Sai Durga Tej: విజయవాడ అమ్మ అనాథాశ్రమానికి వెళ్లి మరీ విరాళం అందజేసిన సాయి దుర్గా తేజ్...
Sai Durga Tej: హీరో సాయి దుర్గ తేజ్ తన మంచి మనసు చాటుకున్నారు. వరదల్లో ఇబ్బందులు పడిన వారికి చేయూతనిచ్చిన ఆయన.. ఇప్పుడు విజయవాడ అమ్మ అనాథాశ్రమానికి విరాళం అందించారు.
ఎవరికి ఏ కష్టం వచ్చినా, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కున్న ఆదుకునేందుకు మెగా ఫ్యామిలీ ఎప్పుడూ ముందు ఉంటుంది. ఇటీవల కేరళ వరదల్లో ఇబ్బంది పడిన వారికి, తెలుగు రాష్టాల్లో వరదలు వచ్చినప్పుడు తమవంతు సాయం చేశారు మెగా హీరోలు. అలా సాయం చేసిన వారిలో ఒకరు సాయి దుర్గ్ తేజ్ కూడ. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కు సాయం అందించిన ఆయన ఇప్పుడు ఒక ఆశ్రమాన్ని ఆదుకున్నారు.
అమ్మ అనాథాశ్రమానికి విరాళం
సాయి దుర్గ్ తేజ్ ఎప్పుడూ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంటారు. ఎన్నో సందర్భాల్లో ఛారిటీ కార్యక్రమాలు చేసి తన మంచి మనసు చాటుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలతో ఇబ్బంది పడిన తెలుగు ప్రజలను ఆదుకునేందుకు తన వంతుగా రూ. 20 లక్షలను విరాళంగా ఇచ్చారు ఆయన. తాజాగా ఆయన విజయవాడలో పర్యటించి అమ్మ అనాథాశ్రమానికి రూ. 2 లక్షల రూపాయలు అందిచారు. దాంతో పాటుగా ఇతర సేవా సంస్థలకు కూడా రూ. 3 లక్షలు విరాళం అందించారు. బుధవారం విజయవాడ చేరుకున్న ఆయన.. కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని, ఆ తర్వాత ఆశ్రమానికి వెళ్లారు.
ఆశ్రమానికి సొంత భవనం నిర్మాణం
విజయవాడలోని అమ్మ ఆశ్రమానికి సొంత భవనం కట్టిస్తానని 2019లో తన పుట్టినరోజున మాటిచ్చారు సాయి దుర్గా తేజ్. చెప్పిన మాటను నిలబెట్టుకున్నారు. 2021లో బిల్డింగ్ కట్టించారు. అంతే కాకుండ మూడేళ్లు ఆ ఆశ్రమాన్ని దత్తత తీసుకున్న ఆయన మొత్తం ఖర్చులన్నీ భరించారు. ఆయన చేసిన మంచి పనులకు ఆశ్రమవాసులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తన మేనమామ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నుంచి సేవా గుణాన్ని పుణికిపుచ్చుకున్నాడు అంటూ పొగుడుతున్నారు. ఇలానే వీలైనంతలో సేవా కార్యక్రమాలు చేసి మంచి పేరు తెచ్చుకోవాలని ఆశీర్వదిస్తున్నారు ఆశ్రమ పెద్దలు.
సాయి దుర్గా తేజ్ కేవలం సామాజిక సేవ చేయడం మాత్రమే కాదు... సామాజిక అంశాలపై కూడా స్పందిస్తుంటారు. ఇటీవల ఒక యూట్యూబర్ తండ్రి, కూతుళ్ల వీడియోపై కామెంట్స్ చేశారు. దాన్ని తెలంగాణ సీఎం, ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి చర్యలు తీసుకునేలా చేశారు ఆయన.
సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందు వరుసలోనే
కేవలం సాయి దుర్గ్ తేజ్ మాత్రమే కాదు.. మెగా ఫ్యామిలీలోని ప్రతి ఒక్కరు సేవా కార్యక్రమాల్లో ముందు ఉంటారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ నడుపుతున్న విషయం తెలిసిందే. ఇక విపత్తులు ఎన్ని వచ్చినా తమవంతు సాయం అందిస్తారు వాళ్లంతా. కేరళలోని వయనాడ్ లో వరదలు సంభవించినప్పుడు చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ స్పందించి తమ సాయాన్ని ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలకు కూడా మెగా ఫ్యామిలీ నుంచి భారీగానే విరాళాలు వచ్చాయి. చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి దుర్గా తేజ్, వరుణ్ తేజ్, నిహారికా కొణిదెల తదితరులు విరాళాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పటికీ తన పర్సనల్ డబ్బుల నుంచి రిలీఫ్ ఫండ్ ప్రకటించారు.
Also Read: శర్వా 37లో సంయుక్త... శాస్త్రీయ నృత్యం చేస్తున్న దియా - ఫస్ట్ లుక్ చూశారా?