Rajiv Yuva Vikasam Scheme: యువతకు గుడ్‌న్యూస్, రాజీవ్ యువ వికాసం దరఖాస్తులకు గడువు పొడిగింపు
Telangana News | నిరుద్యోగ యువతకు రుణాలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తుల గడువును పొడిగించింది.

Rajiv Yuva Vikasam applications | తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువతను తమకాళ్లపై నిలబడేలా చేసేందుకు తీసుకొచ్చిన పథకం రాజీవ్ యువ వికాసం. యువత నుంచి దరఖాస్తుల స్వీకరణ గడువును తెలంగాణ ప్రభుత్వం పొడిగించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు. తొలిత నిర్ణయించినట్లు ఏప్రిల్ 5 వరకు కాకుండా రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 14 వరకు గడువు పొడిగించినట్లు తెలిపారు. నిరుద్యోగ యువతకు ఈ పథకానికి అప్లై చేసుకోవడంలో ఇబ్బందులు లేకుండా చూసేందుకు గడువు పొడిగించినట్లు చెప్పారు. ఆసక్తి ఉన్న, అర్హులైన అభ్యర్థులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకుని ప్రయోజనం పొందాలని భట్టి విక్రమార్క యువతకు సూచించారు.
డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సోమవారం ప్రగతి భవన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వం వద్ద మిగులు నిధులు లేకున్నా, ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ నిరుద్యోగ యువత కోసం రాజీవ్ యువ వికాసం పథకాన్ని తీసుకొచ్చాం. ఉద్యోగాలు లేని యువత సొంతంగా వ్యాపారం ప్రారంభించి తమ కాళ్లపై నిలబడేలా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రోత్సహిస్తుంది. పురపాలక కార్యాలయాల్లో, మండల పరిషత్ ఆఫీసుల్లో రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తులు అందుబాటులో ఉంచాలి. యువత అక్కడే ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేలా అధికారులు ఏర్పాటు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకాన్ని విజయవంతం చేయడానికి అధికారులు సమర్ధవంతంగా పనిచేయాలి అన్నారు.
రాజీవ్ యువ వికాసం పథకానికి ఎంపికైన లబ్ధిదారులకు రాష్ట్ర పరిశ్రమల శాఖ అవగాహన కల్పిస్తుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ప్రభుత్వం ఇచ్చే రాయితీతో యువత సొంతంగా తమ కాళ్లపై నిలబడేందుకు అవకాశం కలుగుతుందన్నారు.
3 కేటగిరీలుగా యువతకు రుణాలు..
తెలంగాణ ప్రభుత్వం యువతకు మూడు క్యాటగిరీలుగా రుణాలు అందించనుంది. రాజీవ్ యువ వికాసం స్కీమ్ కింద లబ్ధిదారులకు ప్రభుత్వం యూనిట్ల విలువ ఆధారంగా రుణాలను 3 క్యాటగిరీలుగా ఇవ్వనుంది. క్యాటగిరీ 1 కింద లక్ష రూపాయల వరకు లోన్అందిస్తుంది. అయితే 80 శాతం రాయితీ ఉంటుంది. లబ్ధిదారులు బ్యాంకుల ద్వారాగానీ, సొంతంగా గానీ మిగతా 20 శాతం మొత్తాన్ని ఏర్పాటు చేసుకోవాలి. క్యాటగిరీ 2 కింద 1 లక్ష రూపాయల నుంచి రూ.2 లక్షల వరకు లోన్అందిస్తుంది. అందులో ప్రభుత్వం 70 శాతం రాయితీని అందిస్తుంది. మిగతా 30 శాతం మొత్తాన్ని లబ్దిదారులు అరెంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాటగిరీ 3 కింద 2 లక్షల రూపాయల నుంచి 3 లక్షల రూపాయల లోపు రుణాలను ఇస్తుంది. అందులో 60 శాతం వరకు ప్రభుత్వం రాయితీ కల్పిస్తుంది. మిగతా 40 శాతం మొత్తాన్ని లబ్ధిదారులు ఏర్పాటు చేసుకోవాలని నిబంధనల్లో తెలిపారు.
దరఖాస్తులు ఎలా..
రాజీవ్ యువ వికాసం పథకానికి ఓబీఎంఎంఎస్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. డౌన్‌లోడ్ చేసుకున్న అప్లికేషన్ కాపీలను మీ సంబంధిత సర్టిఫికెట్లను జత చేసి ఎంపీడీవో ఆఫీసులు లేదా మున్సిపల్ ఆఫీసులలో హెల్ప్‌డెస్క్‌లో ఇవ్వాలి. ఇటీవల కాలంలో ఎలాంటి లోన్, ప్రభుత్వం నుంచి సాయం పొందని వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఒంటరి మహిళలు, వితంతువులకు దాదాపు 25 శాతం యూనిట్లు, దివ్యాంగులకు సైతం 5 శాతం యూనిట్లను ప్రభుత్వం కేటాయించనుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

