Naga chaitanya on Balakrishna: వారిని అగౌరవపరచడం మనల్ని మనం కించపర్చుకోవడమే, బాలయ్యపై చైతూ ఆగ్రహం
‘వీరసింహారెడ్డి’ సక్సెస్ మీట్‌లో ‘అక్కినేని, తొక్కినేని’ అంటూ బాలకృష్ణ చేసిన కామెంట్స్ పై నాగ చైతన్య రియాక్ట్ అయ్యారు. మహానటులను కించపరచడం అంటే మనల్ని మనం కించపర్చుకున్నట్లేనన్నారు.
బాలయ్య వ్యాఖ్యలపై చైతూ రియాక్షన్
నందమూరి బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ సక్సెస్ మీట్‌లో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ‘అక్కినేని, తొక్కినేని’ అంటూ బాలకృష్ణ మాట్లాడిన వీడియోపై అక్కినేని ఫ్యాన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా బాలయ్య వ్యాఖ్యలపై అక్కినేని నాగేశ్వర్ రావు మనువడు, టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైనత్య స్పందించారు. “నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరరావు గారు, ఎస్వీ రంగారావు గారు తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డలు. వారిని అగౌరపరచటం మనల్ని మనమే కించపరుచుకోవటం..” అవుతుందని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
— Akhil Akkineni (@AkhilAkkineni8) January 24, 2023
ఇంతకీ బాలయ్య ఏమన్నారంటే?
‘వీరసింహారెడ్డి’ సక్సెస్ మీట్‌లో సినిమా షూటింగ్‌లో నటుల మధ్య ఏ అంశాలు చర్చకు వచ్చేవో తెలిపే సందర్భంలో బాలయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. “అందరూ అద్భుతంగా నటించారు. నాకు మంచి టైమ్ పాస్. ఎప్పుడూ కూర్చుని వేద శాస్త్రాలు, నాన్నగారు, డైలాగులు, ఆ రంగారావు గారు, ఈ అక్కినేని, తొక్కినేని అన్నీ మాట్లాడుకునే వాళ్లం” అని బాలకృష్ణ ఈ సందర్భంగా అన్నారు. ఈ వ్యాఖ్యలే ఆ తర్వాత వివాదాస్పదం అయ్యాయి. బాలయ్య వ్యాఖ్యలపై అక్కినేని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
బాలయ్య వ్యాఖ్యల ఉద్దేశం అదేనా?
అటు 'వీరసింహా రెడ్డి' విజయోత్సవ వేడుకలో బాలకృష్ణ మాట్లాడిన ఓ మాట కూడా ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసిందేనా? అనే అనుమానం కొందరిలో కలుగుతోంది. బాలకృష్ణకు 'వీర సింహా రెడ్డి' చిత్ర దర్శకుడు గోపీచంద్ మలినేని వీరాభిమాని. 'సమర సింహా రెడ్డి' సినిమా చూడటానికి వెళ్ళి పోలీస్ లాఠీ దెబ్బలు తిన్న వ్యక్తి కూడా. అతడి గురించి చెబుతూ ’’నేను కారణం చెప్పను. ఎందుకంటే... మళ్ళీ ఇప్పుడు కేసు బుక్ చేస్తారు. ఇప్పుడు చాలా తేలిక కదా! కేసులు బుక్ చేయడం... నిరపరాధుల మీద’’అని బాలకృష్ణ చురకలు వేశారు. ఆ మాట సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఏపీలో ప్రజలకు స్వేచ్ఛ లేకుండా పోయిందని, సోషల్ మీడియాలో చేసిన పోస్టులను సాకుగా చూపిస్తూ కొందరిని అరెస్టులు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
ఏపీ ప్రభుత్వంపై బాలయ్య చురకలు
ఇక ‘వీరసింహా రెడ్డి‘ సినిమాలో కూడా ఏపీ ప్రభుత్వానికి చురకలు వేశారు. 'సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో! కానీ, ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు, మార్చలేరు'. 'వీర సింహా రెడ్డి' సినిమాలో ఈ డైలాగ్ రాజకీయ పరంగా చర్చనీయాంశమైంది. ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై పేల్చిన బుల్లెట్ కింద ఆ మాటను చాలా మంది చూశారు. సినిమాలో ఆ డైలాగ్ తర్వాత 'దట్స్ మై ఫాదర్' అని కంటిన్యూ చేస్తారు బాలకృష్ణ. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీలో ఎన్టీఆర్ పేరు తీసేసిన జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం, వైఎస్సార్ పేరును పెట్టడంతో ఈ సెటైర్ వేశారని జనాల అభిప్రాయం. ఈ సినిమాలో అంత కంటే ఘాటైన డైలాగులు కూడా ఉన్నాయి.