Posani Krishna Murali Arrest: వియ్ స్టాండ్ విత్ పోసాని అంటున్న వైసిపీ- సిగ్గుందా అని ప్రశ్నిస్తున్న టీడీపీ, జనసేన
Andhra Pradesh: వియ్ స్టాండ్ విత్ పోసాని అంటున్న వైసిపీ పోస్టులు పెడుతుంటే... ఆయన వాడిన భాష విన్నాక అలా చెప్పడానికి సిగ్గుందా అని టీడీపీ ప్రశ్నిస్తోంది. ఇదే అంశంపై సోషల్ మీడియాలో ఫైట్ నడుస్తోంది.

వైసిపి మద్దతుదారుడు, సినీ నటుడు పోసాని కృష్ణ మురళి అరెస్టుతో సోషల్ మీడియాలో హోరా హోరీ చర్చ నడుస్తోంది. బుధవారం రాత్రి హైదరాబాదులోని ఆయన నివాసంలో పోసాని కృష్ణ మురళిని అదుపులోకి తీసుకున్నారు రాయచోటి పోలీసులు. రాత్రికి రాత్రి ఆయన్ని ఏపీకి తరలించి ఆయన్ను అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. దానితో ఆయనకు మద్దతుగా వైసిపి సోషల్ మీడియా వరుస పోస్టులతో "వియ్ స్టాండ్ విత్ పోసాని" హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండింగ్‌లో తేవడానికి ప్రయత్నిస్తోంది.
పోసాని అరెస్టు అక్రమమని, ప్రశ్నిస్తే అరెస్ట్ చేసేస్తారా అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక హ్యాండిల్‌లోనే పోస్ట్ చేసింది. ఇక వైసిపి అభిమానులు వాళ్ళు సోషల్ మీడియా వింగ్స్ ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. విచిత్రంగా పోసాని కృష్ణ మురళి వైసిపికి మద్దతుదారుడుగానే కొనసాగారు. ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి కూడా పొందారు. కానీ వైసీపీలో అధికారిక సభ్యత్వం మాత్రం తీసుకోలేదు. అలాంటిది పోసాని కోసం వైసీపీ సోషల్ మీడియా అండగా నిలబడే ప్రయత్నం చేస్తోంది. పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం పోసాని భార్యతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. తమ లీగల్ టీమ్ అన్ని విషయాలు చూసుకుంటుందని కంగారు పడొద్దు అని భరోసా ఇచ్చారు.
స్థానిక వైసిపి నాయకుడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి సైతం పోసానికి అందించాల్సిన లీగల్ సపోర్టుపై సూచనలు అందజేశారు. వైసిపి సోషల్ మీడియా మాత్రం ఈ అరెస్టు దారుణమని సినిమా ఫీల్డ్ నుంచి జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలిచినందుకే ఇలా పోసాని కృష్ణ మురళిని కూటమి టార్గెట్ చేస్తుందంటూ వరుస పోస్టులు వైరల్ చేస్తున్నారు. ఇది అన్యాయమైన అరెస్ట్ అనేది వారి ఉద్దేశం.
Also Read: పార్టీ ప్లీనరీ ముందు ఈ స్టేట్మెంట్ అవసరమా జనసేనానీ
సిగ్గుందా అంటున్న టిడిపి సోషల్ మీడియా
వైసిపి సోషల్ మీడియా ప్రచారానికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది టిడిపి సోషల్ మీడియా వింగ్స్. అంత పార్టీ లీడర్లు అరెస్ట్ అయితే స్పందించడానికి ఒకటి రెండు రోజులు టైం తీసుకున్న వైసీపీ అధినాయకత్వం పోసాని విషయంలో మాత్రం ఎందుకు అంత చొరవ చూపుతోందని అంటున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రెస్‌మీట్‌లు పెట్టి మరీ పోసాని కృష్ణ మురళి వాడిన భాష గుర్తులేదా అంటూ ఆ క్లిప్స్ వైరల్ చేస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, పవన్ , లోకేష్‌పై పోసాని చేసిన ఆరోపణలు విమర్శలు పూర్తిగా హద్దు దాటిపోయాయని రాయలేని భాషలో దుర్భాషలు ఆడారని వీడియో క్లిప్పింగ్స్‌తో సహా పోస్ట్ చేస్తున్నారు.
కథా రచయితగా సినిమా ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ అందుకున్న పోసాని క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ అద్భుతంగా రాణించారు. మొదట్లో ప్రజారాజ్యంలో ఉన్న పోసాని తరువాత వైసీపీకి దగ్గరయ్యారు. జగన్ పాదయాత్ర సమయంలో వెళ్లి తన మద్దతు ప్రకటించారు. చిరంజీవి ప్రభాస్ లాంటి స్టార్ హీరోలు అప్పటి ఏపీ సీఎం జగన్ కలవడానికి వెళ్ళినప్పుడు పోసాని కృష్ణ మురళిని కూడా ఆ మీటింగ్ ఆహ్వానించి సమావేశంలో పాల్గొనేలా చేశారు జగన్మోహన్ రెడ్డి.
మొదట్లో అభ్యుదయ భావాలు కలిగిన మేధావిగా పేరుందిన పోసాని భాష విషయంలో కంట్రోల్ లేకపోవడంతో న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కు పోయారన్న వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌పై వాడిన భాష అటు జన సైనికులకు తీవ్ర ఆగ్రహం రప్పించడమే కాకుండా పోసానికి వ్యతిరేకంగా కేసులు నమోదయ్యే స్థాయికి తీసుకెళ్ళింది. కూటమి అధికారంలోకి రాగానే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అంటూ పోసాని ప్రకటించినా ప్రస్తుతం అయితే పాత కేసులు ఆయన మెడకు చుట్టుకుంటున్నాయి. మరి వీటన్నిటి నుంచి పోసాని ఎలా బయటపడతారో చూడాలి.
Also Read: శ్రీకాకుళం నుంచి అనంత వరకు పోసానిపై నమోదైన కేసులు చిట్టా ఇదే!





















