Tummala Meeting today: నేడు అనుచరులతో తుమ్మల నాగేశ్వరరావు భేటీ- కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్
తుమ్మల నాగేశ్వరావు పార్టీ మార్పుపై అధికారిక ప్రకటన రాబోతోందా? ఇవాళ ఖమ్మం వెళ్తున్న తుమ్మల... అనుచరులతో కీలక భేటీ నిర్వహించనున్నారు. ఈ భేటీ తర్వాత పార్టీ మార్పుపై కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.
పాలేరు అసెంబ్లీ టికెట్ దక్కకపోవటంతో బీఆర్‌ఎస్‌కు దూరంగా ఉంటున్న తుమ్మల నాగేశ్వరరావు.. పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇవాళ హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తున్నారు తుమ్మల. క్యాంపు కార్యాలయంలో అనుచరులతో కీలక భేటీ నిర్వహించనున్నారు. పార్టీ మార్పుపై అనుచరులతో చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశం తర్వాత కీలక నిర్ణయం కూడా ప్రకటిస్తారని సమాచారం. అయితే.. తుమ్మల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు..? ఏ పార్టీలోకి వెళ్తారు అనేది ఉత్కంఠ రేపుతోంది.
బీఆర్‌ఎస్ నుంచి టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్న తుమ్మలను బుజ్జగించేందుకు గులాబీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆయన పార్టీ మారాలనే నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు.. తుమ్మల కాంగ్రెస్ చేరడం దాదాపు ఖరారైనట్టు సమాచారం. రేవంత్‌రెడ్డి తుమ్మల ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. కాంగ్రెస్‌లోకి రావాలని ఆహ్వానించారు. తుమ్మల అభిమానులు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కోరడంతో...కాంగ్రెస్‌లో చేరాలని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈనెల 6వ తేదీన తుమ్మల కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఢిల్లీ వేదికగా తుమ్మల కాంగ్రెస్‌లో చేరుతారని చెప్తున్నారు. అయితే.. ఇవాళ అనుచరులతో భేటీ తర్వాత పార్టీ మార్పుపై తుమ్మల అధికారిక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తుమ్మలకు అనుచరగణం ఎక్కువ. జిల్లా వ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. కమ్మ సామాజికవర్గంలో ఆయనకు పట్టు ఉండటం కూడా పార్టీకి కలిసొస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. తుమ్మల, రేవంత్‌రెడ్డి గతంలో టీడీపీలో కలిసి పనిచేశారు. అప్పట్లో టీడీపీలో కీలక నేతలుగా ఉన్నారు. ఆనాటి నుంచి ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో రేవంత్‌రెడ్డి నాయకత్వంలో పనిచేసేందుకు తుమ్మల కూడా ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది.
అయితే, తుమ్మల పాలేరు టికెట్ ఆశిస్తున్నారు. మరోవైపు.. షర్మిల పార్టీ వైఎస్‌ఆర్‌టీపీ విలీన ప్రక్రియ కూడా పూర్తి కానుంది. తుమ్మల కాంగ్రెస్ పార్టీలో చేరితే.. పాలేరు నుంచి పోటీకే పట్టుబడతారు. మరోవైపు షర్మిల కూడా పాలేరు స్థానాన్ని ఆశిస్తున్నారు. పాలేరు సీటు ఇస్తానని హామీ వచ్చిన తర్వాతే రేవంత్‌రెడ్డితో మీటింగ్‌కు తుమ్మల ఒప్పుకున్నారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. ఆ టికెట్ ఇప్పించేందుకు శాయశక్తుల కృషిచేస్తానని రేవంత్‌రెడ్డి... తుమ్మలకు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అవకాశాన్ని బట్టి ఖమ్మంలో పోటీ చేసేందుకు కూడా సిద్ధంగా ఉండాలని తుమ్మలకు రేవంత్ చెప్పినట్టు సమాచారం. ఖమ్మంలో పోటీ చేసేందుకు సిద్ధమైతే ఎన్నికల ఖర్చు విషయాన్ని కూడా తాను చూసుకుంటానని హామీనిచ్చినట్టు టాక్ వినిపిస్తోంది. హైదరాబాద్ పరిధిలోని కూకట్ పల్లి నుంచి తుమ్మలను పోటీ చేయాలని కాంగ్రెస్ కోరినట్టుగా ప్రచారం జరిగినా, తుమ్మల మాత్రం పాలేరు తప్పించి మరెక్కడా పోటీపై తనకు ఆసక్తి లేదని స్పష్టం చేసినట్టు తెలస్తోంది. ఇండిపెండెంట్‌గా అయినా బరిలో దిగుతానని, సీటు మారే ప్రసక్తే లేదని తేల్చి చెప్పినట్టు సమాచారం.
కాంగ్రెస్‌లో చేరమని తుమ్మల అనుచరులు ఆయనపై ఒత్తిడి తెస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌లో కీలక నేతలు కూడా.. తుమ్మలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో... ఖమ్మంలో అనుచరుల భేటీకానున్న తుమ్మల... ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తి కలిగిస్తోంది. ఆయన కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు ప్రకటిస్తారా? లేక ఇంకేమైనా స్ట్రాటజీ ఉందా? అనేది తేలాల్సి ఉంది.