Hyderabad: ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు చచ్చిపోయేలా చేశాడు - హైదరాబాద్‌లో ఓ ప్రేమికురాలి విషాదాంతం!
Crime News: హైదరాబాద్‌లో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఆరు నెలల క్రితమే ప్రేమించి గ్రాండ్‌గా పెళ్లి చేసుకుంది. కానీ అప్పుడే ప్రాణం తీసుకుంది.

Hyderabad Crime News: ప్రేమించినప్పుడు అంతా నందనవనం.. పెళ్లి చేసుకున్న తర్వాత నరకం. అది ఎలా ఉంటుందంటే ఇంకా ఎందుకు బతికి ఉన్నానా అనిపించేంత నరకం. అలాంటి నరకాన్ని అనుభవించిన దేవిక ఇక తనకా జీవితం వద్దని చాలించేసింది.
ప్రశాంతి హిల్స్‌లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని దేవిక ఆత్మహత్య
రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో దేవిక అనే సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. 6 నెలల క్రితమే గోవాలో దేవిక, సతీష్ లు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. అంతకు ముందే వీరు ప్రేమలో ఉన్నారు. పెళ్లి తర్వాత ఖజాగుడా ప్రశాంతి హిల్స్‌లో నివాసం ఉంటున్నారు. దంపతులు ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులే. అయితే ఏమయిందో కానీ కానీ ఆదివారం అర్ధరాత్రి ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరివేసుకొని దేవిక ఆత్మహత్యకు పాల్పడింది. సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో దేవిక ఆత్మహత్యకు పాల్పడినట్టు గుర్తించిన భర్త సతీష్ ..పోలీసులకు, దేవిక కుటుంబ సభ్యులకు సమాచారాన్ని ఇచ్చారు.
కట్నం కోసం వేధించారని దేవిక తల్లి ఫిర్యాదు
భార్యాభర్తల మధ్య గొడవలే దేవిక ఆత్మహత్యకు కారణంగా ప్రాధమికంగా అనుమానిస్తున్నారు. వరకట్న వేధింపులే తమ కూతురి ఆత్మహత్యకు కారణమని పోలీసులకు ఫిర్యాదు చేసిన దేవిక తల్లి రామలక్ష్మి.. అల్లుడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. తమ వద్ద ఉన్న డబ్బు కోసమే సతీష్ .. తన కుమార్తెతో ప్రేమ నాటకం ఆడారాని.. పెళ్లి చేసుకున్న మరుక్షణం నుంచి ఆస్తులు, కట్నం కోసం వేధింపులకు గురి చేస్తున్నారని అంటున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు
దేవిక, సతీష్ ఎంతో ప్రేమగా ఉండేవారు. వారి ప్రేమకు గుర్తు ఎన్నో వీడియోలు ఉన్నాయి. సినిమా హీరో, హీరోయిన్ల స్థాయిలో ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ చేయించుకున్నారు. అలాగే గోవాలో బంధువులు, మిత్రుల మధ్య అత్యంత ఘనంగా డెస్టినేషన్ వెడ్డింగ్ కూడా చేసుకున్నారు. ఆరు నెలల్లో ఎంతో అన్యోన్యంగా ఉండాల్సిన జంట మధ్య ఏం జరిగిందో కానీ.. దేవిక ప్రాణం తీసుకుంది. కట్న వేధింపులా..లేకపోతే వ్యక్తిగత సమస్యలా అన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమ ఉండదా ?
ఇద్దరూ ప్రముఖ మల్టినేషనల్ కంపెనీలో పని చేసే ఉద్యోగులు కావడంతో దేవిక ఆత్మహత్య వ్యవహారం సంచలనంగా మారింది. సాఫ్ట్ వేర్ ఉద్యోగుల్లోనూ చర్చనీయాంశమయింది. ప్రేమించుకున్నంత కాలం వారి మధ్య అపోహలు వచ్చేంత గాలి కూడా దూరదని.. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా.. సమస్యలు వచ్చేస్తాయని.. అవి పెరిగి చివరికి ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకునే పరిస్థితి తెస్తుందని విచారం వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరి వీడియో లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.





















