పతనంతో ఆసీస్ పర్యటన ప్రారంభం
అనుకున్నదంతా అయ్యింది. ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడిస్తేనే కానీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఆడలేం అనే టెన్షన్ తో పెర్త్ లో మొదటి టెస్ట్ కోసం అడుగుపెట్టిన భారత్...మొదటి ఇన్నింగ్స్ లో పేకమేడలా కూలిపోయింది. పెర్త్ లాంటి పేస్ పిచ్ పై టాస్ గెలిచి మేం బ్యాటింగే ఆడతాం అని పంతంతో దిగిన యువ భారత్...ఆసీస్ బౌలింగ్ లైనప్ ముందు తేలిపోయింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న యశస్వి జైశ్వాల్, ఈ మ్యాచ్ కి ముందే ఆసీస్ లో అడుగుపెట్టిన దేవ్ దత్ పడిక్కల్ గుండు సున్నాకే వెనుదిరిగారు. ఫామ్ లో లేని కింగ్ మరోసారి ఐదు పరుగులకే అవుటైపోయాడు. ఓపెనర్ రాహుల్ 26, మిడిల్ ఆర్డర్ లో పంత్ 37పరుగులు చేశాడు., లోయర్ మిడిల్ ఆర్డర్ లో నితీశ్ రెడ్డి 41పరుగులతో కాసేపు ఆసీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కోవటంతో కాస్త కోలుకున్న భారత్ చాలా కష్టపడి మొదటి ఇన్నింగ్స్ లో 150 పరుగులకు ఆలౌట్ అయ్యింది. నిప్పులు చెరిగే బంతులతో హేజిల్ వుడ్ నాలుగు వికెట్లు తీసుకోగా.. స్టార్క్, మిచ్ మార్ష్, కెప్టెన్ కమిన్స్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. స్పిన్నర్ నాథన్ లియాన్ ఒక్క ఓవర్ మాత్రమే బౌలింగ్ చేయగా..పేసర్లకే వికెట్లన్నీ సమర్పించుకున్నారు భారత బ్యాటర్లు. ఈ మ్యాచ్ ద్వారా తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి, బౌలర్ హర్షిత్ రానా టెస్టుల్లో అరంగ్రేటం చేశారు. ఈ మ్యాచ్ కోసం సీనియర్లు అశ్విన్, జడేజా ను పక్కన పెట్టిన టీమిండియా మేనేజ్మెంట్ వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్, హర్షిత్ రానా లకు అవకాశం కల్పించింది.