Pak Cricket Team: ఎలాంటి పాకిస్తాన్ టీమ్ ఇలా అయిపోయింది.. కారణాలు ఏమిటి?
Champions Trophy 2025 | ఎలాంటి పాకిస్తాన్ టీమ్ ఇలా అయిపోయింది.. కారణాలు ఏమిటి? అని ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

జట్టును ముందుండి నడిపించే ఇమ్రాన్ ఖాన్, రివర్స్ స్వింగ్ ని పాపులర్ చేసిన వసీం అక్రమ్ - వకార్ యూనిస్ జోడి, ప్రపంచ క్రికెట్కు దూస్రా ను పరిచయం చేసిన సక్లైన్ ముస్తాక్, ఫాస్ట్ బౌలింగ్ తో ప్రత్యర్థులను హడలెత్తించే షోయబ్ అక్తర్, క్రీజ్ లో పాతుకు పోయే ఇంజిమామ్ ఉల్ -హక్, సచిన్ కంటే ముందు డబల్ సెంచరీ సాధించిబోయి జస్ట్ మిస్సయిన సయీద్ అన్వర్, ఇండియాతో మ్యాచ్ అంటే చాలు రెచ్చిపోయే జావేద్ మియాందాద్ ఇలా పాకిస్తాన్ టీం ఆటగాళ్ల పేర్లు చెబితేనే ఆ జట్టు ఘన చరిత్ర మన కళ్ళముందు కదలాడుతుంది. కానీ అదంతా గతం. ప్రస్తుతం పాకిస్తాన్ జట్టు పేరు చెబితే ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ లాంటి జట్లు సైతం తేలిగ్గా తీసుకుంటున్న పరిస్థితి.
ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే..
స్వదేశంలో చాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తూ ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా టోర్నమెంట్ నుంచి బయటికి వెళ్లిపోయిన చెత్త రికార్డు ప్రస్తుతం పాకిస్తాన్ సొంతం చేసుకుంది. వెస్టిండీస్ తర్వాత ఆ స్థాయిలో ఫాస్ట్ బౌలింగ్కు పెట్టింది పేరైన పాకిస్తాన్ బౌలర్లను ఇప్పుడు ఎవరూ సీరియస్ గా తీసుకోవడం లేదు. మరోవైపు చిరకాల ప్రచారది ఇండియా ప్రపంచ క్రికెట్ ను శాసిస్తోంది. ఒకప్పుడు బ్యాటింగ్కు మాత్రమే పేరుపొందిన భారత జట్టు ఇప్పుడు ఫాస్ట్,స్పిన్ బౌలర్లతో చాలా స్ట్రాంగ్ గా మారింది. లాస్ట్ 14 ఇచ్చిన మ్యాచ్ లలో 13 మ్యాచ్ లు గెలుచుకుంది టీం ఇండియా. మరో వైపు గాలివాటం గెలుపులకు పర్యాయపదంగా మారింది పాకిస్తాన్ జట్టు. ఇంత తేడా ఎందుకు వచ్చింది. ఘనచరిత్ర ఉన్న పాకిస్తాన్ జట్టు ఇప్పుడెందుకు అంతర్జాతీయ క్రికెట్ లో నవ్వుల పాలవుతోంది. ఇప్పుడు చూద్దాం.
పాకిస్తాన్ -73 vs ఇండియా-58
ఇండియా పాకిస్తాన్ మధ్య ఇప్పటివరకు 136 వన్డే మ్యాచ్లు జరిగితే అందులో పాకిస్తాన్ 73 గెలిచింది. ఇండియా 58 గెలిచింది. అలాగే టెస్ట్ క్రికెట్లో మొత్తం 59 మ్యాచులు జరిగితే పాకిస్తాన్ 12, ఇండియా 9 గెలిచాయి. ఇలా పేపర్ పై చూస్తే పాకిస్తానే ఎక్కువ మ్యాచ్ లు గెలిచినట్టు కనబడుతుంది. కానీ వీటిలో పాక్ అధిక శాతం మ్యాచులు గెలిచింది చాలా పాత రోజుల్లో. 2003 తర్వాత పాకిస్తాన్ క్రికెట్ రోజు రోజుకి దిగజారుతూ వచ్చింది. వసీమ్ అక్రమ్, వకార్ యూనిస్, ఇంజిమామ్ లాంటి దిగ్గజాలు జట్టుకు దూరం కావడం ఆ తర్వాత కొంతకాలం పాటు మెయిన్ అట్రాక్షన్ గా ఉన్న షోయబ్ అక్తర్ కూడా రిటైర్ కావడంతో ఆ స్థాయి క్రికెటర్లు టీమ్ లోకి రాలేదు. ముఖ్యంగా గల్లీ క్రికెటర్లు గా ఉన్న అక్రమ్, వకార్ లలోని టాలెంట్ ని గుర్తించి వాళ్ళని పైకి తీసుకు వచ్చింది ఇమ్రాన్ ఖాన్. ఆ తర్వాత అలా ఫ్యూచర్ జనరేషన్ పై దృష్టిపెట్టే నాయకత్వం పాకిస్తాన్లో కొరవడింది.
పాక్ బోర్డు లో పెరిగిపోయిన రాజకీయ జోక్యం
రాజకీయ అనిచ్చితికి మారుపేరైన పాకిస్తాన్లో క్రికెట్ కూడా అలాగే తయారయింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో పెరిగిపోయిన రాజకీయ జోక్యం, జట్టు ప్రయోజనాల కంటే తమ ప్రాపకం ఉన్న వాళ్ళకి చోటు కల్పించే సెలక్టర్లు, భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టు జూనియర్ క్రికెట్ ను ప్రోత్సహించలేని వైనం ఇవన్నీ ఆ దేశ క్రికెట్ ను దెబ్బతీసాయి అంటారు స్వయాన పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు. 2023 వన్డే వరల్డ్ కప్, 2024 T20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లాంటి కీలక టోర్నమెంట్లలో గ్రూప్ స్టేజి లోనే అవుట్ అయింది పాకిస్తాన్ జట్టు. ఒకవైపు ప్రపంచ క్రికెట్లో ఎన్నో మార్పులు వచ్చాయి. కొత్త కొత్త టాలెంట్ వివిధ జట్లలో చేరుతోంది. ఆఫ్ఘనిస్తాన్ కూడా పెద్ద పెద్ద జట్లని భయపెడుతోంది. కానీ పాకిస్తాన్ తో మ్యాచ్ అంటే ఎవరూ సీరియస్ గా తీసుకొని పరిస్థితి. పాకిస్తాన్ మహిళా క్రికెట్ మాజీ కెప్టెన్ ఊరుజ్ మహమ్మద్, మాజీ క్రికెటర్ షోయిబ్ మాలిక్ లాంటి వాళ్ళు ఈ అంశం పైనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సెలక్షన్ చేసేది ఎవరు..
తామంతా చాలా గొప్ప ఆటగాళ్ళమనే ఒక భ్రమలో పాక్ ఆటగాళ్లు పడిపోయారని వాస్తవ పరిస్థితిని దృష్టిలో పెట్టుకోవట్లేదనేది వారి అభిప్రాయం. అసలు క్రికెట్ గురించి ఏమీ తెలియని వాళ్ళు టీం ని సెలెక్ట్ చేస్తున్నారని చాంపియన్స్ ట్రోఫీకి తయారవుతూ ఇక్కడ గ్రౌండ్స్ స్పిన్ కి అనుకూలిస్తాయన్న కనీస అవగాహన లేని సెలక్టర్లు, కెప్టెన్ జట్టును ఎలా గెలిపిస్తారనేది మాజీల వాదన. నలుగురు స్పిన్నర్లతో బరిలో దిగి న్యూజిలాండ్ పై చేసిన చిన్న స్కోర్ను సైతం ఇండియన్ టీం కాపాడుకుంటే కొన్ని రోజుల క్రితం ఇదే పిచ్చి పై కేవలం ఒక్క స్పిన్నర్ తో దిగి పాకిస్తాన్ ఘోర ఓటమి చెందింది అన్న విషయం మర్చిపోకూడదని గుర్తు చేస్తున్నారు.
ఇప్పటికైనా మారిన ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ స్టాండర్డ్స్ ని అందుకునేలాగా యంగ్ క్రికెటర్స్ ని ప్రోత్సహించాలని ఎనలిస్టులు మరోవైపు చెప్తున్నారు. ఒకప్పుడు ఒక సచిన్ +10 మంది ఆటగాళ్లు అన్నట్టుండే ఇండియన్ జట్టు ఇప్పుడు మ్యాచ్ విన్నర్లతో నిండిపోయింది అంటే కారణం డొమెస్టిక్ క్రికెట్ ను ప్రోత్సహించడమేనని పాకిస్తాన్ జట్టులో ఈ లక్షణం కొరవడిందని బాబర్ అజామ్ లాంటి ఒకరిద్దరు స్టార్లపైనే పాకిస్తాన్ క్రికెట్ ఆధార పడుతోందని ఇది సరికాదని మాజీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ లాంటి వాళ్ళు వాపోతున్నారు. పాకిస్తాన్ రానున్న రోజుల్లో నన్నా ఈ లోపాలపై దృష్టి పెడుతుందో లేదో చూడాలి. ఏదేమైనా ఒకప్పుడు ప్రపంచ క్రికెట్లో అగ్రశ్రేణిలో ఉండే పాకిస్తాన్ క్రికెట్ పూర్తిగా పతనం అవడంపై క్రికెట్ ప్రేమికులు విచారం వ్యక్తం చేస్తున్నారు.




















