Naga Chaitanya - Shiva Nirvana: బ్లాక్ బస్టర్ కాంబో రిపీట్ కానుందా? నాగచైతన్య నెక్స్ట్ మూవీ డైరెక్టర్ అతనేనా?
Naga Chaitanya - Shiva Nirvana: అక్కినేని నాగచైతన్య, శివ నిర్వాణ కాంబోలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ 'మజిలీ'. వీరిద్దరి కలయికలో మరో మూవీ కోసం చర్చలు జరుగుతున్నట్లు దర్శక హీరోలు క్లారిటీ ఇచ్చారు.
అక్కినేని నాగచైతన్య కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాల్లో 'మజిలీ' ఒకటి. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, 2019లో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అప్పటి వరకూ వరుస పరాజయాల్లో ఉన్న యువసామ్రాట్ ను సక్సెస్ ట్రాక్ ఎక్కించింది. ఈ సినిమా తర్వాతే చైతూ స్క్రిప్టు సెలక్షన్ లో వెరియేషన్ చూపిస్తూ, బ్యాక్ టూ బ్యాక్ హిట్లు కొట్టాడు. అయితే ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ మజిలీ కాంబో రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చై - శివ కలిసి మరో ప్రాజెక్ట్ కోసం వర్క్ చేయనున్నట్లుగా తెలుస్తోంది.
'మజిలీ' వంటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్ లో మరో మూవీ రానున్నట్లుగా చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో మరో సినిమా చేసే అవకాశం ఉందని 'కస్టడీ' టైంలోనే నాగచైతన్య హింట్ ఇచ్చారు. అయితే ఇప్పుడు దర్శక హీరోల మధ్య ఓ మూవీ కోసం చర్చలు జరుగుతున్నట్లుగా క్లారిటీ వచ్చేసింది. లేటెస్టుగా శివ తన ఇంస్టాగ్రామ్ లో చైతూతో కలిసి దిగిన ఓ ఫోటోని షేర్ చేసారు. నిన్న సాయంత్రం ఇద్దరూ సరదాగా గడిపినట్లు చై తన స్టోరీలో పేర్కొన్నారు. దీంతో వీరిద్దరి కాంబో రిపీట్ కాబోతోందనే వార్తలకు బలం చేకూరినట్లయింది.
'నిన్ను కోరి' సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన శివ నిర్వాణ.. డెబ్యూతోనే సూపర్ హిట్టు కొట్టాడు. ఆ తర్వాత 'మజిలీ' మూవీతో మరో బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకొని సెన్సిబుల్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆ తర్వాత డైరెక్ట్ చేసిన 'టక్ జగదీశ్', 'ఖుషి' సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వలేదు. దీంతో దర్శకుడికి అర్జెంట్ గా ఒక హిట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు నాగచైతన్య సైతం 'థాంక్యూ', 'కస్టడీ' 'లాల్ సింగ్ చడ్డా' చిత్రాలతో ప్లాప్స్ రుచిచూశారు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.
శివ నిర్వాణ ఇప్పటి వరకూ లవ్ అండ్ ఫ్యామిలీ స్టోరీలకు తనదైన ఎమోషన్స్ జత చేసి సినిమాలు తెరకెక్కించారు. కానీ ఈసారి మాత్రం నాగచైతన్య కోసం ఓ మాస్ & యాక్షన్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. 'మజిలీ'లో పూర్ణ పాత్రకి కాస్త మాస్ టచ్ ఇచ్చిన దర్శకుడు.. ఇప్పుడు చైతూని పూర్తిగా మాస్ రోల్ లో ప్రెజెంట్ చేయబోతున్నారట. చైతన్య ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో 'తండేల్' అనే సినిమా చేస్తున్నారు. దీని తర్వాత శివ నిర్వాణ సినిమా ఉండే ఛాన్స్ ఉంది. మరి త్వరలోనే ఈ క్రేజీ కాంబోపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇస్తారేమో చూడాలి.
ఇక 'మజిలీ' విషయానికొస్తే, విడాకులు తీసుకోవడానికి ముందు నాగచైతన్య తన మాజీ సతీమణి సమంతతో కలిసి నటించిన చివరి చిత్రమిది. 2019 ఏప్రిల్ 5న రిలీజ్ అయింది. డిఫరెంట్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ మూవీలో చై-సామ్ కెమిస్ట్రీ, యాక్టింగ్ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. దాదాపు రూ. 20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద రూ. 70 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి నిర్మాతలకు మూడింతల లాభాల్ని తెచ్చిపెట్టింది. గోపీ సుందర్ కంపోజ్ చేసిన పాటలు, ఎస్. థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు.