CM Revanth Reddy: నేడు సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటన, 3 జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
Telangana MLC Elections | పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. నేడు మూడు జిల్లాల్లో రేవంత్ రెడ్డి ప్రచారం చేయనున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారు. పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముందుగా నిజామాబాద్ జిల్లాతో పాటు మంచిర్యాల, కరీంనగర్ జిల్లాలో హెలికాప్టర్ లో పర్యటించనున్నారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల స్థానాన్ని తిరిగి కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నది. ఈ నెల 25న ప్రచారం ముగియనుండగా 24న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు జిల్లాలో ఒకేరోజు కరీంనగర్, మంచిర్యాల, నిజామాబాద్ జిల్లాలలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభల్లో ఆయన పాల్గొంటారు.
తిరిగి కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ యత్నాలు
కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల స్థానాన్ని తిరిగి కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు ఎక్కడికక్కడ ప్రచారం చేస్తుండగా, 24న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. కరీంనగర్, మంచిర్యాల, నిజామాబాద్ జిల్లాల్లో ఆయన పర్యటన ఖరారయ్యింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన పథకాలు, చేకూర్చిన లబ్ధి, భవిష్యత్లో చేపట్టనున్న కార్యక్రమాలు వివరించి పట్టభద్రుల్లో పార్టీపై మరింత సానుకూలత సాధించే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఈ పర్యటన రూపొందించుకున్నారని తెలుస్తోంది. సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితోపాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొంటారు.
ముందుగా నిజామాబాద్‌లో ఎన్నికల ప్రచారం..
ముందుగా ఉదయం 11:00 గంటలకు రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి నిజామాబాద్ కు 11:45 నిమిషాలకు చేరుకుంటారు. ఆయన 11:50 నుంచి 1:30 వరకు నిజామాబాద్ పట్టణంలో నిర్వహించే పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1:35 కి ఇక్కడి నుంచి బయల్దేరి మంచిర్యాల జిల్లాకు 2:15 కు చేరుకొని అక్కడ నిర్వహించే పట్టభద్రుల ఆత్మియ సమ్మేళనంలో పాల్గొంటారు.
ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో నిజామాబాద్ పట్టణంలోని భూమారెడ్డి ఫంక్షన్ హాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారిక కార్యక్రమం కాకపోయినా పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో మధ్యాహ్నం 2:15 గం.లకు ముఖ్యమంత్రి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక్కడ కూడా పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటారు. ఆయన సభ విజయవంతం చేసేందుకు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావ్ అన్ని ఏర్పాట్లు పరిశీలించడంతో పాటు కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి సభ విజయవంతం చేసేందుకు శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కరీంనగర్‌లో ఎన్నికల ప్రచారం..
చివరగా కరీంనగర్ జిల్లాలో ఎస్ ఆర్ ఆర్ కళాశాల మైదానంలో సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ నేతలు అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యేలా చేస్తున్నారు. ప్రజాపాలన వచ్చిన తర్వాత చేపట్టిన కార్యక్రమాలను వివరించి, పట్టభద్రులు ఆలోచించి కాంగ్రెస్ కు ఓటు వేయాలని ముఖ్యమంత్రి కోరనున్నారు. మొదటి ప్రాధాన్య ఓటుతోనే గెలిచేలా ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేసుకుని రాబోయే మూడు రోజుల్లో క్షేత్రస్థాయిలో ఓటరును కలిసి అభ్యర్థి గెలుపునకు కార్యకర్తలు కృషిచేసేలా వ్యూహం రూపొందించి మంత్రులు, ఎమ్మెల్యేల పర్యవేక్షణలో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడ ఏలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.





















