GV Prakash: బాహుబలి, కాంతార తరహాలోనే 'కింగ్‌స్టన్' - ఇండియాస్ ఫస్ట్ సీ అడ్వెంచరస్ థ్రిల్లర్ ఫిల్మ్.. ఆ సముద్రం వెనుక సీక్రెట్ చెప్పిన హీరో!
Kingston Movie: 'కింగ్‌స్టన్' ఇండియాస్ ఫస్ట్ సీ అడ్వెంచరస్ థ్రిల్లర్ ఫిల్మ్ అని హీరో జీవీ ప్రకాష్ కుమార్ తెలిపారు. బాహుబలి, కాంతార తరహాలోనే ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందని చెప్పారు.

Hero GV Prakash About Kingston Movie: సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'కింగ్‌స్టన్' (Kingston). జీ స్టూడియోస్ సంస్థతో కలిసి ప్యారలల్ యూనివర్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఆయన ప్రొడ్యూస్ చేశారు. నిర్మాతగా కూడా జీవి ప్రకాష్ కుమార్ తొలి చిత్రమిది. గంగా ఎంటర్టైన్మెంట్స్ అధినేత మహేశ్వర్ రెడ్డి ఈ మూవీని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ నెల 7న తెలుగు, తమిళ భాషల్లో మూవీ రిలీజ్ కానుంది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్ వచ్చిన ఆయన.. సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ఫస్ట్ సీ అడ్వెంచరస్ థ్రిల్లర్ సినిమా
'కింగ్‌స్టన్' ఇండియాస్ ఫస్ట్ సీ అడ్వెంచరస్ థ్రిల్లర్ ఫిల్మ్ అని హీరో జీవీ ప్రకాష్ కుమార్ తెలిపారు. 'సముద్ర తీరం పక్కన ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరిలో జాలరి పాత్ర చేశాను. సాధారణంగా జాలర్లందరూ సముద్రంలో వేటాడడానికి వెళ్తారు. అయితే ఆ ఊరి ప్రజలు ఎవరూ సముద్రంలోకి వెళ్లరు. ఆ ఊరికి ఒక శాపం ఉంటుంది. అది ఏమిటి? అనేది సినిమాలో చూడాలి. శాపాన్ని ఎదిరించాలని హీరో సముద్రంలోకి వెళ్తాడు. అక్కడ ఏం జరిగిందనేది సినిమా. ఇండియాలో ఫస్ట్ సీ అడ్వెంచర్స్ థ్రిల్లర్ సినిమా ఇది. సముద్రంలోకి వెళ్ళిన తర్వాత హీరోలకు జాంబీలో ఎదురవుతారు. అలాగే ఆత్మలు కూడా ఉంటాయి. ప్రేక్షకులకు ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. 'కింగ్ స్టన్' కథ విన్న తర్వాత నచ్చింది. జీ స్టూడియోస్ సంస్థతో కలిసి చేశా. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ఇప్పటి వరకు ఇటువంటి సినిమా రాలేదు. ఫ్రాంచైజీలా చేయాలని అనుకుంటున్నాం. మా దగ్గర 4 పార్టుల వరకు కథ రెడీగా ఉంది.' అని జీవీ పేర్కొన్నారు.
వాటర్ సీక్వెన్సుల కోసం ట్రైనింగ్
ఈ సినిమాలో అండర్ వాటర్ సీక్వెన్సుల కోసం 4 రోజులు ట్రైనింగ్ తీసుకున్నట్లు జీవీ తెలిపారు. 'ఒకసారి నీటిలోకి వెళ్లిన తర్వాత మూడు నిమిషాలు పైకి రావడానికి ఉండదు. శ్వాసను ఎలా ఆపాలి? అనే దాంతో పాటు యాక్షన్ కోసం ట్రైనింగ్ తీసుకున్నాను. ఒకసారి నీటిలో ఉన్నప్పుడు వన్ మోర్ టేక్ అనేవారు. అప్పుడు ఇంకా ఇబ్బందిగా ఉండేది. షిప్ మీద యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ చేసేటప్పుడు జారిపోయేది. ఒక్కోసారి ఒక్క షాట్ చేసిన తర్వాత వేలు లేదా కాళ్ల మీద గాయాలయ్యేవి. బ్యాండేజ్ కట్టుకుని మళ్లీ షూటింగ్ చేసేవాడిని. అయితే యాక్షన్ సీక్వెన్స్ అన్ని బాగా వచ్చాయి.' అని చెప్పారు.
Also Read: ఎన్టీఆర్ - నీల్ 'డ్రాగన్' మూవీ ఇంటర్నేషనల్ - నిర్మాత ఇచ్చిన అప్ డేట్ అదిరిందిగా!
హాలీవుడ్ సైతం ఆశ్చర్యపోయేలా..
'కింగ్ స్టన్' విడుదలైన తర్వాత హాలీవుడ్ సైతం ఆశ్చర్యపోతుందని జీవీ కామెంట్ చేశారు. ఇండియాలో ఇప్పటివరకూ ఇటువంటి సినిమా రాలేదని.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా 3 రోజుల పాటు టెస్ట్ షూటింగ్ చేశారని చెప్పారు. ఆ తర్వాత గోకుల్ బినోయ్ సినిమా మొత్తం చేశారని వివరించారు. 'ఒక బోటు మీద ఆర్టిస్టులు ఉంటే మరొక బోటు మీద కెమెరా ఉండేది. అలాగే కొన్ని మీనియేచర్ సెట్స్ కూడా వేశాం. సినిమా విడుదలైన తర్వాత వీళ్లు ఈ సినిమా ఎలా చేశారని తప్పకుండా అడుగుతారు. ఈ సినిమాలో దివ్యభారతి యాక్షన్ సీక్వెన్స్ చేశారు. కింగ్‌స్టన్ తర్వాత ఆమెకు మంచి పేరు వస్తుంది.' అని అన్నారు.
హీరోగా 25... సంగీత దర్శకుడిగా 100 సినిమాలు..
హీరోగా 25 సినిమాలు.. సంగీత దర్శకుడిగా 100 సినిమాలు చేయడం చాలా సంతోషంగా ఉందని జీవీ ప్రకాష్ తెలిపారు. ''ప్రేమ కథా చిత్రం' తమిళ రీమేక్ 'డార్లింగ్'తో హీరోగా పరిచయం అయ్యా. అప్పటినుంచి సినిమాలు చేస్తూ ఉన్నా. తమిళంలో మంచి మంచి విజయాలు వచ్చాయి. ఒక షెడ్యూల్ ప్రకారం పని చేసుకుంటా. యాక్టింగ్, మ్యూజిక్ ఈ రెండిటికి ప్రొపర్ టైం కేటాయిస్తా. ఒకసారి షెడ్యూల్ మిస్ అయినా ప్లాన్ బి ఉంటుంది. సో... ప్రాబ్లం ఏమీ లేదు. దీపావళికి తెలుగులో 'లక్కీ భాస్కర్', తమిళంలో 'అమరన్' సినిమాలు విడుదల అయ్యాయి. ఆ రెండిటికి నేనే సంగీతం అందించా. ఆ రెండు చిత్రాలకు నాకు మంచి పేరు వచ్చింది. మంచి కథ దొరికితే ఇతర హీరోలతో కూడా సినిమాలు ప్రొడ్యూస్ చేయడానికి రెడీ.' అని స్పష్టం చేశారు.
'దసరా' నాని ఫ్రెండ్ రోల్ అడిగారు..
'దసరా' సినిమాలో నాని కాకుండా మరొక పాత్రకు తనను అడిగారని జీవీ తెలిపారు. అయితే.. డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆ సినిమా చేయలేకపోయినట్లు చెప్పారు. మంచి కథ వస్తే తెలుగులో సినిమా చేయడానికి నేను రెడీగా ఉన్నానని అన్నారు. ''బాహుబలి' ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లింది. అలాగే 'కాంతార' సినిమా ప్రేక్షకులను స్పిరిచువల్ వరల్డ్‌లోకి తీసుకువెళ్లింది. కింగ్‌స్టన్ సినిమా కూడా ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది. ఈ సినిమా ద్వారా మన అమ్మమ్మలు, బామ్మలు చెప్పిన కథలను తెరపైకి తీసుకు వస్తున్నాం.' అని తెలిపారు.





















