Mahabharat: పాండవుల విజయం కోసం అర్జునుడి కొడుకును పెళ్లి చేసుకున్న శ్రీకృష్ణుడు
అక్కడ హిజ్రాలు పెళ్లిచేసుకుంటారు..ఆ మర్నాడే తాళి తీసేసి తెల్లచీర కట్టేస్తారు.. ఏంటిదంతా అంటే మహాభారత యుద్ధానికి లింక్ పెడతారు. ఎక్కడా పండుగ..ఆ రోజు ఏం జరుగుతుంది..
ఏడాది పొడవునా సమాజంలో నిరాదరణకు గురైన హిజ్రాలకు ఆ పండుగ చాలా ప్రత్యేకం. తాము జీవితంలో పొందలేం అనుకున్న వేడుకైన పెళ్లి, తాళి కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తారు. ఆ పండుగ తెచ్చిన సంబరమే కూతాండవర్ ఆలయ ఉత్సవం. తమిళనాడులోని విల్లుపురం జిల్లా 'కూవగం'లో ఉన్న'కూతాండవర్' దేవాలయం హిజ్రాలకు ఆరాధ్య దైవం. ఏటా చైత్రమాసంలో వచ్చే ఈ ఉత్సవంలో వారు ఆ దైవాన్ని పెళ్లిచేసుకుంటారు..ఇలా వాళ్లు పెళ్లిచేసుకున్న మర్నాడే కూతాండవర్ మరణిస్తాడు. ఏడుస్తూ, గాజులు పగులగొట్టి, కొలనులో స్నానాలు ఆచరిస్తారు.
దీనివెనుకున్న పురాణ గాథ ఏంటంటే
ఓసారి ఓ హిజ్రా కృష్ణుడి పొందు కోరుతాడు. అలా చేస్తే ఆ పురుషుడు ఆ మర్నాడే మరణిస్తాడని కృష్ణుడు హెచ్చరిస్తాడు. అయినప్పటికీ సిద్ధం అన్న ఆ హిజ్రా ఇందుకు ప్రతిఫలంగా కురుక్షేత్ర సంగ్రామంలో పాండవుల తరపున యుద్ధం చేస్తానని మాటిస్తాడు. అప్పుడు మోహిని అవతారం దాల్చిన కృష్ణుడు ఆ హిజ్రా కోరిక తీరుస్తాడు. యుద్ధంలో 18 రోజులు సాయపడిన ఆ హిజ్రాను మోహినిగా కృష్ణుడు కరుణించిన మర్నాడే మరణిస్తాడు. అందుకే కూవగంలో 18 రోజుల పాటూఉత్సవాలు చేస్తారు. 17 వ రోజున మంగళసూత్రధారణ చేస్తారు. 18వ రోజు మంగళసూత్రాన్ని, గాజులను, పువ్వులు తీసేసి ఏడుస్తారు.
Also Read: కృష్ణుడు 36 ఏళ్లలో చనిపోవాలనే గాంధారీ శాపం నెరవేరిందా? కురుక్షేత్రంలో ఏం జరిగింది?
ఇరావంతుడితో పెళ్లి
కూవగంలో మామూలు రోజుల్లో పెద్ద హడావుడి కనిపించదు కానీ చైత్ర పౌర్ణమి వచ్చిందంటే చాలు ఊరు జనసంద్రమైపోతుంది. కొన్ని వేలమంది హిజ్రాలు తరలివస్తారు. ఈ కూతాండవర్ మరెవరో కాదు...అర్జునుడి కొడుకైన ఇరావంతుడు.
హిజ్రాల కథనం ప్రకారం
కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులు గెలవాలంటే ఒక గొప్ప వీరుడి బలిదానం జరగాలట. అలాంటి వీరుడు అర్జునుడే అని గుర్తిస్తాడు శ్రీకృష్ణుడు. కానీ, అర్జునుణ్ణి బలివ్వడం ఇష్టంలేక ప్రత్యామ్నాయంకోసం ఆలోచిస్తాడు. అప్పుడు అర్జునుడికీ, నాగకన్య ఉలూపికీ జన్మించిన ఇరావంతుడు గుర్తుకొస్తాడు. అసలు విషయాన్ని ఇరావంతుడికి చెప్పి బలిదానానికి ఒప్పిస్తాడు. అయితే, యుద్ధంలో బలయ్యే ముందురోజు తనకు వివాహం చేయాలని షరతు పెడతాడు ఇరావంతుడు. అప్పుడు గత్యంతరంలేక కృష్ణుడే మోహినీ రూపంలో అతణ్ణి పెళ్లిచేసుకున్నాడట. శ్రీకృష్ణుడి మోహినీ అంశతోనే తాము జన్మించామనీ, మోహినికి భర్త అయిన ఇరావంతుడే తమ దైవమనీ చెబుతారు హిజ్రాలు. ఆనాడు ఇరావంతుడు, మోహినిల పరిణయానికి సూచికగా...ఏటా హిజ్రాలు తమ ఇష్టదైవాన్ని పెళ్లిచేసుకుంటారు. ఆ సందర్భంగా జరిగే జాతరే కూతాండవర్ ఆలయ ఉత్సవం. ఈ ఉత్సవాల్లో హిజ్రావు అందం, అలంకరణ ప్రదర్శనకే అధిక ప్రాధాన్యమిస్తారు. పూటకో విధంగా అలంకరించుకుని విల్లుపురం వీధుల్లో తిరుగుతారు.ఈ సందర్భంగా హిజ్రాలకు నృత్యాలూ, అందాల పోటీలూ జరుగుతాయి.
Also Read: పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే..
పెళ్లైన మర్నాడే వైధవ్యం
ఈ ఉత్సవంలో అతిముఖ్యమైన ఘట్టం కల్యాణోత్సవం. కల్యాణోత్సవం రోజు రాత్రి పట్టుచీర కట్టుకుని వధువుల్లా ముస్తాబవుతారు. ఇరావంతుడి దర్శనానికి వెళ్లి పూజారులతో పసుపుతాడు కట్టించుకుంటారు. ఆలయ నియమానుసారం మగవాళ్లు కూడా తాళికట్టించుకోవచ్చట. అందుకే సమీప గ్రామాల్లోని చాలామంది పురుషులు చేతికి గాజులు, మెడలో మల్లెపూలు వేసుకుని వెళ్లి తాళికట్టించుకుంటారు. తాళి కట్టించుకున్న హిజ్రాలు రాత్రంతా ఆలయం వద్దే ఆడుతూ పాడుతూ గడుపుతారు. చెక్కలతో ఇరావంతుని విగ్రహం చేసి వూరంతా ఊరేగిస్తారు. ఇరావంతుడి బలికి సూచకగా విగ్రహం తలను తెల్లవారుజామున తీసేస్తారు. అంతవరకూ ఆనందోత్సాహాలతో గడిపిన హిజ్రాలు…ఇరావంతుని బలి తర్వాత ఏడవడం మొదలుపెడతారు. తెంపిపడేసిన పూలూ పసుపుతాళ్లూ, పగులగొట్టిన గాజులూ పెద్దపెద్ద గుట్టలుగా పేరుకుపోతాయి. అనంతరం హిజ్రాలు స్నానంచేసి వైధవ్యానికి సూచికగా తెల్లచీర కట్టుకుని మౌనంగా వెళ్లిపోతారు. మళ్లీ చైత్ర పౌర్ణమి కోసం ఎదురుచూస్తారు.
Also Read: ఆనందం ఎక్కడ దొరుకుతుంది… ఒక భగవద్గీత - 108 ప్రశ్నలు- Part 3