WTC Final 2023: మాకా.. నాకౌట్ ప్రెజరా! ఐసీసీ ట్రోఫీపై ద్రవిడ్ రెస్పాన్స్ ఇదీ!
WTC Final 2023: ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచులో తమపై ఒత్తిడేమీ ఉండదని టీమ్‌ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ అంటున్నాడు.
WTC Final 2023:
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచులో తమపై ఒత్తిడేమీ ఉండదని టీమ్‌ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) అంటున్నాడు. ఐదారేళ్లుగా సుదీర్ఘ ఫార్మాట్లో తమ జట్టు అద్భుతాలు చేసిందని పేర్కొన్నాడు. ఐసీసీ నాకౌట్ మ్యాచుల్లో తప్పకుండా విజయాలు అందుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు. పునరాగమనం చేస్తున్న అజింక్య రహానెకు అండగా నిలిచాడు. అలాంటి క్వాలిటీ ప్లేయర్ తిరిగి రావడం సంతోషకరమని వెల్లడించాడు.
'చివరిసారి న్యూజిలాండ్‌తో ఫైనల్లో ఓడాం. అంత మాత్రాన మా ఆటతీరు అలాగే ఉంటుందని అనుకోవద్దు. ఐసీసీ ట్రోఫీ ప్రయత్నంలో మేం ఒత్తిడికి గురవ్వం. గెలిస్తే నిజంగా సంతోషమే. ఐసీసీ ట్రోఫీ గెలవడం బాగుంటుంది. అంతకన్నా ముందు మీరు మా రెండేళ్ల ఆటతీరును మెచ్చుకోవాలి. ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఇక్కడికి చేరుకున్నాం' అని రాహుల్ ద్రవిడ్ అన్నాడు.
'ఫైనల్ చేరుకొనేందుకు అందరూ కలసికట్టుగా శ్రమించారు. పాయింట్ల పట్టికను గమనిస్తే ఎన్నో పాజిటివ్ అంశాలు తెలుస్తాయి. ఆస్ట్రేలియాలో సిరీస్ గెలిచాం. ఇంగ్లాండ్‌లో డ్రా చేసుకున్నాం. మిగిలిన సిరీసుల్లో నువ్వా నేనా అన్నట్టుగా తలపడ్డాం. ఐదారేళ్లుగా ప్రపంచమంతా తిరిగి అద్భుతంగా ఆడాం. అందుకే ఐసీసీ ట్రోఫీ గెలవనంత మాత్రాన అవన్నీ లెక్కిలోకి రాకుండా పోవు. బిగ్గర్ పిక్చర్ చూడాలి' అని మిస్టర్ డిపెండబుల్ అన్నాడు.
దాదాపుగా 18 నెలల తర్వాత అజింక్య రహానె (Ajinkya Rahane) టీమ్‌ఇండియాలో పునరాగమనం చేస్తున్నాడు. అలాంటి ఆటగాడు మళ్లీ జట్టులోకి రావడం సంతోషంగా ఉందని ద్రవిడ్ పేర్కొన్నాడు. 'రహానె జట్టులో ఉండటం మంచిదే. కొందరు గాయాల పాలవ్వడంతో అతడికి మరో అవకాశం దొరికింది. అలాంటి క్వాలిటీ ప్లేయర్ టీమ్‌ఇండియాకు ఎప్పటికీ అవసరమే. అతడు అనుభవం తీసుకొస్తాడు. విదేశీ గడ్డపై మంచి రికార్డులు ఉన్నాయి. ఇంగ్లాండ్‌లోనూ తిరుగులేని విధంగా ఆడాడు' అని ద్రవిడ్ తెలిపాడు.
'అజింక్య రహానె స్లిప్స్‌లో అమేజింగ్ క్యాచులు అందుకుంటాడు. జట్టుకు తన వ్యక్తిత్వంతో మార్గనిర్దేశం చేస్తాడు. అది చాలా ముఖ్యం. అతడు జట్టును విజయవంతంగా నడిపించాడు. అందుకే ఇదొక్క మ్యాచే ఆడిస్తారని అనుకోవద్దు. కొన్నిసార్లు జట్టులో చోటు కోల్పోతుంటారు. మళ్లీ పునరాగమనం చేసి సుదీర్ఘ కాలం ఆడతారు. ఒక్క మ్యాచుకే తీసుకుంటారన్న నిబంధనేమీ లేదు. మంచి ప్రదర్శన చేస్తే ఆడిస్తూనే ఉంటారు' అని ద్రవిడ్ వెల్లడించాడు.
ఇంగ్లాండ్‌లో కౌంటీ క్రికెట్ ఆడుతున్న చెతేశ్వర్ పుజారా (Cheteshwar Pujara) సలహాలు తీసుకుంటున్నామని ద్రవిడ్ తెలిపాడు. ససెక్స్‌ను అతడు విజయవంతంగా నడిపిస్తున్నాడని పేర్కొన్నాడు. ఇంగ్లాండ్ కండీషన్స్, కన్వర్షన్స్, బౌలింగ్ తీరుపై అతడితో చర్చించామన్నాడు.
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు ఎంపికైన భారత జట్టు
భారత్: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, చెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానె, కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేశ్ ఉనద్కత్, ఇషాన్ కిషన్
స్టాండ్‌బై ఆటగాళ్లు: యశస్వీ జైశ్వాల్, ముకేశ్ కుమార్, సూర్యకుమార్ యాదవ్
What the two teams are playing for 🏆
— BCCI (@BCCI) June 6, 2023
Not long to go now for the #WTC23 Final to begin! #TeamIndia pic.twitter.com/8EAI2fUaNX