Farmers Resume Delhi Chalo March: రైతుల ఛలో ఢిల్లీ ఆందోళన, శంభు సరిహద్ద వద్ద భద్రత కట్టుదిట్టం - తరలివస్తున్న అన్నదాతలు
Farmers Resume Delhi Chalo March On Foot | రైతులు ఢిల్లీ వైపు తరలివస్తున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పంజాబ్, హర్యానాల నుంచి రైతులు శంభు బార్డర్ చేరుకున్నారు.
Farmers Delhi Chalo March: రైతుల ఛలో ఢిల్లీ ఆందోళన ఉధృతమవుతోంది. పంజాబ్, హర్యానాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో శంభు సరిహద్దు పాయింట్ వద్దకు చేరుకంటున్నారు. ఆదివారం మధ్యాహ్నం 101 మంది రైతుల బృందం పంజాబ్, హర్యానాల మధ్య ఉన్న శంభు సరిహద్దు పాయింట్ కు చేరుకోగానే ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. పొరుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చే సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. రైతులకు ఢిల్లీలోకి అంత ఈజీగా ఎంట్రీ ఇవ్వకుండా ఉండేలా రాష్ట్ర సరిహద్దు పాయింట్లలో ఇనుప కంచె ఏర్పాటు చేశారు. రోడ్డుపై అయితే మేకులు, పదునైన వస్తువులు పెట్టి రైతులను అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
కనీస మద్దతు ధర (MSP)కి చట్టపరమైన హామీ ఇవ్వడం సహా పలు డిమాండ్‌లు నేరవేర్చుకోవడం కోసం రైతులు కాలినడకన దేశ రాజధాని ఢిల్లీకి పాదయాత్ర చేస్తున్నారు. గతంలోనూ వ్యవసాయ చట్టాలు తెచ్చిన సమయంలో ఢిల్లీలో కొన్ని రోజులపాటు రైతులు దీక్షలు, ఆందోళనలు చేపట్టడం తెలిసిందే. రైతులను ఉగ్రవాదుల్లా ట్రీట్ చేస్తారా అంటూ రైతు నేతలు, సామాజిక కార్యకర్తలు, కోర్టులు సైతం ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి.
#WATCH | Farmers begin their "Dilli Chalo' march from the Haryana-Punjab Shambhu Border, protesting over various demands. pic.twitter.com/9EHUU2Xt1j
— ANI (@ANI) December 8, 2024
సీనియర్ పోలీస్ అధికారి పీటీఐతో మాట్లాడుతూ ‘రైతుల ఆందోళన పిలుపుతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. సింఘూ సరిహద్దులో పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. పెద్ద సంఖ్యలో పోలీసుల్ని ఇక్కడ మోహరించి రైతులను ఇక్కడే నిలువరించే ప్రయత్నం చేస్తున్నాం. అయితే శంబు సరిహద్దు వద్ద పరిస్థితిని బట్టి మరికొందరు పోలీసులతో బందోబస్తు పెంచుతాం అన్నారు. సరిహద్దుల్లో, సెంట్రల్ ఢిల్లీలో భద్రతా ఏర్పాట్ల వల్ల ట్రాఫిక్ సమస్య తలెత్తే అవకాశం ఉందన్నారు.
రైతు నేత సర్వన్ సింగ్ పంధేర్ ఏమన్నారంటే..
రైతులపై దాడులు, అఘాయిత్యాలను కప్పి పుచ్చేందుకు మీడియాను పోలీసులు అనుమతించడం లేదని రైతు సంఘ నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ తెలిపారు. రైతుల కవాతును మీడియా కవర్ చేయకుండా కేంద్ర ప్రభుత్వం, పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారని చెప్పారు.
కి.మీ దూరంలో మీడియాను నిలిపివేయాలని డీజీపీ నుంచి పోలీసులకు లేఖ వచ్చింది. అంటే పోలీసులు రైతులపై దారుణంగా ప్రవర్తిస్తారని, తమ స్వేచ్ఛను అడ్డుకుంటారని అర్థమవుతుందన్నారు. రైతులపై దౌర్జన్యాలు చేస్తున్నందుకే మీడియాను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తాము చేసే ఈ కవాతును మీడియా కవర్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని డీజీపీని రైతు సంఘాల నేతలు కోరుతున్నారు. తాము శాంతియుతంగా నిరసన తెలుపుతామని చెప్పినా, తమను ఢిల్లీలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారని సర్వన్ సింగ్ పంధేర్ తెలిపారు. డీజీపీ నుంచి ఆదేశాలు వచ్చాయంటూ పోలీసులు తమతో దురుసుగా ప్రవర్తించారని మీడియాకు తెలిపారు. రైతులతో పాటు మీడియా స్వేచ్ఛను సైతం హరిస్తున్నారని ఆరోపించారు.
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా సరిహద్దు నుంచి సైతం రైతు భారీ సంఖ్యలో ఢిల్లీకి వచ్చే అవకాశం ఉందని అక్కడ సైతం పోలీసు బందోబస్తు పెంచారు. రైతులు ఈ ఏడాది ఫిబ్రవరి 13న, ఫిబ్రవరి 21 తేదీలలో ఢిల్లీ వైపు కవాతు చేయడానికి యత్నించగా, భద్రతా దళాలు వారిని అడ్డుకున్నాయి.
రైతుల డిమాండ్లు ఏంటి..
కనీస మద్దతు ధరతో పాటు, రైతులు పంటల కోసం తీసుకున్న రుణాలు మాఫీ చేయడం, రైతు కూలీలకు పెన్షన్ ఇవ్వడం, విద్యుత్ ఛార్జీల తగ్గించాలని డిమాండ్, తమపై నమోదైన పోలీసు కేసుల ఉపసంహరణ, 2021 లఖింపూర్ ఖేరీ హింసాకాండ బాధితులకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. భూసేకరణ చట్టం 2013 పునరుద్ధరణతో పాటు 2020-21లో జరిగిన ఆందోళనలో మరణించిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.