Mollywood Strike: డిజాస్టర్ సినిమాలు 176, నష్టాలు 100 కోట్లు, హీరోలకు భారీ రెమ్యూనరేషన్లు... మాలీవుడ్‌లో స్ట్రైక్ ఎందుకు జరుగుతుందో తెలుసా?
Malayalam cinema strike : జూన్ 1 నుంచి మలయాళ సినిమా షూటింగ్ లు, ప్రదర్శనతో సహా అన్ని కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయబోతున్నామని కేరళ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సురేష్ స్పష్టం చేశారు.

మలయాళ చిత్ర పరిశ్రమకు గత ఏడాది నుంచి గడ్డుకాలం నడుస్తుంది. కేవలం 2025లోనే థియేటర్లకు ఒక రూ.101 కోట్ల నష్టం వాటిల్లినట్టు ప్రముఖ నిర్మాత జి సురేష్ కుమార్ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఆయన మలయాళ చిత్ర పరిశ్రమ సమ్మెకి పిలుపునిచ్చారు. జూన్ 1 నుంచి సినిమా షూటింగ్ లు, ప్రదర్శనతో సహా అన్ని కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయబోతున్నామని స్పష్టం చేశారు.
మలయాళ చిత్ర పరిశ్రమ సమ్మె
హై ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, నటుల భారీ పారితోషికం వల్ల నిర్మాతలు, పంపిణీదారులు ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని పేర్కొంటూ కేరళ ఫిలిమ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్... ఇతర పరిశ్రమ ప్రతినిధులతో కలిసి సమ్మెకు నిర్ణయం తీసుకుంది. కేరళ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు, నిర్మాత జి. సురేష్ కుమార్ మాట్లాడుతూ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా, దాన్ని పరిష్కరించడానికి గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని వెల్లడించారు. నిర్మాతలు డబుల్ టాక్సేషన్ భారంతో ఇబ్బందులు పడుతున్నారని, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, జీఎస్టి రెండూ పరిశ్రమను ప్రభావితం చేస్తున్నాయని ఆయన వెల్లడించారు. సినిమా బడ్జెట్లో 60 శాతం నటుల రెమ్యూనరేషన్, డైరెక్షన్ కోసం ఖర్చు అవుతుందని, దీనివల్ల మరింత ఆర్థిక సంక్షోభం పెరుగుతోందని ఆయన చెప్పుకొచ్చారు.
ఇక కేవలం జనవరిలోనే మలయాళ చిత్ర పరిశ్రమ రూ. 100 కోట్లకు పైగా నష్టాలను చవిచూసిందని, ఈ నెలలో రిలీజ్ అయిన 28 సినిమాలలో 'రేఖాచిత్రమ్' మాత్రమే లాభాలను తెచ్చి పెట్టగలిగిందని నిర్మాత సురేష్ కుమార్ వెల్లడించారు. ఏడాది మొత్తంలో 176 సినిమాలు డిజాస్టర్ అయ్యాయని, అందులో ఒకే ఒక్క సినిమా హిట్ అని ఆయన పేర్కొనడం షాక్ కు గురి చేస్తోంది.
భారంగా మారిన నటుల భారీ పారితోషికం
ఇక భారీ పారితోషికం డిమాండ్ చేస్తున్న నటులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. అంతే కాకుండా ఈ సమస్య పరిష్కారం కాకపోతే అగ్ర తారల పారితోషికాన్ని బహిరంగంగా వెల్లడిస్తామని ఆయన బెదిరించారు. ఈ విషయంపై నిర్మాత సురేష్ ఇంకా మాట్లాడుతూ "గతంలో ఎన్నడూ లేని విధంగా నటుల పారితోషకాలు పెరిగాయి. కొత్త నటలు కూడా భారీగా రెమ్యూనరేషన్ వసూలు చేస్తున్నారు. దర్శకుల విషయంలో కూడా ఇదే జరుగుతుంది. 50 రోజుల్లో పూర్తి చేయగల సినిమాను 150 రోజులు సాగదీస్తున్నారు. నటుల పారితోషకంతో పోలిస్తే థియేటర్ల నుంచి పది శాతం కూడా వసూలు కావట్లేదు. ఇకపై నటులు నిర్మించే సినిమాలకు మేము సహకరించము" అని తేల్చి చెప్పారు.
అంతేకాకుండా తెరవెనక పని చేస్తూ బ్రతికే 60 శాతం మంది చిత్ర పరిశ్రమ నిపుణులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, కానీ దీనిపై రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉందని ఆయన మండిపడ్డారు. మరోవైపు బాక్స్ ఆఫీస్ వద్ద ఓ సినిమాకు మంచి ఆదరణ లభిస్తే ఓటీటీ మార్కెట్ కొంత మొత్తానికి డీల్ సెట్ చేసుకుంటుందని, ఆ మొత్తాన్ని అందుకోవడానికి కూడా 6 నుంచి 10 నెలల టైం పడుతుందని సురేష్ కుమార్ వెల్లడించారు. అయితే మరోవైపు సినిమా సంస్థలు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఇతర సంబంధిత మంత్రులను కలిసి తక్షణ జోక్యం కోరుతూ ఒక మెమోరాండం రాయాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

