Jamuna Death : టాలీవుడ్‌లో విషాదం - సీనియర్ హీరోయిన్ జమున మృతి
Jamuna Passed Away : తెలుగు చిత్ర పరిశ్రమలో భారీ విషాదం చోటు చేసుకుంది. సీనియర్ హీరోయిన్ జమున మృతి చెందారు.
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సీనియర్ హీరోయిన్ జమున (Jamuna) ఇక లేరు. వయసు ప్రభావంతో పాటు ఆరోగ్య సమస్యలతో ఆమె మృతి చెందారు. గుండెపోటు కారణంగా తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆమె వయసు 86 ఏళ్ళు. హైదరాబాద్‌లోని స్వగృహంలో జమున తుది శ్వాస విడిచారు.
తెలుగు సహా ఇతర దక్షిణాది భాషల్లో సుమారు 198 చిత్రాల్లో జమున నటించారు. ఆమె ఆగస్టు 30, 1936లో హంపీలో జన్మించారు. ఆమె తల్లి తండ్రులది ప్రేమ వివాహం. ఆమె తండ్రి నిప్పని శ్రీనివాసరావు మాధవ్ బ్రాహ్మిణ్ కాగా... తల్లి కౌశల్యా దేవి వైశ్యులు. జమునకు ఏడేళ్ళ వయసు ఉన్నప్పుడు హంపి నుంచి గుంటూరుకు ఫ్యామిలీ షిఫ్ట్ అయ్యింది. దుగ్గిరాలలో ఆవిడ పెరిగారు. మహానటి సావిత్రి ఒకసారి దుగ్గిరాల వెళ్ళినప్పుడు వాళ్ళింట్లో ఉన్నారు. సావిత్రి ఆహ్వానంతో జమున సినిమాల్లోకి వచ్చారు. గరికపాటి రాజారావు తీసిన 'పుట్టిల్లు' సినిమాతో జమున చిత్రసీమకు పరిచయం అయ్యారు. అయితే, ఎల్వీ ప్రసాద్ తీసిన 'మిస్సమ్మ'తో ఆమెకు ఫస్ట్ బ్రేక్ వచ్చింది. తొలి సినిమా చేసినప్పుడు ఆమె వయసు 15 ఏళ్ళు.
జమున హిట్ సినిమాలు
నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబు... స్వర్ణయుగపు కథానాయకుల సరసన జమున కథానాయికగా నటించారు. 'పండంటి కాపురం', 'మిస్సమ్మ', 'దొంగ రాముడు', 'గుండమ్మ కథ', 'గులేబకావళి', 'మూగ మనసులు', 'శ్రీకృష్ణ తులాభారం' తదితర విజయవంతమైన సినిమాల్లో జమున నటించారు.
సిల్వర్ స్క్రీన్ సత్యభామగా గుర్తింపు
జమున పలు విజయవంతమైన సినిమాలు చేసినప్పటికీ.... ఆమెకు సిల్వర్ స్క్రీన్ సత్యభామగా ఎక్కువ పేరు వచ్చింది. అందుకు కారణం 'శ్రీకృష్ణ తులాభారం'. ఆ సినిమాలో ఆమె నటనను ఎవరూ అంత త్వరగా మరువలేరు. 'గులేబకావళి' సినిమాలో 'నన్ను దోచుకుందువటే...' పాటనూ మర్చిపోవడం అంత సులభం కాదు. ఎన్టీఆర్, జమున కలయికలో హిట్స్ అటువంటివి.
నాలుగు భాషల్లో...
తెలుగు సహా తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో జమున నటించారు. హిందీలో సుమారు 10 సినిమాలు చేశారు. కన్నడలో 8, తమిళంలో సుమారు 30 సినిమాలు చేశారు. తెలుగులోనే జమున ఎక్కువ సినిమాలు చేశారు.
జమునకు వచ్చిన అవార్డులు హిందీ సినిమా 'మిలన్' (1967)కు గాను ఆమె ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు. తెలుగులో 'మూగ మనసులు'గా రీమేక్ అయినది ఆ సినిమాయే. ఆ తర్వాత 'పండంటి కాపురం' సినిమాకు గాను మరోసారి ఫిల్మ్ ఫేర్ స్పెషల్ అవార్డు అందుకున్నారు. తమిళనాడు స్టేట్ అవార్డు, ఎన్టీఆర్ నేషనల్ అవార్డు, బి. సరోజినీదేవి నేషనల్ అవార్డు అందుకున్నారు.
తెలుగింటి కోడలు
జమున మాతృభాష తెలుగు కాదు. కానీ, ఆమె అచ్చమైన తెలుగింటి కోడలు. ఎస్వీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జూలూరి రమణారావును ఆమెను వివాహం చేసుకున్నారు. ఆయన నవంబర్ 10, 2014లో మృతి చెందారు.
Also Read : రాజమౌళి ఫ్యామిలీపై కేంద్రం ప్రత్యేక ప్రేమ చూపిస్తుందా? ఇండస్ట్రీ టాక్ ఏంటంటే?
రమణా రావు, జామున దంపతులకు ఇద్దరు సంతానం. అబ్బాయి పేరు వంశీ జూలూరి. అమ్మాయి పేరు స్రవంతి. వాళ్ళిద్దరూ భాగ్య నగరంలోనే ఉంటున్నారు.
రాజకీయాల్లోనూ... ఎంపీగా
సినిమాల్లో కథానాయికగా విజయవంతమైన జమున... రాజకీయాల్లో కూడా సక్సెస్ అయ్యారు. ఎంపీగా ఎన్నిక అయ్యారు. రాజమండ్రి లోక్ సభ నియోజకవర్గం నుంచి 1989లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత 1991లో జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందారు. రాజకీయాల నుంచి వైదొలిగారు. అయితే, అటల్ బిహారి వాజ్‌పేయి హయంలో బీజేపీకి మద్దతుగా ప్రచారం చేశారు.
జమున మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆమె భౌతిక కాయాన్ని ఫిల్మ్ ఛాంబర్ కు తీసుకు రానున్నారు. నేడు అంత్యక్రియలు నిర్వహించనున్నారని తెలిసింది.
Also Read : 'హంట్' రివ్యూ : షాక్ ఇచ్చిన సుధీర్ బాబు, సినిమా ఎలా ఉందంటే?