IPL 2023: ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బందిపై కోట్లాది రూపాయల ఖర్చు-ఫ్రాంచైజీలకు ఆ డబ్బు ఎలా వస్తుంది?
IPL 2023: ఐపీఎల్ వేలంలో ఒక్కో ఆటగాడి మీద కోట్లాది రూపాయల ఖర్చు.. కోచింగ్ సిబ్బంది కోసం అదే దూకుడు.. మరి ఇంత డబ్బు ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ఎక్కడ్నుంచి వస్తుంది.
IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ను క్యాష్ రిచ్ లీగ్ గా వర్ణిస్తారు క్రికెట్ విశ్లేషకులు. పైకి అభిమానులకు వినోదాన్ని అందించే సాధనంగా కనిపిస్తున్నా కోట్లాది రూపాయల వ్యాపారమన్నది జగమెరిగిన సత్యమే. ప్రపంచంలోని టాప్ కంపెనీలన్నీ ‘మేం ఐపీఎల్‌కు స్పాన్సర్ గా ఉంటాం’ అని ఎగబడుతున్నాయంటే దీని క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ లీగ్ లో ఆడే క్రికెటర్లకు ఐపీఎల్ ఒక కామధేనువు. టాలెంట్ ఉన్న కుర్రాళ్ల కోసం ఫ్రాంచైజీలు కోటానుకోట్లు ఖర్చు చేసి మరి వారిని దక్కించుకుంటాయి. గత ఐపీఎల్ వేలంలో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ సామ్ కరన్ (రూ. 18.50 కోట్లు), కామెరూన్ గ్రీన్ (రూ. 17.50 కోట్లు) పై పంజాబ్, ముంబై భారీగా నగదు కుమ్మరించాయి. వీరితో పాటు కోచింగ్ సిబ్బందికి కూడా భారీగానే ముట్టజెప్పుతాయి. మరి ఫ్రాంచైజీలకు ఆటగాళ్ల, కోచింగ్ సిబ్బందికి కోట్లాది రూపాయల వేతనాలు చెల్లించడానికి డబ్బులు ఎక్కడ్నుంచి వస్తాయి..?
ఆదాయమార్గాలు ఇవి..
ఐపీఎల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ నుంచి వస్తున్న ఆదాయం ద్వారానే బీసీసీఐ ప్రపంచ క్రికెట్ ను కనుసైగతో శాసిస్తున్నది. ఐపీఎల్ లో ప్రసార హక్కులను విక్రమయించడం ద్వారా వచ్చే ఆదాయంలో ఫ్రాంచైజీలకూ వాటా ఉంటుంది. గతంలో వెలువరించిన ఒక నివేదిక ప్రకారం.. బీసీసీఐ తనకు మీడియా హక్కుల ద్వారా వచ్చిన సంపాదనలో 20 శాతం మాత్రమే ఉంచుకుని మిగిలిన 80 శాతాన్ని ఫ్రాంచైజీలకు పంచింది. కానీ తాజా సమాచారం ప్రకారం.. ఈ షేర్ 50 - 50 గా ఉందని తెలుస్తున్నది. గతేడాది ముగిసిన ఐపీఎల్ మీడియా ప్రసారం హక్కుల వేలం (టీవీ, డిజిటల్, విదేశీ హక్కులు కలిపి) సుమారు రూ. 48 వేల కోట్లు ఆర్జించిన విషయం విదితమే..
ప్రకటనలు, జెర్సీల ద్వారా పైసలు..
మీడియా ప్రసార హక్కులే కాదండోయ్.. ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయాల్లో వాటాలుంటాయి. అంతేగాక ఫ్రాంచైజీలతో వివిధ కంపెనీలు టైఅప్ అవుతాయి. ఆటగాళ్లు వేసుకునే జెర్సీల మీద వారి సంస్థల లోగోలను ప్రచారం చేసుకుంటాయి. ఉదాహరణకు సన్ రైజర్స్ ఆటగాళ్లు వేసుకునే జెర్సీల మీద టీసీఎల్, జియో, ఫ్యాన్ క్రేజ, వ్రాగ్న్, ఆర్బీఎల్ లోగోలు ఉంటాయి. వీటి ద్వారా కూడా ఫ్రాంచైజీలకు ఆదాయం వస్తుంది. ఇవేగాక ఐపీఎల్ సీజన్లలో ఆటగాళ్లు పలు ఫోటోషూట్లు, ప్రసార మాధ్యమాల ప్రకటనల్లో నటిస్తారు. వీటి ద్వారా ఆదాయం సమకూరుతుంది.
మూడు భాగాలు..
స్థూలంగా చెప్పాలంటే ఐపీఎల్ లో ఫ్రాంచైజీల సంపాదనను మూడు భాగాలుగా చెప్పొచ్చు. అవి సెంట్రల్ రెవెన్యూ, ప్రమోషనల్ రెవెన్యూ, స్థానిక రెవెన్యూ. మీడియా ప్రసార హక్కులు, టైటిల్ స్పాన్సర్‌షిప్ లు సెంట్రల్ రెవెన్యూ పరిధిలోకి వస్తాయి. వీటి ద్వారానే ఫ్రాంచైజీలకు దాదాపు 60-70 శాతం ఆదాయం వస్తుంది. ప్రమోషనల్ రెవెన్యూ 20-30 శాతం ఉంటుంది. స్థానిక ఆదాయం అంటే టికెట్ల విక్రయం, ఇతరత్రా మార్గాల ద్వారా వచ్చే ఆదాయం. ఇలా సంపాదించిన దాన్నుంచే ఫ్రాంచైజీలు ఆటగాళ్లకు, సిబ్బందిని వేతనాలతో పాటు టీమ్ నిర్వహణ ఖర్చులకూ చెల్లిస్తుంది.