Nellore: వంతెనపై లారీ ఢీ.. వాగులోకి ఎగిరిపడ్డ ఆటో, ముమ్మాటికీ అతనిదే తప్పు.. జిల్లా ఎస్పీ వెల్లడి
బీరాపేరు వాగు వంతెన పైకి ఆటో చేరుకోగానే, ఎదురుగా వచ్చిన రెండు లారీలు ఒకదానికొకటి ఓవర్ టేక్ చేయబోయాయి. ఆ క్రమంలో ఆటోను లారీ ఢీకొట్టింది.
నెల్లూరు జిల్లా సంగం వద్ద బీరాపేరు వాగులో ఆటో పడిపోయిన దుర్ఘటనకు లారీ డ్రైవర్‌దే తప్పు అని జిల్లా ఎస్పీ విజయరావు తెలిపారు. రాత్రి వరకు జరిపిన రెస్క్యూ ఆపరేషన్‌లో ఐదుగురి జాడ ఇంతవరకూ కనిపించలేదని, వారికోసం వెతకడం ముమ్మరంగా జరుగుతోందని చెప్పారు. ‘‘ఆటో ఆత్మకూరు నుంచి సంగం వైపు వెళ్తోంది. లారీ నెల్లూరునుంచి ఆత్మకూరు వైపు వస్తోంది. ఈ క్రమంలో మరో లారీని ఓవర్ టేక్ చేసే సందర్భంలో ఆటోని ఢీకొట్టింది’’ అని ఎస్పీ విజయరావు చెప్పారు. నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ హరేందిర ప్రసాద్ కూడా సంఘటనా స్థలానికి వచ్చి సహాయక చర్యలను పర్యవేక్షించారు.
నెల్లూరు జిల్లాలోని సంగం సమీపంలో గురువారం రాత్రి నెల్లూరు - ముంబయి హైవేపై ఓ ఆటోను లారీ ఢీకొంది. సంగానికి మూడు కిలో మీటర్ల దూరంలో జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ బాలిక చనిపోగా.. ఐదుగురు వాగులో గల్లంతయ్యారు. వీరి ఆచూకీ తెలియాల్సి ఉంది. ఆ సమయంలో ఆటోలో 12 మంది ప్రయాణికులు ఉన్నారు. లారీ ఢీకొనడంతో ఆటో ఎగిరి బీరాపేరు వాగులో పడిపోయింది. దాంతో అయిదుగురు ఆ వాగులో గల్లంతయ్యారు. మిగిలిన ఏడుగురిలో ముగ్గురు ఈదుకుంటూ బయటకు వచ్చాయి. మిగతావారిని స్థానికులు, పోలీసులు కాపాడి తీసుకొచ్చారు. వీరిలో నాగవల్లి అనే 14 ఏళ్ల బాలిక చనిపోయింది. అయితే, ఆటోలో ప్రయాణిస్తున్న వారంతా ఒకే కుటుంబానికి చెందినవారు ఉన్నారు.
వాగులో పడ్డ ఆటో
నెల్లూరు జిల్లా ఆత్మకూరు జ్యోతి నగర్‌కు చెందిన కె.నాగభూషణం ఫ్యామిలీ సంగంలోని సంగమేశ్వరాలయంలో నిద్ర చేయడం కోసం అంతా ఆటోలో బయలుదేరారు. బీరాపేరు వాగు వంతెన పైకి ఆటో చేరుకోగానే, ఎదురుగా వచ్చిన రెండు లారీలు ఒకదానికొకటి ఓవర్ టేక్ చేయబోయాయి. ఆ క్రమంలో ఆటోను లారీ ఢీకొట్టింది. దాంతో ఆటో 15 అడుగుల దిగువనున్న వాగులో పడిపోయింది. అటుగా వెళ్తున్న వారు గమనించి.. ఈ విషయం గురించి పోలీసులకు తెలిపారు.
నదిలో పడిపోయిన వారిలో నందు, నాగసాయి, నాగభూషణం అనే యువకులు ఈదుకుంటూ వాగు లోంచి బయటకు చేరుకున్నారు. లక్ష్మీదేవి, కృష్ణకుమారి, నాగవల్లి, నవదీప్ అనే నలుగురిని స్థానికులు, పోలీసులు బయటకు తీసుకొచ్చారు. సంపూర్ణమ్మ, పుల్లయ్య, నాగరాజు, పద్మ, ఆదెమ్మ వాగులో గల్లంతయ్యారు. సంగం పోలీసులు దగ్గరుండి ప్రజల సాయంతో సహాయక, గాలింపు చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.