Mysore: ఇలా వచ్చారు..అలా పది కోట్ల బంగారం దోచుకెళ్లారు - మైసూరులో సినిమాటిక్ రాబరీ ! వైరల్ వీడియో
Mysore Robbery: గోల్డ్ షాపులో ఐదు నిమిషాల ముందు అంతా బాగుంది. కానీ ఐదు నిమిషాల తర్వాత అక్కడేమీ లేదు. ఈ ఐదు నిమిషాల్లో ఏం జరిగిందో తెలిస్తే ఇదేదో సినిమా సీన్ అనుకుంటారు.

Daylight Gold Shop Robbery Shocks Mysore: కర్ణాటకలోని మైసూరు జిల్లాలో పట్టపగలే సంచలన దోపిడీ జరిగింది. హున్సూర్ పట్టణంలోని 'స్కై గోల్డ్ అండ్ డైమండ్స్' షోరూంలోకి చొరబడిన దుండగులు, సినీ ఫక్కీలో తుపాకులతో హల్చల్ చేస్తూ సుమారు రూ. 10 కోట్ల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలను దోచుకెళ్లారు. కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే ఈ భారీ చోరీ జరగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఆదివారం మధ్యాహ్నం జ్యువెలరీ షాపు వ్యాపారంతో బిజీగా ఉన్న సమయంలో, ముఖాలకు మాస్కులు ధరించిన ఐదుగురు దుండగులు ఒక్కసారిగా లోపలికి ప్రవేశించారు. వారి చేతుల్లో ఉన్న తుపాకులను చూపిస్తూ షోరూం సిబ్బందిని, కస్టమర్లను తీవ్రంగా భయభ్రాంతులకు గురిచేశారు. ఎవరైనా ప్రతిఘటిస్తే కాల్చివేస్తామని బెదిరించి, షాపులోని విలువైన వజ్రాభరణాలు, బంగారాన్ని బ్యాగుల్లో నింపుకున్నారు.
దుండగులు అత్యంత ప్రణాళికాబద్ధంగా ఈ దోపిడీకి పాల్పడ్డారు. కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే షోరూంలోని ప్రధాన కౌంటర్లలో ఉన్న బంగారాన్ని ఊడ్చేశారు. సుమారు రూ. 10 కోట్ల విలువైన ఆభరణాలతో పాటు అక్కడి నుంచి వేగంగా పరారయ్యారు. దుండగుల వేగం, వారు వ్యవహరించిన తీరు చూస్తుంటే, వారు ఈ షోరూంపై ముందుగానే రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ దోపిడీకి సంబంధించిన దృశ్యాలన్నీ షోరూంలోని సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. తుపాకులు గురిపెట్టి సిబ్బందిని ఒక మూలకు నెట్టడం, ఆభరణాలను ఎత్తుకెళ్లడం వంటి దృశ్యాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే ఉన్నత స్థాయి పోలీస్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. షోరూం యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.
Cinematic-Style Daylight Gold Shop Robbery Shocks Mysore
— Karnataka Portfolio (@karnatakaportf) December 28, 2025
In a shocking incident that unfolded like a scene from a crime thriller, a brazen daylight robbery took place in Hunsur, Mysore district, exposing the growing audacity of criminals and the alarming rise in organized crime.… pic.twitter.com/hJ2ojzOe2V
ఈ భారీ దోపిడీని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు, నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. పట్టణ పొలిమేరల్లోని చెక్ పోస్టులను అప్రమత్తం చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిందితులు ఏ దిశగా పరారయ్యారో తెలుసుకునేందుకు ప్రధాన రహదారుల వెంబడి ఉన్న సీసీటీవీలను కూడా జల్లెడ పడుతున్నారు. ఈ ఘటనతో మైసూరు వ్యాపార వర్గాల్లో ఒక్కసారిగా భయాందోళనలు మొదలయ్యాయి.





















