ఇండియన్ ఆర్మీకి కౌటిల్యుడి రాజనీతి పాఠాలు, ప్రాచీన యుద్ధ తంత్రాలు గ్రంథాలపై ఫోకస్
Project Udbhav: ప్రాచీన యుద్ధ రీతులపై అధ్యయనం చేసేందుకు ఇండియన్ ఆర్మీ ప్రాజెక్ట్ ఉద్భవ్‌ని ప్రారంభించింది.
![ఇండియన్ ఆర్మీకి కౌటిల్యుడి రాజనీతి పాఠాలు, ప్రాచీన యుద్ధ తంత్రాలు గ్రంథాలపై ఫోకస్ Indian Army Launches 'Project Udbhav' To Draw Insights From Ancient Texts On Diplomacy And War-Fighting ఇండియన్ ఆర్మీకి కౌటిల్యుడి రాజనీతి పాఠాలు, ప్రాచీన యుద్ధ తంత్రాలు గ్రంథాలపై ఫోకస్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/04/86576a82e6cbc7697e0e97b86301f5df1696409027752517_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Army Project Udbhav:
ప్రాజెక్ట్ ఉద్భవ్..
యుద్ధం చేయాలంటే బలగం ఉంటే సరిపోదు. సరైన వ్యూహం ఉండాలి. శత్రువుని ఎలా కొట్టాలి..? ఎలా పడగొట్టాలి..? అనే క్లారిటీ ఉండాలి. ఇలాంటి స్ట్రాటెజీలు లేనప్పుడు ఎంత బలమున్నా వృథానే. భారత్ ఇప్పుడీ వ్యూహాలపైనే దృష్టి పెట్టింది. ఇప్పటికే రక్షణ రంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది. అటు చైనా, ఇటు పాకిస్థాన్‌కి ఎప్పటికప్పుడు దీటుగా బదులు చెబుతోంది. అయితే...యుద్ధ వ్యూహాల కోసం చరిత్ర పుస్తకాలు తిరగేస్తోంది. భారత సంస్కృతితో ముడి పడి, ఈ దేశానికి మాత్రమే సొంతమైన అరుదైన యుద్ధ రీతులు, వ్యూహాలను రిఫర్ చేయనుంది. దీంతో పాటు దౌత్య విధానాన్నీ పరిశీలించనుంది. ఈ ప్రాజెక్ట్‌కి "Project Udbhav" అనే పేరు పెట్టింది. ఇందుకోసం రక్షణ రంగానికి చెందిన United Service Institution of India (USI) సహకారం తీసుకోనుంది. ఈ క్రమంలోనే...అక్టోబర్ 21,22వ తేదీల్లో USI మిలిటరీ హెరిటేజ్ ఫెస్టివల్‌ని నిర్వహించనుంది. దేశ భద్రత విషయంలో భారత వ్యూహాలు, మిలిటరీ సామర్థ్యాలు, భద్రతా బలగాల నవీకరణతో పాటు ఆత్మనిర్భర భారత్ గురించి ఈ ఫెస్టివల్‌లో చర్చించనున్నారు. ఈ విషయాన్ని ఇండియన్ ఆర్మీ కూడా ధ్రువీకరించింది.
"భారత్‌కి మాత్రమే సొంతమైన, ఈ సంస్కృతితో ముడిపడిన అరుదైన యుద్ధ రీతులు, వ్యూహాలను పరిశీలించడమే ఈ ప్రాజెక్ట్ ఉద్భవ్ లక్ష్యం. ఇందుకోసం చరిత్రలో యుద్ధాల గురించి రాసిన పుస్తకాలను, ఆయా రాజ్యాలు అనుసరించిన రీతుల్ని గమనిస్తాం. వీటిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తాం. వీటితో పాటు కౌటిల్యుడు చెప్పిన యుద్ధ తంత్రాన్నీ పరిశీలిస్తాం"
- ఇండియన్ ఆర్మీ
యుద్ధ రీతులపై అధ్యయనం..
ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కోసం ప్రత్యేకంగా ఓ ప్యానెల్‌ని కూడా ఏర్పాటు చేసింది భారత ప్రభుత్వం. సెప్టెంబర్ 29న భేటీ కూడా అయింది. ఇప్పుడున్న యుద్ధ వ్యూహాలను ఎలా సంస్కరించాలో చర్చించారు. చరిత్రలో ఆయా రాజ్యాల్లోని యుద్ధ కళలు, రీతులను పరిశీలిస్తూనే ఇప్పటి కాలానికి తగ్గట్టుగా వాటిని ఎలా అప్లై చేసుకోవచ్చో అధ్యయనం చేయనున్నారు. రాజ్యాలు తమ సైన్యాలను ఎలా పవర్‌ఫుల్‌గా మార్చుకున్నాయి..? కాలం గడిచే కొద్ది ఎలాంటి సంస్కరణలు జరిగాయి..? తమ నేలను ఎలా కాపాడుకున్నాయి..? అనే అంశాలపైనే ఎక్కువగా ఫోకస్ చేయనుంది ఈ ప్రాజెక్ట్ ఉద్భవ్. కేవలం వ్యూహాలను అధ్యయనం చేయడమే కాదు. అందుకు సంబంధించిన "పదాలపైనా" దృష్టి పెట్టనుంది. భారత్‌కి మాత్రమే సొంతమైన ఫిలాసఫీనీ పరిశీలించనున్నారు. నిజానికి...ఈ ప్రక్రియ 2021 నుంచే మొదలైంది. చరిత్ర పుస్తకాల నుంచి 75 సిద్ధాంతాలను సేకరించి ఓ బుక్ కూడా పబ్లిష్ చేశారు. ఇండియన్ ఆర్మీలోని అన్ని ర్యాంకులకు చెందిన అధికారులు ఈ పుస్తకాన్ని చదవాలని ఆదేశించారు. దీన్ని ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లేట్ చేసి అందరికీ అందించారు. అయితే..ఇటీవల ప్యానెల్ మీటింగ్‌లో కీలక ప్రతిపాదనలు తీసుకొచ్చారు. 4వ శతాబ్దం, 8వ శతాబ్దాల్లో కౌటిల్యుడు, కమందక, కురల్ లాంటి రాజ నీతిజ్ఞులు చెప్పిన యుద్ధ తంత్రాలనూ ఓ సారి పరిశీలించాలన్న చర్చ జరిగింది. వీటినే ఆధునిక యుద్ధ రంగానికి ఆపాదించుకుంటే బాగుంటుందన్న అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)