Chandrababu: ఆదర్శజంటకు చంద్రబాబు ఆశీస్సులు - పెళ్లికి రూ.ఐదు లక్షల ఆర్థిక సాయం
Couple: ఆదర్శ జంట పెళ్లికి చంద్రబాబు ఐదు లక్షల ఆర్థిక సాయంచేశారు. ఆ జంటలో యువతి అంధురాలు.

Ideal couple wedding: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన వద్దకు వచ్చే చిన్న చిన్న విజ్ఞప్తుల విషయాన్ని కూడా సీరియస్ గా పరిశీలన చేస్తారు. వీలైనంత వరకూ సీఎంఆర్ఎఫ్ కింద సాయం చేస్తారు. చాలా సార్లు వ్యక్తిగతంగానూ సాయం చేస్తారు. ఇలా ఓ జంట సాయం కోసం చేసిన విజ్ఞప్తికి స్పందించారు.
పుట్టుకతో అంధురాలైన యువతి పెళ్లికి చంద్రబాబు సాయం
కుప్పం నియోజకవర్గంలో రాళ్లబుదుగూరు అనే గ్రామం ఉంటుంది. ఆ గ్రామానికి చెందిన ఆర్ నాగమణికి పుట్టుకతోనే చూపు సమస్య ఉంది. అయినప్పటికీ ఆత్మస్థైర్యం, పట్టుదల, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఎంఏ వరకూ చదువుకుంది. ఆమె అంధురాలు కావడం, కుటుంబం ఆర్థికంగా బాగా ఇబ్బందుల్లో ఉండటంతో వివాహమవ్వడం భారంగా మారింది. అయితే నాగమణి పట్టుదలను చూసి ఆకర్షితుడైన శాంతిపురం మండలం, వెంకటాపురం గ్రామానికి చెందిన భూపతి అనే యువకుడు జీవితాన్ని పంచుకునేందుకు నిర్ణయించుకున్నారు. ఇద్దరూ చదువుకున్న వారే కావడంతో.. నాగమణికి చూపు సమస్య ఉన్నప్పటికీ.. కలసి జీవించగలమన్న నమ్మకంతో పెళ్లి చేసుకునేందుకు ఇద్దరూ సిద్ధమయ్యారు.
కుటుంబానికి అండగా ఉంటానని చంద్రబాబు హామీ
అయితే ఇద్దరివీ పేద కుటుంబాలే. వీరు తమ నియోజకవర్గం ఎమ్మెల్యే.. ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తమ సమస్య వెళ్లేలా చేశారు. రోజుల వ్యవధిలోనే వారికి పిలుపు వచ్చింది. ఆ జంట స్ఫూర్తిని కొనియాడిన చంద్రబాబు రూ. ఐదు లక్షల ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించారు. బుధవారం సీఎం చంద్రబాబును కలిసి చెక్కు అందుకున్నారు. నాగమణిని వివాహం చేసుకుని తోడ్పాటుగా ఉండేందుకు ముందుకువచ్చిన భూపతిని సీఎం చంద్రబాబు అభినందించారు. కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
కుప్పం ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చంద్రబాబు ప్రత్యేక ఏర్పాట్లు
కుప్పం ప్రజలకు చంద్రబాబు నిరంతరాయంగా అందుబాటులో ఉండలేరు కానీ.. అక్కడి ప్రజలు నేరుగా తనకు సమస్యలు విన్నవించుకునే ఏర్పాట్లు చేశారు. గ్రామాలకు చెందిదన సమస్య అయినా.. వ్యక్తిగత సమస్య అయినా చంద్రబాబుకు చెప్పుకునే ఏర్పాట్లు చేశారు. కుప్పం నియోజకవర్గ ఇంచార్జ్ గా ఎమ్మెల్సీ శ్రీకాంత్ వ్యవహరిస్తున్నరు. ఆయన ద్వారా ప్రజలకు చంద్రబాబు అందుబాటులో ఉండేలా చూసుకుంటున్నారు.





















