First Pan India Movie: సినిమా చరిత్రలో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా రికార్డు... రజనీ, నాగార్జున హీరోలు... ఇండియాలోనే ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఏదో తెలుసా?
First Pan India Movie: ఇండియాలోనే ఫస్ట్ పాన్ ఇండియా మూవీ, కానీ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. రజనీకాంత్, నాగార్జున లాంటి స్టార్స్ ఉన్నా ఆడలేదు. ఆ మూవీ పేరేంటి ? బడ్జెట్ ఎంతంటే?

పాన్ ఇండియా సినిమా అనగానే గుర్తొచ్చేది దర్శక దిగ్గజం రాజమౌళి. 'బాహుబలి' సినిమాతో ఆయన క్రియేట్ చేసిన ఈ ట్రెండ్ ని ప్రస్తుతం అన్ని భాషల మేకర్స్, హీరోలు ఫాలో అవుతున్నారు. నిజానికి ఈ పాన్ ఇండియా అనే ట్రెండ్ ను జక్కన్న కంటే ముందే మొదలు పెట్టాడు ఓ హీరో. కాకపోతే ఆ మూవీ ఇండియన్ చరిత్రలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగలడంతో చరిత్ర పుటల్లో స్థానం లేకుండా పోయింది. పైగా అప్పట్లోనే కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ నిర్మాతకు భారీ నష్టం తెచ్చిపెట్టి, ఆయన దివాలా తీసేలా చేసింది. నాగార్జున, రజనీకాంత్ వంటి సూపర్ స్టార్స్ సినిమాలో నటించినప్పటికీ ఏమాత్రం మూవీకి హెల్ప్ కాలేదు. ఆ మూవీ పేరు మరేంటో కాదు 'శాంతి క్రాంతి'.
ఇండియాలోనే ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
ఇండియన్ చిత్ర పరిశ్రమ ప్రపంచంలోనే అతిపెద్ద ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలలో ఒకటి. ప్రతి ఏడాది ఇక్కడ హిందీ, తెలుగు, తమిళ, కన్నడ వంటి భాషల్లో వందలాది సినిమాలు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్నాయి. వాటిలో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టి, కోట్లలో లాభాలను తెచ్చిపెడుతున్నాయి. కానీ మరికొన్ని మాత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కినప్పటికీ నిర్మాతలను తీవ్ర నష్టాల్లోకి నెట్టేస్తాయి. అలాంటి షాకింగ్ సంఘటన 'శాంతి క్రాంతి' అనే ఫస్ట్ పాన్ ఇండియా సినిమా విషయంలోనూ జరిగింది.
1991లో తెరపైకి వచ్చిన ఈ మూవీనే ఫస్ట్ పాన్ ఇండియా సినిమా అని చెప్పొచ్చు. అప్పట్లోనే కన్నడ హీరో, దర్శకుడు, నిర్మాత రవిచంద్రన్ ఈ మూవీతో ఫస్ట్ పాన్ ఇండియా మూవీ తీయాలనే కలను నెరవేర్చుకున్నారు. కానీ అదే ఆయనను భారీ నష్టాలతో కుదేలయ్యేలా చేసింది. 1988లో కన్నడ నటుడు దర్శకుడు వీర్ రవిచంద్రన్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన 'శాంతి క్రాంతి' సినిమాను స్టార్ట్ చేశాడు. అప్పట్లోనే ఈ సినిమాలో భారతదేశం నలుమూలలా ఉన్న స్టార్స్ అందరినీ కలిపే ప్రయత్నం చేశాడు. కన్నడ, తెలుగు, తమిళం, హిందీ నాలుగు భాషల్లోనూ ఈ మూవీని నిర్మించాడు. కన్నడ వెర్షన్ లో స్వయంగా రవిచంద్రన్ హీరోగా నటించగా... తమిళ, హిందీ వెర్షన్ లలో రజనీకాంత్ హీరోగా చేశారు. తెలుగులో నాగార్జున నటించారు. ఇక ఈ సినిమాలోని అన్ని వెర్షన్ లలోనూ జూహీ చావ్లా, ఖుష్బూ, అనంత నాగ్ కీలక పాత్రలు పోషించారు. అప్పట్లోనే 10 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కింది ఈ మూవీ. ఆ టైంలో ఇదే అత్యంత భారీ బడ్జెట్ అని చెప్పొచ్చు.
నిర్మాతను నిండా ముంచిన మూవీ
నాగార్జున, రజనీకాంత్ లాంటి స్టార్ హీరోలు ఉన్నప్పటికీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా ఫెయిల్ అయింది. కేవలం 8 కోట్లు మాత్రమే రాబట్టి, నిర్మాతకు కోలుకోలేని నష్టాలను తెచ్చిపెట్టింది. మూవీని నిర్మిస్తున్న టైంలోనే బడ్జెట్ అదుపు తప్పడం, ప్రేక్షకులు కథకు కనెక్ట్ కాలేకపోవడంతో నిర్మాత నిండా మునిగాడు. నిజానికి రవిచంద్రన్ తాను అప్పటికే పొదుపు చేసిన మొత్తాన్ని ఈ సినిమా కోసమే ఖర్చు పెట్టాడు. పైగా భూమిని అప్పుగా తీసుకొని ఖరీదైన సెట్లు కూడా నిర్మించాడు. మొత్తానికి ఈ మూవీ డిజాస్టర్ తో ఆయన దివాలా తీయాల్సి వచ్చింది. ఆ తర్వాత సర్వైవ్ అవ్వడానికి చిన్న బడ్జెట్ సినిమాలు, రీమేక్ లు చేయాల్సి వచ్చింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

