SpaceX : అంతరిక్ష ప్రయోగ రంగంలో సరికొత్త విప్లవం- నింగి నుంచి లాంచ్‌ప్యాడ్‌కు చేరుకున్న స్పేస్ ఎక్స్ రాకెట్
SpaceX's Starship: అంతరిక్ష ప్రయోగ రంగంలో సరికొత్త విప్లవానికి స్పేస్ ఎక్స్ శ్రీకారం చుట్టింది. నింగిలోకి వెళ్లిన రాకెట్ మళ్లీ ల్యాంచ్ ప్యాడ్‌లోకి చేరుకుంది.
SpaceX Successfully Launched Starship: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ మరో అద్భుతమైన ఫీట్ సాధించింది. అంతరిక్ష పరిశోధనలకు మరింత ఊతమిచ్చేలా స్టార్‌షిప్ టెస్ట్ ఫ్లైట్‌ను విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లి తిరిగి లాంచ్ ప్యాడ్‌లోకి చేరుకుంది. టెక్సాస్‌లోని బోకా చికాలోని SpaceX స్టార్‌బేస్ క్యాంప్‌లో ఈ ప్రయోగం చేపట్టింది.
ఉదయం 8 గంటలకు లాంచ్ విండో ఓపెన్ అయింది. వెంటనే రాకెట్ బూస్టర్ నింగిలోకి దూసుకెళ్లింది. నింగిలోకి ఎగిరిన 7 నిమిషాల తర్వాత బూస్టర్ కిందకు దిగింది. దాన్ని చాప్‌స్టిక్స్‌లా పని చేసే హ్యాండ్స్‌తో లాంచ్‌టవర్ జాగ్రత్తగా పట్టుకుంది. 71 మీటర్ల బూస్టర్ తిరిగి లాంచ్ ప్యాడ్‌కు రావడం చాలా కీలకమైన ముందడుగ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాకెట్ కాంపొనెంట్స్‌ను తిరిగి ఉపయోగించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో ఇది కీ రోల్ పోషిస్తుందని స్పేస్ ఎక్స్ పేర్కొంది.
Thousands of distinct vehicle and pad criteria had to be met prior to catching the Super Heavy booster. Thanks to the tireless work of SpaceX engineers, we succeeded with catch on our first attempt. pic.twitter.com/6wa5v6xHI0
— SpaceX (@SpaceX) October 13, 2024
బూస్టర్ విడిపోయిన తరువాత స్టార్‌షిప్ అంతరిక్ష నౌక హిందూ మహాసముద్రంపై దిగింది. దీని కోసం ఆరు ఆన్‌బోర్డ్ ఇంజిన్‌లు ఉపయోగించారు. ఈ ప్రత్యేక మిషన్ స్పేస్‌క్రాఫ్ట్‌ను తిరిగి పొందడమే లక్ష్యం కాదని SpaceX స్పష్టం చేసింది. సూపర్ హెవీ బూస్టర్, స్టార్‌షిప్ స్పేస్‌క్రాఫ్ట్ రెండింటినీ తిరిగి ఉపయోగించుకునే ప్రణాళిక ఉన్నట్టు వివరించింది. భూకక్ష్య నుంచి అంతరిక్షానికి సరకులు, సిబ్బందిని రవాణా చేయడానికి అయ్యే ఖర్చు, టైంను తగ్గించేందుకు రాకెట్ కాంపొనెంట్స్ పునర్వినియోగ సామర్థ్యం అవసరం. స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్‌లతో అదే చేస్తున్నట్టు సంస్థ తెలిపింది. దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఈ ప్రయోగం ఉపయోగపడబోతోంది.
ఇప్పటికే చేసిన ప్రయోగాల్లో ఎదురైన సవాళ్లు అధిగమించిన స్పేస్ ఎక్స్ ముందడుగు వేసింది. 2023 ఏప్రిల్‌లో ఒకసారి గత జూన్‌లో రెండోసారి ప్రయోగాలు చేపట్టింది. ఒక్కో దశలో ఒక్కో కొత్త విషయాన్ని నేర్చుకుంది. జూన్‌లో చేసిన ప్రయోగంలో బూస్టర్, స్పేస్‌క్రాఫ్ట్ రెండూ భూమి వాతావరణంలోకి తిరిగి రాకుండానే దెబ్బతిన్నాయి. వాటిలో తలెత్తిన సమస్యలను స్టడీ చేసి లోపాలు సవరించుకొని తాజా ప్రయోగాన్ని చేపట్టింది.
స్పేస్‌ఎక్స్ సంస్థ ఇలా బూస్టర్లను సేకరించడం గతంలో కూడా చేసింది. ఫాల్కన్-9 రాకెట్ల బూస్టర్లను రికవరీ చేస్తూనే ఉంది. మహాసముద్రాల్లో ఏర్పాటు చేసిన ప్లాట్‌ఫాంలపై వాటిని ల్యాండ్ చేసేవి. ఇప్పుడు మాత్రం బూస్టర్ నేరుగా లాంచ్‌ప్యాడ్‌కే ఇలా రావడ తొలిసారి.
ఈసారి ప్రయోగంలో వాడిని "చాప్‌స్టిక్‌లు" కీలకమని తెలిపారు స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్. భవిష్యత్తు మిషన్‌లకు ఇదే ఆధారమని తెలిపారు. బూస్టర్ వేగవంతమైన పునరుద్ధరణ ప్రక్రియలో హెల్ప్ చేయడానికి ఒక ప్రత్యేకమైన టవర్‌ను నిర్మించారు. మెటాలిక్ గాడ్జిల్లాను పోలి ఉండేలా దానికి "మెచజిల్లా" అని పేరు పెట్టారు. ఈ మెకానిజం బూస్టర్‌ను లాంచ్‌ప్యాడ్‌లో రీపోజిషన్ చేయడానికి, 30 నిమిషాలలోపు మరొక ప్రయోగానికి సిద్ధంగా ఉండటానికి అవకాశం ఉంటుందని మస్క్ అభిప్రాయపడుతున్నారు. ఇదంతా వింటే "ఒక రకమైన పిచ్చిగా అనిపిస్తుందిన్న మస్క్... ఎక్కడా భౌతిక శాస్త్రాన్ని దాటి ప్రయోగాలు చేయడం లేదని చెప్పారు. అందుకే విజయం సాధ్యమవుతుందని జులైలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
SpaceX ప్రకారం సూపర్ హెవీ బూస్టర్ పునరుద్ధరణ విభిన్న వాహనం ప్యాడ్ ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది. ఏదైనా ప్రమాణం సరిగా లేకపోతే బూస్టర్ సముద్రంలో ల్యాండ్ అయ్యేలా చేశారు. స్టార్‌షిప్ రూపకల్పన అనేక సాంకేతిక అడ్డంకులను ఎదుర్కొంది. జూన్‌లో నాల్గో టెస్ట్ ఫ్లైట్ హీట్ షీల్డ్ టైల్స్ కోల్పోయింది. తిరిగి ప్రవేశించే సమయంలో వాహనాన్ని నియంత్రించడంలో ఇబ్బందులు తలెత్తాయి. ఫలితంగా సముద్రంలో ల్యాండ్ అయింది. అది కూడా అనుకున్న లక్ష్యానికి దాదాపు 9.7 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఈ సవాళ్లను పరిష్కరించడానికి హీట్ షీల్డ్‌ను అప్‌డేట్ చేసింది. మొత్తం థర్మల్ ప్రొటెక్షన్ సిస్టమ్‌ను అప్‌డేట్ చేయడానికి చాలా సమయం తీసుకుంది. రీ-ఎంట్రీ సమయంలో స్పేస్‌క్రాఫ్ట్ పొటెన్షియల్‌ను మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఇప్పుడే కాకుండా భవిష్యత్ మిషన్‌లలో విజయవంతమైన ల్యాండింగ్‌లను సులభతరం చేస్తుంది.
2026 నాటికి వ్యోమగాములను చంద్రునిపైకి తీసుకెళ్లే NASA ఆర్టెమిస్ ప్రోగ్రామ్‌లో ఇది కీలక భూమిక అవుతుందని SpaceX నమ్ముతోంది. స్టార్‌షిప్ క్యాప్సూల్ ఆర్టెమిస్ III మిషన్‌కు చంద్రుని ల్యాండింగ్ వాహనంగా పనిచేస్తుందని భావిస్తున్నారు. ఇటీవల విజయాలు SpaceX ప్రయత్నాలను బలోపేతం చేస్తున్నాయి.