Pahalgam Tourist Attack: పహల్గాం ఉగ్రదాడి ఘటన, కాల్పులు జరిపిన ఓ టెర్రరిస్ట్ ఫస్ట్ ఫొటో వైరల్- మొత్తం నలుగురు పాక్ టెర్రరిస్టులు
జమ్మూకాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలో పహల్గాం సమీపంలో మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. కాగా, కాల్పులు జరిపిన ఓ టెర్రరిస్ట్ ఫస్ట్ ఫొటో వైరల్ అవుతోంది.

Pahalgam Tourist Attack: పహల్గాం: జమ్మూకాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మృతిచెందారు వీరిలో పర్యాటకులే అధికంగా ఉండగా.. ఇద్దరు విదేశీయులు, ఇద్దరు స్థానికులు సైతం ప్రాణాలు కోల్పోయారు. పర్యాటకులపై జరిగిన దాడిలో పాల్గొని కాల్పులు జరిపిన ఉగ్రవాదుల మొదటి ఫొటో వచ్చేసింది. టెర్రరిస్ట్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో మంగళవారం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో కనీసం 26 మంది మరణించగా, పలువురు గాయపడ్డారని అధికారులు తెలిపారు.
ట్రెక్కింగ్ కోసం సుందరమైన బైసరన్ లోయను సందర్శించే పర్యాటకుల బృందాన్ని ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ఈ ఉగ్రదాడిలో విశాఖ వాసితో పాటు హైదరాబాద్ లో ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసే ఓ అధికారి ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాదులు ఈ కాల్పులకు పాల్పడ్డట్లు ప్రకటించారు. ఉగ్రవాదుల వివరాలను సేకరించడానికి అధికారులు కృషి చేస్తున్నారు.
పాకిస్తాన్‌కు చెందిన టెర్రరిస్ట్ రెసిస్టెన్స్ ఫ్రంట్ సంస్థకు చెందిన టెర్రరిస్టులు పహల్గామ్ లో ఉగ్రదాడికి పాల్పడ్డారు. పర్యాటకులను టార్గెట్ గా చేసుకుని విచక్షణారహితంగా కాల్పులు జరిపి మారణహోమానికి పాల్పడ్డారు. పహల్గామ్‌లోని బైసరన్ పర్యాటక ప్రదేశంలో నలుగురు ఉగ్రవాదులు ఉన్నారని జమ్మూకాశ్మీర్ పోలీసులు గుర్తించారు. ఉగ్రవాదుల్లో ఒకడు ఆదిల్ గురీ అని, అతను పాకిస్తాన్ నుంచి 2018 లో విదేశాలకు వెళ్లినట్లు సమాచారం. మరొక ఉగ్రవాదిని ఆసిఫ్ షేక్‌గా పోలీసులు గుర్తించారు. గురీ, షేక్‌లతో పాటు మరో ఇద్దరు ఉగ్రవాదులు పహల్గాంలో కాల్పులు జరిపి ఉగ్రదాడికి పాల్పడ్డారని సమాచారం. ఈ ఉగ్రవాదులు నలుగురు పాకిస్తాన్ కు చెందిన వారని.. వారిని పట్టుకునేందుకు బలగాలు రంగంలోకి దిగాయి.
ఉగ్రదాడిని ఖండించిన ఒమర్ అబ్దుల్లా
జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. ఇది "అసహ్యకరమైనద", తీవ్రమైన చర్యగా అని అభివర్ణిస్తూ విషాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సైతం ఉగ్రదాడులను సహించేది లేదన్నారు.
సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని ప్రధాని మోదీ భారత్‌కు తిరిగొచ్చారు. సౌదీ నుంచి తిరిగొచ్చిన వెంటనే ఢిల్లీ ఎయిర్ పోర్టులో విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ సహా పలువురు ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ సమీక్షించారు. ఉగ్రవాదుల దాడి, అనంతరం పరిణామాలపై చర్చించారు. ఉగ్రమూకల ఏరివేతకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను మోదీ ఆదేశించినట్లు సమాచారం.
టెర్రరిస్ట్ రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) అనేది లష్కరే తోయిబాకు చెందిన ఒక ఉగ్రవాద శాఖ. జమ్మూకాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తరువాత ఏర్పడిన రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉగ్రవాదులు పహల్గాంలో ఈ దాడికి పాల్పడ్డామని ప్రకటించారు.






















