AP Assembly Sessions: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, వాటిని నిషేధిస్తూ సభ్యులకు కీలక ఆదేశాలు
AP Assembly Budget Sessions | ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం (ఫిబ్రవరి 24న) ప్రారంభం కానున్నాయి. మాజీ సీఎం జగన్ సమావేశాలకు హాజరు కానున్నారని వైసీపీ నేతలు తెలిపారు.

Andhra Pradesh Assembly Budget Sessions | అమరావతి: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేడు (ఫిబ్రవరి 24న) ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి జరుగుతున్న పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలు ఇవి. ఉదయం 10 గంటలకు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సెక్యూరిటీ కారణాలతో ఎమ్మెల్యేల పీఏలు, ఎమ్మెల్సీల పీఏలు, ఇతర సిబ్బందితోపాటు సందర్శకులను అసెంబ్లీ ఆవరణలోకి అనుమతించకూడదని నిర్నయం తీసుకున్నారు. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆదివారం నాడు ఏర్పాట్లు, భద్రతా చర్యలపై ఉన్నతాధికారులతో సమీక్షించారు.
అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం
బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యేందుకు సోమవారం ఉదయం 9.45కు ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీకి చేరుకోనున్నారు. అనంతరం 9.58 కి గవర్నర్ అబ్దుల్ నజీర్ కు గార్డ్ ఆఫ్ హానర్ తరువాత సీఎం చంద్రబాబు స్వయంగా ఆయనకు స్వాగతం పలకనున్నారు. ముఖ్యమంత్రితో పాటు గవర్నర్ కు అసెంబ్లీ వద్ద స్పీకర్, మండలి ఛైర్మన్, సీఎస్ తదితరులు స్వాగతం పలకనున్నారు. అనంతరం ఏపీ అసెంబ్లీలో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. ఆ తరువాత 11.15 కు సభ రేపటికి వాయిదా పడనుంది. అనంతరం బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ అంశాలపై చర్చించాలని నిర్ణయం తీసుకుంటారు.
అసెంబ్లీకి పాస్‌ల జారీని నియంత్రించినట్లు అధికారులకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు నిర్దేశిత సమయంలోగా అందజేయాలని సీఎస్ విజయానంద్‌ను ఆయన ఆదేశించారు. సభ్యుల పీఏలు గానీ, ఇతర సిబ్బందితో పాటు సందర్శకులను అసెంబ్లీలో ప్రాంగణంలోకి అనుమతించరు. సభా ప్రాంగణంలో సభ్యులు నినాదాలు లాంటివి చేయకుండా నిషేధించారు. శాసనసభ ఆవరణలో ఎలాంటి ప్రదర్శనలు, ఊరేగింపులు, బైఠాయింపులకు అనుమతి లేదని అసెంబ్లీ బులెటిన్ విడుదల చేసింది.
ప్రతిపక్ష హోదా డిమాండ్ చేయనున్న వైసీపీ సభ్యులు
అమరావతి : వైసీపీ అధినేత వైఎస్ జగన్ సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరు కానున్నారు. ఉదయం 9.30 గంటలకు అసెంబ్లీ హాలులో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అనుసరించాల్సిన వ్యూహంపై వైసీపీ అధినేత జగన్ దిశా నిర్దేశం చేయనున్నారు. కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలు, ప్రభుత్వ వైఫల్యాలను గట్టిగా నిలదీయాలని సభ్యులకు సూచించనున్నారు. సమావేశాల్లోనూ ప్రధానంగా ప్రతిపక్ష హోదా డిమాండ్ చేయాలని వైసీపీ భావిస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

