Chandrayaan-3 Soft Landing: నేడే చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ - నాసా, ఈఎస్ఏ నుంచి ఇస్రోకు మరింత సహకారం, ఎలాగంటే!
Chandrayaan-3 Soft Landing: ఇస్రో చేపట్టిన చంద్రయాన్ 3 ప్రయోగం నేడు కీలక దశకు చేరుకుంది. విక్రమ్ ల్యాండర్ మాడ్యుల్ చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేయాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
చంద్రుడిపై ప్రయోగాలకు ఇస్రో చేపట్టిన చంద్రయాన్ 3 ప్రయోగం తుది దశకు చేరుకుంది. చంద్రయాన్-3 జూలై 14న మధ్యాహ్నం 2:35 గంటలకు శ్రీహరికోట రేంజ్ లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించారు భారత శాస్త్రవేత్తలు. ఆగస్టు 23న సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు చంద్రుడిపై ల్యాండర్ విక్రమ్ మాడ్యుల్ సాఫ్ట్ ల్యాండ్ జరగనుంది. అయితే కీలకమైన సాఫ్ట్ సమయంలో ఇస్రో శాస్త్రవేత్తలకు విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ కదలికల్ని జాగ్రత్తగా నిర్వహించాలి. అందుకోసం సిగ్నల్స్ ను నిర్వహించేందుకు ఇస్రోకు నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) సహకరిస్తామని ప్రకటించాయి. ఆస్ట్రేలియాలోని న్యూ నోర్సియా అనే గ్రౌండ్ స్టేషన్ సైతం నేడు చంద్రుడిపై కీలకమైన ల్యాండింగ్ ప్రాసెస్ లో ఇస్రోకు సహకారం అందిస్తామని తెలిపింది.
భారత్ కు చెందిన ఇస్రో శాస్త్రవేత్తలు వినియోగించే సొంత టెక్నాలజీ, యాంటెన్నాతో పాటు కమ్యూనికేషన్ కోసం, సిగ్నల్స్ ను సరైన విధంగా ట్రాక్ చేయడానికి నాసా, యూరప్ స్పేస్ ఏజెన్సీలు తమ యాంటెన్నాతో సహకరించడానికి సిద్ధంగాఉన్నాయి. చంద్రయాన్-3 మిషన్ లో ISROకు చెందిన డీప్ స్పేస్ కమ్యూనికేషన్ యాంటెన్నాతో పాటు, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (NASA), యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) సమన్వయంతో పనిచేయనున్నాయి. దాంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కొన్ని గ్రౌండ్ స్టేషన్ల నుంచి భారత్ కు కమ్యూనికేషన్, సిగ్నల్స్ ట్రాకింగ్ విషయంలో మద్దతు లభించింది.
చంద్రయాన్-3 ప్రయోగం కీలక దశలో ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్ మాడ్యూల్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్ ఉంటాయి. నేడు సాఫ్ట్ ల్యాండింగ్ సమయంలో ఈ మూడింటి సిగ్నల్స్ ను బెంగళూరులోని ఇస్రో అంతరిక్ష నౌక నియంత్రణ కేంద్రం కంట్రోల్ చేయనున్నారు భారత శాస్త్రవేత్తలు. ప్రధాని తరచుగా చెప్పే మాట వసుదైక కుటుంబం (ప్రపంచం అంతా ఒకే కుటుంబం) అనే మాటను అమెరికా, యూరప్ దేశాలు నిజం చేస్తున్నాయి. భారత్ కు సంబంధించిన కీలక ప్రయోగం మనతో పాటు ప్రపంచ దేశాలకు స్ఫూర్తిగా నిలవనుంది. ప్రయోగంలో తెలుసుకునే విషయాలు ప్రపంచ దేశాలకు ఓ దారిని వేస్తాయని చెప్పడంతో సందేహం లేదు. ప్రధాని నరేంద్ర మోదీ, భారత్ శాస్త్రవేత్తల రిక్వెస్ట్ మేరకు నాసా, ఈఎస్ఏలు తమ పరిశోధనా కేంద్రాల నుంచి చంద్రయాన్ 3 కీలక దశలో సిగ్నలింగ్, మానిటరింగ్ విషయంలో ఇస్రోకు బ్యాకప్ గా పనిచేయనున్నాయి. ఇస్రో శాస్త్రవేత్తలు కోరిన సమయంలో నాసా, ఈఎస్ఏ అంతరిక్ష సంస్థలు విక్రమ్ ల్యాండింగ్ తో పాటు ల్యాండింగ్ మాడ్యుల్ నుంచి చంద్రుడి మీదకు రోవర్ చేరుకోవడానికి కమ్యూనికేషన్ సిగ్నల్స్ ట్రాక్ చేయనున్నాయి.
Our New Norcia antenna will serve as a back-up for @isro's ground station during the #Chandrayaan_3 landing, currently planned for Wednesday 23 August. https://t.co/3IoHSC8JaQ
— ESA (@esa) August 21, 2023
చంద్రయాన్-3 మిషన్‌కు నాసా, ఈఎస్ఏ కింది గ్రౌండ్ స్టేషన్ల నుంచి సహకారం..
1. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA)కు చెందిన ESOC మిషన్ కంట్రోల్ సెంటర్, జర్మనీ
2. యూకేలోని గూన్‌హిల్లీ ఎర్త్ స్టేషన్ లిమిటెడ్.
3. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఫ్రెంచ్ గయానా కౌరు గ్రౌండ్ స్టేషన్
4. పలు చోట్ల ఉన్న NASA డీప్ స్పేస్ నెట్‌వర్క్ సెంటర్స్
5. ఇస్రోకు చెందిన అంతరిక్ష వాహక నౌక కమాండ్ సెంటర్ లో ఉన్న 32 మీటర్ల డీప్ స్పేస్ యాంటెన్నా.
ఈఎస్ఏకు చెందిన న్యూ నోర్సియా యంటెన్నా సైతం చంద్రయాన్ 3 ప్రయోగం నేటి కీలక దశలో ఇస్రోకు సహకారం అందించనుందని తెలిపారు.