Modi Latest News:75 ఏళ్లు దాటితే బీజేపీలో రాజకీయంగా రిటైర్ కావాల్సిందేనా ? మోదీకి ఆ రూల్ వర్తిస్తుందా ?
Modi Latest News: 75 ఏళ్లు నిండినందుకు ఎల్. కే అద్వానీకి , మురళీ మనోహర్ జోషి, సుమిత్రా మహజన్ వంటి నేతలను పక్కన పెట్టింది బీజేపీ. ఇప్పుడు మోదీకి ఆ రూల్ వర్తిస్తుందా లేదా?

Modi Latest News: సైద్ధాంతిక పార్టీగా బీజేపీకి పేరు. వ్యక్తుల మీద కాకుండా తమ పార్టీ సిద్ధాంతాలు, క్రమశిక్షణ, పార్టీ నియమాలకు అనుగుణంగా నడుస్తుందని కమలం నేతలు చెబుతారు. గతంలో 75 ఏళ్లు నిండినందుకు ఆ పార్టీకి మూల విరాట్‌లలో ఒకరైన ఎల్. కే అద్వానీకి, మురళీ మనోహర్ జోషి, సుమిత్రా మహజన్ వంటి నేతలను ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ఇవ్వలేదు. దాంతో వాళ్ల రాజకీయ జీవితం ముగిసిపోయంది. అయితే ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ వంతు వచ్చింది.
75 ఏళ్లు వస్తే రాజకీయాల నుంచి రిటైర్ కావల్సిందేనా..?
ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలకు విద్యార్హతలు, రిటైర్మెంట్ వంటివి ఉంటాయి. కానీ రాజకీయరంగంలో ఎలాంటి అర్హతలు, రిటైర్మెంట్ వంటివి లేవు. ఏవైనా తీవ్రమైన కేసుల్లో ఉంటే తప్ప రాజకీయ పదవులకు ఎలాంటి అర్హతను రాజ్యాంగంలో పొందుపరచలేదు. అదే రీతిలో వ్యక్తి చనిపోతే తప్ప రాజకీయ పదవుల్లో నేతలకు రిటైర్మెంట్ అనేది లేదు. కానీ బీజేపీలో మాత్రం 75 ఏళ్లు దాటితే రాజకీయాల్లో నుంచి రిటైర్మెంట్ కావల్సిందేనని గతంలో పార్టీ నిర్ణయించింది. గుజరాత్ నేతలు నరేంద్ర మోదీ, అమిత్ షా వచ్చాక దేశ రాజకీయాల్లోకి వచ్చే సరికి సీన్ మారిపోయింది. 75 ఏళ్ల వయసు వస్తే రిటైర్ కావాల్సిందే అన్న కారణంగా బీజేపీని దేశంలో ఓ రాజకీయ పార్టీగా నిలబెట్టిన రాజకీయధురంధరుడు అయిన ఎల్. కే అద్వాని, మురళి మనోహర్ జోషి వంటి నేతలను సైతం కమలం పార్టీ దూరం పెట్టింది. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో కూడా 75 ఏళ్లు దాటిన వారికి పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షా టికెట్ ఇవ్వలేదు.
ప్రధాని మోదీకి ఈ నియమం వర్తించనుందా..?
ప్రధాని అభ్యర్థిగా మోదీ వచ్చినప్పుడే, అప్పటికే పార్టీలో సీనియర్, కీలక నేత అయిన అద్వానీ ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. అందుకు మోదీ, అమిత్ షాలే కారణమని, గురువని చూడకుండా రాజకీయాల నుంచి బలవంతంగా రిటైర్ చేయించారన్న ఆరోపణలు ఉన్నాయి. కాని దీనిపై అటు మోదీ, అమిత్ షా కానీ, ఇటు అద్వానీ కానీ ఎక్కడా నోరు మెదపలేదు. అయితే 2014లో నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక మాత్రం బీజేపీ స్వరం మారింది. 75 ఏళ్లకు రాజకీయాల నుంచి రిటైర్ అవ్వాలి అన్న నియమం ఏదీ లేదని, పార్టీ రాజ్యాంగంలో ఎక్కడా లేదని అమిత్ షా, హిమంత బిశ్వా శర్మ వంటి నేతలు మాట్లాడటం మొదలు పెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీకి 2025 సెప్టెంబర్ 17వ తేదీ తో 75 ఏళ్లు నిండుతాయి. ఈ క్రమంలోనే 2024లో పోటీ చేసి ప్రధాని అయిన మోదీ పరిస్థితి ఏంటన్న చర్చ సాగుతోంది. అయితే దీనికి చెక్ పెట్టడానికే అన్నట్లు అమిత్ షా వంటి ముఖ్య నేతలు ప్రధాని మోదీ ఈ ఐదేళ్ల టర్మ్ ప్రధానిగా కొనసాగుతారని చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి ఈ నియమం మోదీకి అమలు కాదన్న సంకేతాలను బీజేపీ ఇవ్వడం గమనార్హం.
బీజేపీ ఆలోచన ఏంటంటే..?
బీజేపీలో మోదీ స్థాయి జనాకర్షక నేతలు మరొకరు లేరు. కాంగ్రెస్‌ను ఖతం చేయడంలో మోదీ నైపుణ్యం పార్టీ నేతలందరికి తెలుసు. మోదీ- అమిత్ షా ద్వయాన్ని కాదని 75 ఏళ్ల నియమం కోసం నోరు మెదిపే ధైర్యం ఉన్న నేతలు పార్టీలో లేరు. ఆర్.ఎస్.ఎస్ వంటి మాతృసంస్థను కూడా శాసించే స్థాయిలో మోదీ- అమిత్ షా ద్వయం ఉన్నారన్న చర్చ పార్టీలోనే కాదు దేశవ్యాప్తంగా సాగుతోంది. ఆర్ఎస్ఎస్ నేతలు కూడా ఇలాంటి ఆలోచన చేసే ధైర్యం చేయని పరిస్థితి.
75 ఏళ్లకు రిటైర్ కావాలన్న నియమం ఏదీ లేదంటూ, ఆ వయసు దాటిన బి.ఎస్ యుడియూరప్పను కర్ణాటక సీఎంగా కొనసాగించిన విషయాం ఉదహరిస్తున్నారు. హేమామాలినీ వంటి 75 ఏళ్లు దాటిన 2024లో ఎంపీ టికెట్ ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైతం 75 ఏళ్ల దగ్గర ఉండి కీలక బాధ్యతలు నెరవేర్చుతు విషయం కూడా కమలం నేతలు చెబుతున్నారు. దీన్ని బట్టి ఈ నియమం మోదీకి వర్తించేది కాదని అర్థం అవుతుంది. అయితే ఆయా సందర్భాల్లో నేతలకున్న ప్రజాదరణ, పార్టీ అవసరాలు, రాజకీయ ప్రాధాన్యత అంశాలను బట్టి నియమాలు ఉంటాయని, అవసరం బట్టి పార్టీ మార్చుకుంటుందని బీజేపీ నేతలు చెబుతున్నారు.






















