Raptadu Politics : గుంటూరు టు రాప్తాడు - రోడ్డు మీదకు టీడీపీ- వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వార్ !
సోషల్ మీడియా వార్ కాస్తా రోడ్ల మీదకు రావడంతో అనంతపురంలో ఉద్రిక్తత ఏర్పడింది. క్లాక్ టవర్ వద్ద వైఎస్ఆర్‌సీపీ, టీడీపీ కార్యకర్తల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
Raptadu Politics : గుంటూరుకు చెందిన హరికృష్ణారెడ్డి అనే వైఎస్ఆర్‌సీపీ కార్యకర్త సోషల్ మీడియాలో సవాల్ చేసి.. రాప్తాడు టీడీపీ కార్యాలయం దగ్గర రెచ్చగొడుతూ చేసిన వీడియోలతో అనంతపురంలో ఉద్రిక్తత ఏర్పడింది. తాను అనంతపురం క్లాక్ టవర్ వద్దకు వస్తానని.. ఎవరైనా సరే అక్కడికి రావాలంటూ హరికృష్ణారెడ్డి అనే ఆ కార్యకర్త సోషల్ మీడియాలో వడియోలు పెట్టడంతో అనంతపురం క్లాక్ టవర్ దగ్గరకు టీడీపీ కార్యకర్తలు చేరుకున్నారు. అయితే పోలీసులు వారందర్నీ అదుపులోకి తీసుకున్నారు. వైఎస్ఆర్ సీపీ కార్యకర్త హరికృష్ణారెడ్డిని కూడా రాప్తాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రాజకీయ పార్టీల సోషల్ మీడియా సైన్యాలు ఒకరితో ఒకరు వాదనలు పెట్టుకుంటూ టైంపాస్ చేస్తూంటాయి. ఇవి ఇటీవల సవాళ్ల స్థాయికి వెళ్లాయి. రెండు పార్టీలకు చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు రాప్తాడు అభివృద్ధిపై వాదనలకు దిగారు. టీడీపీ కార్యకర్త ఒకరు.. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కబ్జాలకు పాల్పడ్డారని.. జాకీ పరిశ్రమను వెళ్లగొట్టారని వ్యాఖ్యానించారు. దీంతో వైసీపీ సోషల్ మీడియా మద్దతుదారులు మరికొందరు పరిటాల కుటుంబం పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.రెండు పార్టీలకు చెందిన ఇద్దరు వ్యక్తులు మా నేత గొప్ప అంటే మా నేత గొప్ప అంటూ సోషల్ మీడియాలో సవాళ్లు విసురుకున్నారు. పరిటాల కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో అటు వైపు వ్యక్తి దమ్ముంటే రాప్తాడు వెళ్లి మాట్లాడు అంటూ సవాల్ విసిరారు. గుంటూరు జిల్లాలో ఉండి మాట్లాడటం కాదు.. రాప్తాడుకు వస్తే ఎవరు ఏంటో తెలుస్తుందంటూ సవాల్ విసిరాడు.
దాంతో గుంటూరుకు చెందిన వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్త హరికృష్ణారెడ్డి తాను రాప్తాడు, అనంతపురం వచ్చానంటూ వైసీపీ మద్దతుదారుడు వీడియో రిలీజ్ చేయడంతో పాటు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. తాను ను రాప్తాడు వచ్చానని దేవుని భూమి కబ్జా చేసి కట్టిన టీడీపీ కార్యాలయం దగ్గరే ఉన్నానన్నారు. అలాగే జాకీ పరిశ్రమ స్థలం వద్దకు కూడా వెళ్లి 150కోట్ల భూమిని జాకీకి ఇచ్చారని.. కనీసం ఇక్కడ పాకలు కూడా లేవంటూ వీడియో రిలీజ్ చేశాడు. ఇది మీ వాళ్ల నిజస్వరూపం.. అనంతపురం టవర్ క్లాక్ దగ్గరకు, రాప్తాడుకు వచ్చి చెబుతున్నానంటూ ఆ వ్యక్తి కామెంట్స్ చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
విషయం తెలిసిన పోలీసులు ఉలిక్కి పడ్డారు. వెంటనే క్లాక్ టవర్ వద్దకు చేరుకుని.. హరికృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు. క్లాక్ టవర్ వద్దకు వచ్చిన టీడీపీ కార్యకర్తల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన రాళ్ల దాడిలో ఓ పోలీసు అధికారి తలకు గాయం కావడంతో ఆస్పత్రికి తరలించారు.
రెండు పార్టీల సోషల్ మీడియా కార్యకర్తలు... అక్కడ వాదించుకోకుండా.. నేరుగా రంగంలోకి దిగడం.. సవాళ్లు చేసుకోవడం శాంతి భద్రతల సమస్యలు సృష్టిచేలా వ్యవహరిస్తండటంతో పోలీసులకూ తలనొప్పులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో ఓ రేంజ్ యుద్ధం రెండు పార్టీల సోషల్ మీడియా సైన్యాల మధ్య జరుగుతోంది.