Nara Lokesh Comments: ఏపీ ప్రజల తెగువకు పాదాభివందనం: నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్
Andhra Pradesh Elections 2024: ఏపీలో నేడు జరిగిన ఎన్నికల్లో సాయంత్రం 6 గంటల వరకు దాదాపు 75 శాతం పోలింగ్ నమోదైంది. ఓటింగ్ పూర్తయితే పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది.
Nara Lokesh About AP Elections 2024 | మంగళగిరి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతోపాటు లోక్ సభ స్థానాలకు నేడు ఎన్నికలు జరిగాయి. పోలింగ్ ముగిసిన తరువాత టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి అభ్యర్థి నారా లోకేష్ ఏపీ ఎన్నికలపై స్పందించారు. రాష్ట్రంలో ప్రజాతీర్పును తారుమారు చేసేందుకు వైఎస్సార్ సీపీ చేసిన అన్ని ప్రయత్నాలను తిప్పికొడుతూ పోలింగ్ కేంద్రాలవద్ద ఓట్లతో తిరుగుబాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి అభినందనలు అని ట్వీట్ చేశారు.
తెల్లవారుజాము నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరడం ప్రజలు ఓటుహక్కు వినియోగించుకునేందుకు వెల్లివిరిసిన ప్రజాచైతన్యానికి నిదర్శనం అన్నారు. భావితరాల భవిష్యత్తు కోసం అరాచకశక్తులకు ఎదురొడ్డి రాష్ట్ర ప్రజలు చూపిన తెగువ చరిత్ర పుటల్లో నిలిచిపోతుందన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ఉప్పెనలా పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చిన ఓటరు దేవుళ్లకు పాదాభివందనాలు తెలిపారు. పార్టీ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా శ్రమించిన నాయకులు, కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు.
రాష్ట్రప్రజల తెగువకు పాదాభివందనం!
— Lokesh Nara (@naralokesh) May 13, 2024
రాష్ట్రంలో ప్రజాతీర్పును తారుమారు చేసేందుకు అధికారపార్టీ చేసిన అన్ని ప్రయత్నాలను తిప్పికొడుతూ పోలింగ్ కేంద్రాలవద్ద ఓట్లతో తిరుగుబాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి నా అభినందనలు. తెల్లవారుజాము నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు ఓటుహక్కు…
మంగళగిరి కుటుంబసభ్యులకు ధన్యవాదాలు: లోకేష్
మంగళగిరి చైతన్యానికి మారుపేరని మరోమారు నిరూపితమైందన్నారు నారా లోకేష్. సోమవారం తెల్లవారకముందే నియోజకవర్గ ప్రజలు పోలింగ్ బూతుల వద్ద బారులుతీరి ఉత్సాహంగా ఓటుహక్కు వినియోగించుకోవడం శుభపరిణామం అన్నారు. సాయంత్రం 6గంటలకు కూడా ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఓపిగ్గా పోలింగ్ బూతుల్లో వేచిఉండటం వెల్లివిరిసిన ప్రజాచైతన్యానికి ప్రతీకగా అభివర్ణించారు. పెద్దఎత్తున ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న మంగళగిరి కుటుంబసభ్యులకు, పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
ఏపీలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 75 శాతం ఓటింగ్ నమోదైనట్లు సమాచారం. పోలింగ్ కేంద్రాల్లో ఉన్న వారికి అవకాశం కల్పించడంతో పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉందని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.