Crime News: వీడు కొడుకు కాదు, కాల యముడు! ఎవరైనా కన్నతల్లిని ఇంత దారుణంగా చంపుతారా ?

Sangareddy Crime News: పటాన్ చెరు: ఆస్తి వివాదం ఓ ప్రాణాన్ని బలితీసుకుంది. ఏకంగా కన్నతల్లినే హత్య చేయడంతో సంగారెడ్డి జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. కన్న తల్లిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేయడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. తెల్లాపూర్ దేవినో విల్లాస్ లో ఘటన జరిగింది. ఆస్తి పంచి ఇవ్వలేదన్న కారణంగానే హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని డివినో విల్లాస్ లో తల్లి రాధిక (52) పై ఆమె కుమారుడు కత్తితో దాడి చేశాడు. మద్యానికి బానిసైన కార్తీక్ రెడ్డి (26) ఆస్తి తనకు రాసివ్వాలని గొడవకు దిగాడు. ఈ క్రమంలో ఆవేశానికి లోనైన కార్తీక్ రెడ్డి తన తల్లి రాధికపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. దాదాపు 8 కత్తిపోట్లు ఆమె శరీరంపై ఉన్నాయి. ఇది గమనించిన స్థానికులు రాధికను చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె మృతిచెందింది. సోమవారం తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
మద్యం, మత్తు పదార్థాలకు బానిసైన కార్తీక్ రెడ్డి గత కొంతకాలం నుంచి తల్లిదండ్రులతో గొడవ పడుతున్నాడు. తనకు ఆస్తి రాసివ్వాలని, తన వాటా ఇచ్చేయాలని బెదిరింపులకు పాల్పడుతుండేవాడు. మద్యానికి బానిసైన కార్తీక్ కు ఆస్తి రాసిచ్చేందుకు తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో తరచుగా వీరి మధ్య ఆస్తి కోసం గొడవ జరిగేదని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో తల్లి రాధికతో వాగ్వాదానికి దిగిన కార్తీక్ రెడ్డి కత్తితో ఆమెపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఆమెను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ఆమె మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం పటాన్ చెరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. హత్య కేసు నమోదు చేసిన కొల్లూరు పోలీసులు నిందితుడు కార్తీక్ రెడ్డిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. తనకు ఆస్తి రాసివ్వలేదన్న కోపంతోనే తల్లిని హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
(ఇది బ్రేకింగ్ న్యూస్. ప్రస్తుతం దీనిని అప్‌డేట్ చేస్తున్నాం. లేటేస్ట్ అప్‌డేట్ కోసం రిఫ్రెష్ చేయండి)





















