Sridevi Shoban Babu Review - 'శ్రీదేవి శోభన్ బాబు' రివ్యూ : చిరంజీవి కుమార్తె నిర్మించిన సినిమా ఎలా ఉందంటే?
Sridevi Shoban Babu Movie Review In Telugu : చిరంజీవి కుమార్తె సుష్మిత, అల్లుడు విష్ణు ప్రసాద్ నిర్మించిన సినిమా 'శ్రీదేవి శోభన్ బాబు'. ఈ సినిమా ఎలా ఉందంటే?

ప్రశాంత్ కుమార్ దిమ్మల
సంతోష్ శోభన్, గౌరీ జి కిషన్, నాగబాబు, రోహిణి తదితరులు
సినిమా రివ్యూ : శ్రీదేవి శోభన్ బాబు
రేటింగ్ : 1.75/5
నటీనటులు : సంతోష్ శోభన్, గౌరీ జి కిషన్, నాగబాబు, రోహిణి, మెహబూబ్ బాషా తదితరులు
ఛాయాగ్రహణం : సిద్ధార్థ్ రామస్వామి
సంగీతం : కమ్రాన్
నిర్మాతలు : సుస్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్
దర్శకత్వం : ప్రశాంత్ కుమార్ దిమ్మల
విడుదల తేదీ: ఫిబ్రవరి 18, 2023
మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత (Chiranjeevi Daughter Sushmita), అల్లుడు విష్ణు ప్రసాద్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు. 'షూటౌట్ ఎట్ ఆలేరు' వెబ్ సిరీస్, ఓటీటీలో విడుదలైన సేనాపతి సినిమా ప్రొడ్యూస్ చేశారు. తాజాగా సుస్మిత, విష్ణు ప్రసాద్ నిర్మించిన సినిమా 'శ్రీదేవి శోభన్ బాబు' (Sridevi Shoban Babu Movie). సంతోష్ శోభన్ (Santosh Shoban), గౌరీ జి కిషన్ (Gouri G Kishan) జంటగా నటించారు. ఈ సినిమా ఎలా ఉందంటే?
కథ (Sridevi Shoban Babu Movie Story) : శ్రీదేవి (గౌరీ జి కిషన్) ఫ్యాషన్ డిజైనర్. గ్రామీణ మహిళల ఫ్యాషన్ మీద డిజైన్స్ చేయడానికి అరకు వెళతానని అంటే... తండ్రి చంద్రశేఖర్ (నాగబాబు) వద్దంటాడు. తనకు, చెల్లెలు కమల (రోహిణి) కు జరిగిన గొడవ గురించి కుమార్తెకు చెబుతాడు. అసలు ఆ గొడవ ఏంటి? అరకు వెళ్ళిన శ్రీదేవికి తన బావ శోభన్ బాబు (సంతోష్ శోభన్) అని ఎప్పుడు తెలిసింది? మావయ్య పేరు చెబితే కోప్పడే శోభన్ బాబు... మరదలితో ఎప్పుడు ప్రేమలో పడ్డాడు? ఒకరి మీద మరొకరికి ప్రేమ కలగడానికి కారణం ఏంటి? గొడవల్ని పక్కన పెట్టి రెండు కుటుంబాలు ఎలా ఒక్కటి అయ్యాయి? అనేది మిగతా సినిమా.
విశ్లేషణ : సినిమా ప్రచార చిత్రాల కంటే టైటిల్ ఎక్కువ మందిని ఆకర్షించింది. ఆ హీరో హీరోయిన్లకు శోభన్ బాబు, శ్రీదేవి పేర్లు పెట్టడంతో వాళ్ళ ఐకానిక్ క్యారెక్టర్లు గుర్తు చేసేలా నోస్టాల్జియా సీన్స్ ఏమైనా ఉంటాయేమోనని అనుకుంటే పొరపాటే. పేర్లు వాళ్ళవి అయినా కంటెంట్ వేరు.
శ్రీదేవి, శోభన్ బాబు పేర్లు మాత్రమే కాదు... కథ కూడా ఆ రోజుల్లో హిట్ సినిమాల స్ఫూర్తితో రాశారేమో అని ఫస్టాఫ్ చూసిన తర్వాత అనుమానం కలుగుతుంది. ఆ ఇంటర్వెల్ తర్వాత కన్ఫర్మ్ అవుతుంది. ఎందుకు? అంటే... కథలో కొంచెం కూడా కొత్తదనం లేదు. బీసీ కాలం బావ మరదళ్ల ప్రేమ, అన్నా చెల్లెళ్ళ సెంటిమెంట్ కథే 'శ్రీదేవి శోభన్ బాబు'. లవ్ & ఫ్యామిలీ ఎమోషన్స్ ఎవర్‌గ్రీన్ కాన్సెప్ట్. అయితే, ఆ ప్రేమ కథలో, భావోద్వేగాలలో నిజాయతీ ఉంటే ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. అసలు ఫస్టాఫ్ జరుగుతుంటే ఇంత సిల్లీ కామెడీని ఎలా యాక్సెప్ట్ చేశారు? అనే డౌట్ వస్తుంది.
ఫస్టాఫ్ మొత్తం ఏమాత్రం నవ్వించని సన్నివేశాలతో దర్శకుడు టైమ్ పాస్ చేశారు. మంచి ఆర్టిస్టులైన సంతోష్ శోభన్, గౌరీ సైతం ఏం చేయలేకపోయారు. ఇంటర్వెల్ తర్వాత కథ కొంచెం గాడిలో పడింది. రొటీన్ కథ, సీన్స్ అయినప్పటికీ... రోహిణి, హీరో హీరోయిన్లు చూసేలా చేశారు. వాళ్ళకు సంగీత దర్శకుడు కమ్రాన్, కెమెరా మ్యాన్ సిద్ధార్థ్ రామస్వామి నుంచి మంచి సపోర్ట్ లభించింది. ఇంటర్వెల్ తర్వాత వచ్చే పాటలు, పిక్చరైజేషన్ సూపర్. ఎమోషనల్ కంటెంట్ కూడా కొంత వర్కవుట్ అయ్యింది. కథకు తగ్గట్టు నిర్మాణ విలువలు ఉన్నాయి.
నటీనటులు ఎలా చేశారంటే? : సంతోష్ శోభన్ మంచి పెర్ఫార్మర్. అందులో డౌట్ అవసరం లేదు. సెకండాఫ్, ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్ చూస్తే... సంతోష్ నటన ఆకట్టుకుంటుంది. '96', 'ఓకే జాను' సినిమాల్లో టీనేజ్ అమ్మాయిగా నటించిన గౌరీ జి కిషన్... తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నారు. శ్రీదేవి పాత్రలోనూ టీనేజ్ అమ్మాయిగా బాగా చేశారు. భావోద్వేగభరిత సన్నివేశాల్లో ఆమె నటన బావుంది. సంతోష్ శోభన్, గౌరీ జి కిషన్ మధ్య కెమిస్ట్రీ కూడా కుదిరింది. అయితే... కంటెంట్ లేకపోవడంతో కొన్ని సన్నివేశాలు తేలిపోయాయి. నాగబాబు ఇటువంటి తండ్రి పాత్రలు చాలా చేశారు. తల్లిగా రోహిణి పాత్ర రొటీన్ అయినప్పటికీ... ఆమె నటన వల్ల ఎమోషనల్ సీన్స్ వర్కవుట్ అయ్యాయి.
Also Read : 'వినరో భాగ్యము విష్ణు కథ' రివ్యూ : కిరణ్ అబ్బవరానికి హిట్ వచ్చిందా? లేదా?
చివరగా చెప్పేది ఏంటంటే? : 'షూటౌట్ ఎట్ ఆలేరు', 'సేనాపతి' సినిమాల్లో స్ట్రాంగ్ కంటెంట్ ఉంది. 'శ్రీదేవి శోభన్ బాబు'లో అటువంటి స్ట్రాంగ్ ఎమోషన్, కంటెంట్ ఏదీ లేదు. సిల్లీ కామెడీ సీన్స్, రొటీన్ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన సినిమా ఇది. డిజిటల్, ఓటీటీ స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫార్మ్స్‌లో ఆడియన్స్‌ను ఏమైనా ఆకట్టుకోవచ్చు.
Also Read : 'సార్' రివ్యూ : ధనుష్ పాఠాలు బోర్ కొట్టించాయా? ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

