున్నారు. వారి కంటే ముందుగా వెళ్లిన లక్షిత కనిపించకపోయే సరికి ఆలయ భద్రతా సిబ్బందికి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన టీటీడీ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఉదయం చెట్ల పొదల్లో లక్షిత శవమై కనిపించింది. పోస్టుమార్టం రిపోర్టులో చిరుత దాడిలో పాప చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)