IT Employees Car Rally: చంద్రబాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగుల కార్ ర్యాలీ ప్రారంభం - బోర్డర్ వద్ద టెన్షన్! వందల్లో పోలీసులు
ఆదివారం (సెప్టెంబరు 24) తెల్లవారుజామున మూడు గంటలకే ఐటీ ఉద్యోగులు హైదరాబాద్‌లోని వేర్వేరు ప్రాంతాల నుంచి కార్లలో ర్యాలీగా రాజమండ్రికి బయలుదేరారు.
టీడీపీ చీఫ్ చంద్రబాబుకు మద్దతుగా ఆయన అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ హైదరాబాద్ లోని ఐటీ ఉద్యోగులు ర్యాలీని ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు ఈ ర్యాలీ సాగనుంది. ‘కారులో సంఘీభావ యాత్ర’ పేరుతో రెండు రోజుల నుంచి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తూ వచ్చారు. అందుకు అనుగుణంగా పెద్ద సంఖ్యలో ఉద్యోగులు కార్లలో బయల్దేరారు. ఆదివారం (సెప్టెంబరు 24) తెల్లవారుజామున మూడు గంటలకే ఐటీ ఉద్యోగులు హైదరాబాద్‌లోని వేర్వేరు ప్రాంతాల నుంచి కార్లలో ర్యాలీగా రాజమండ్రికి బయలుదేరారు. రాజమండ్రిలో ఉంటున్న చంద్రబాబు భార్య నారా భువనేశ్వరిని కలిసి వారు పరామర్శించనున్నారు.
తారకరత్న భార్య మద్దతు
హైదరాబాద్‌లో కార్ ర్యాలీ ప్రారంభం సందర్భంగా దివంగత నటుడు తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి, ఆయన కుమార్తెలు మద్దతు పలికారు. ఈ ర్యాలీకి ఆమె సంఘీభావం ప్రకటించారు. ‘ఈ పోరాటంలో మేమంతా మీ వెంటే’ అంటూ చంద్రబాబు పోస్టర్లను ప్రదర్శించారు.
సరిహద్దుల్లో మోహరించిన పోలీసులు - హైఅలర్ట్
మరోవైపు ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీకి అనుమతి లేదని ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా పోలీసులు తేల్చి చెప్పారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనరేట్ పరిధిలో ఎలాంటి ర్యాలీలకు అనుమతులు లేవని చెప్పారు. ఈ మేరకు విజయవాడ సీపీ కాంతిరాణాటాటా శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ- ఏపీ సరిహద్దులో గరికపాడు సహా వివిధ ప్రాంతాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. వందల సంఖ్యలో పోలీసులను మోహరించారు. విజయవాడ వైపు వెళ్లే కార్లను ఆపి తనిఖీ చేసి మరీ పంపిస్తున్నారు.
పలువురు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఖమ్మం మీదుగా రాజమండ్రికి వెళ్తున్నారు. బ్యాచ్‌లుగా విడిపోయి రాజమండ్రి వస్తున్నారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
ఏపీ - తెలంగాణ సరిహద్దులో వీడియో షేర్ చేసిన టీడీపీ
ర్యాలీపై పోలీసులు విధించిన ఆంక్షల వేళ ఏపీ సరిహద్దు గరికపాడు వద్ద శనివారం రాత్రి నుంచే భారీగా పోలీసులను ఏపీ ప్రభుత్వం మోహరించింది. దీనిపై టీడీపీ స్పందించింది. ఇది ఇండియా - పాకిస్థాన్ మధ్య సరిహద్దు కాదని, అంత భద్రత అవసరం లేదని సెటైర్లు వేసింది. పిల్లి తాడేపల్లి ప్యాలెస్ లో భయపడుతూ పడుకుందని ఎద్దేవా చేసింది. ‘‘ఇది పాకిస్తాన్ బోర్డర్ కాదు, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు. చంద్రబాబు గారికి మద్దతుగా, ఛలో రాజమహేంద్రవరం అంటున్న ఐటీ ఉద్యోగులకి ఏపిలోకి అడుగు పెట్టే అర్హత లేదంట. వందలాది మంది పోలీసులని దింపి, ప్యాలెస్ లో భయపడుతూ పడుకున్నాడు తాడేపల్లి పిల్లి’’ అంటూ గరికపాడు వద్ద భారీగా ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తు వీడియోను టీడీపీ ఎక్స్‌లో షేర్ చేసింది. అలాగే చంద్రబాబుకి సంఘీభావంగా రాజమండ్రికి కార్ల ర్యాలీ చేస్తున్న వీడియోలను, హైదరాబాద్ నుంచి రాజమండ్రికి ఐటీ ఉద్యోగుల ర్యాలీ వీడియోలను కూడా పోస్ట్ చేసింది.
ఇది పాకిస్తాన్ బోర్డర్ కాదు, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు
— Telugu Desam Party (@JaiTDP) September 24, 2023
చంద్రబాబు గారికి మద్దతుగా, ఛలో రాజమహేంద్రవరం అంటున్న ఐటీ ఉద్యోగులకి ఏపిలోకి అడుగు పెట్టే అర్హత లేదంట. వందలాది మంది పోలీసులని దింపి, ప్యాలెస్ లో భయపడుతూ పడుకున్నాడు తాడేపల్లి పిల్లి#CBNLifeUnderThreat#TDPJSPTogether… pic.twitter.com/xoNGpU8Nv1
చంద్రబాబు గారికి సంఘీభావంగా రాజమండ్రికి కార్ల ర్యాలీ. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి ఐటీ ఉద్యోగుల ర్యాలీ. హైదరాబాద్ నుంచి కార్లలో బయల్దేరిన ఐటీ ఉద్యోగులు#CBNLifeUnderThreat#TDPJSPTogether#APvsJagan#IAmWithBabu#PeopleWithNaidu#FalseCasesAgainstNaidu #CBNWillBeBackWithABang pic.twitter.com/BlLPVnBErW
— Telugu Desam Party (@JaiTDP) September 24, 2023