Delhi Stampede: ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో విషాదం- రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ సహా ప్రముఖులు సంతాపం
PM Modi Expresses Condolences on Delhi Railway Station Stampede | ఢిల్లీ రైల్వేస్టేషన్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

President Murmu PM Modi Expresses Condolences | న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో విషాదం చోటుచేసుకుంది. మహాకుంభమేళాకు వెళ్లాలని ఢిల్లీ రైల్వే స్టేషన్‌కు వచ్చిన భక్తులు తొక్కిసలాటలో మృతిచెందారు. శనివారం రాత్రి రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట (New Delhi Railway Station Stampede)లో ఆదివారం ఉదయం వరకు 14 మంది మహిళలు సహా 18 మంది మృతిచెందగా, మరో 25 మంది వరకు స్థానిక లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఓ వైపు రెండు రైళ్లు ఆలస్యం కావడం, మరోవైపు ప్రయాగ్‌రాజ్ కు వెళ్లే రైళ్లు కనిపించాయని.. స్టేషన్‌లో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా 14, 15 ప్లాట్‌ఫాంలకు చేరుకోవడంతో తొక్కిసలాట జరిగి విషాదం నెలకొందని అధికారులు తెలిపారు. ఊపిరాడక కొందరు ప్రయాణికులు అల్లాల్లాడిపోయారు.
మహా కుంభమేళాకు వెళ్లాలనుకుంటే మహా విషాదం..
మహా కుంభమేళాకు వెళ్లాలని ఢిల్లీ రైల్వేస్టేషన్‌కు వచ్చిన ప్రయాణికులు తొక్కిసలాట జరిగి మృతిచెందిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, పలువురు కాంగ్రెస్ అగ్రనేతలు ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. సరైన ఏర్పాట్లు చేయకపోవడమే తొక్కిసలాటకు కారణమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు.
Deeply anguished to know about the loss of lives in a stampede at New Delhi Railway station. I extend my heartfelt condolences to the bereaved families and pray for speedy recovery of those injured.
— President of India (@rashtrapatibhvn) February 16, 2025
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో ప్రాణనష్టం జరగడం బాధాకరం. ఆ మృతుల కుటుంబాలకు నా ప్రగాడ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నాను’ అని రాష్ట్రపతి ముర్ము ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
Distressed by the stampede at New Delhi Railway Station. My thoughts are with all those who have lost their loved ones. I pray that the injured have a speedy recovery. The authorities are assisting all those who have been affected by this stampede.
— Narendra Modi (@narendramodi) February 15, 2025
ప్రధాని మోదీ విచారం..
‘న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో మరణాలు సంభవించడం బాధాకరం. తమ కుటుంబసభ్యులను కోల్పోయిన వారి గురించే నా ఆలోచనలు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. ఈ తొక్కిసలాటలో బాధితులకు అధికారులు సహాయ సహకారాలు అందిస్తున్నారు’ అని ప్రధాని మోదీ పోస్ట్ చేశారు.
ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫైర్
లోక్‌సభ ఎంపీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటపై స్పందించారు. తొక్కిసలాట జరిగి పలువురు చనిపోవడం, కొందరు గాయపడటం చాలా బాధాకరం అన్నారు. ఈ ఘటన మరోసారి రైల్వేశాఖ వైఫల్యాన్ని, మోదీ ప్రభుత్వ అసమర్థతను చూపుతుందన్నారు. మహా కుంభమేళాలో పాల్గొనేందుకు ప్రయాగ్‌రాజ్‌కు భారీ సంఖ్యలో భక్తులు వెళుతున్నారని తెలిసినా, రైల్వే స్టేషన్‌లో మెరుగైన ఏర్పాట్లు చేయకపోవడంపై ప్రశ్నించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

