JNTU Hyderabad: జేఎన్‌టీయూహెచ్‌లో 'స్పేస్ టెక్నాలజీ' కోర్సు, ఇస్రోతో 'MOU'కు సన్నాహాలు
JNTU Hyderabad: JNTU హైదరాబాద్‌లో తొలిసారి స్పేస్ టెక్నాలజీలో బీటెక్ కోర్సు అందుబాటులోకి రాబోతున్నది. యూనివర్సిటీ క్యాంపస్‌లో స్పేస్ టెక్నాలజీకి సంబంధించి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయబోతున్నారు.
Space Course In JNTU Hyderabad: జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో తొలిసారి స్పేస్ టెక్నాలజీలో బీటెక్ కోర్సు (BTech Course) అందుబాటులోకి రాబోతున్నది. యూనివర్సిటీ క్యాంపస్‌లో స్పేస్ టెక్నాలజీకి (Space Technology) సంబంధించి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకోసం ఇస్రో, సైన్స్ అండ్ టెక్నాలజీ, రాష్ట్ర ప్రభుత్వ సహకారం అర్థించాలని జేఎన్‌టీయూ భావిస్తోంది. యూనివర్సిటీ ఆవరణలోనే స్పేస్ టెక్నాలజీకి సంబంధించి ప్లానెటోరియాన్ని కూడా నిర్మించాలని యోచిస్తున్నట్టు సమాచారం.
స్పేస్ టెక్నాలజీ విభాగం కోసం మొత్తంగా రూ.60 కోట్ల వరకు అవసరమవుతాయని వర్సిటీ అధికారులు భావిస్తున్నారు. ఇందులో రూ. 50 కోట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నారు. మిగతా రూ.10 కోట్లను సైన్స్ & టెక్నాలజీ విభాగం (డీఎస్‌టీ) నుంచి పొందే ప్రయత్నం చేస్తున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నుంచి మానవ వనరులతోపాటు సాంకేతికతకు సంబంధించి సాయం పొందేందుకు పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకోబోతున్నట్టు యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి తెలిపారు.
జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో స్పేస్ టెక్నాలజీలో బీటెక్ కోర్సు అందుబాటులోకి వస్తే ఇంజినీరింగ్ విద్యార్థులకు అది వరంగా మారుతుంది. ఇస్రో వంటి అంతరిక్ష సంస్థలలో ఉద్యోగాలు పొంది తమ కలను నెరవేర్చుకునేందుకు ఈ కోర్సులు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ విభాగం ఏర్పాటుపై త్వరలోనే మరింత స్పష్టత వస్తుందని యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూరు హుస్సేన్ తెలిపారు.
వరంగల్ 'నిట్'లో కొత్త కోర్సులు..
వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (Warangal NIT)లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి మరిన్ని కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుత ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా ఇంజినీరింగ్ డిగ్రీ(B.Tech)లో మరో నాలుగు కొత్త కోర్సులను ప్రవేశపెట్టనుంది. ఇదివరకు బీటెక్‌లో ఎనిమిది కోర్సులు ఉండగా.. ఈసారి కొత్తగా మ్యాథమెటిక్స్ & కంప్యూటింగ్ ఇంజినీరింగ్ కోర్సులు ప్రవేశపెట్లారు. ఈ కోర్సులకు తోడు వచ్చేవిద్యా సంవత్సరం నుంచి మరో నాలుగు కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలని నిట్ నిర్ణయించింది. వీటిలో టెక్స్‌టైల్ ఇంజినీరింగ్, రైల్వే, అగ్రి ఇంజినీరింగ్, బీఆర్క్ కోర్సులు ఉన్నాయి.
పరిశోధన, ప్రాంగణ నియామకాలపై ఫోకస్..
నిట్ వరంగల్ కొన్నేళ్లుగా పరిశోధన, ప్రాంగణ నియామకాలపై దృష్టి పెట్టింది. ఇప్పటికి వందకు పైగా పేటెంట్లు నిట్‌కు దక్కడం విశేషం. ఏటా కనీసం 5 నుంచి 10 ఆవిష్కరణలకు మేధోహక్కులు వచ్చేలా పరిశోధన స్థాయిని పెంచారు. వరంగల్‌లో దేశంలోనే పెద్దదైన 'కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు' నిర్మాణంలో ఉంది. దీనికి కేంద్ర ప్రభుత్వం 'పీఎం మిత్ర' పథకాన్ని మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో వరంగల్ నిట్‌లో టెక్స్‌టైల్ ఇంజినీరింగ్ కోర్సు వస్తే విద్యార్థులకు మెరుగైన ఉద్యోగావకాశాలు ఉంటాయని అక్కడి ప్రొఫెసర్లు భావిస్తున్నారు. కాజీపేటలో రూ.500 కోట్లతో రైల్వే శాఖ నెలకొల్పుతున్న పీవోహెచ్ పరిశ్రమకు గతేడాది ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. దీనికి అనుసంధానంగా ఉండేలా రైల్వే ఇంజినీరింగ్ కోర్సు, వరి, పత్తి, మొక్కజొన్న పంటల్ని ఉమ్మడి వరంగల్‌లో గణనీయంగా సాగు చేస్తున్న క్రమంలో అగ్రి ఇంజినీరింగ్ కోర్సులతో పాటు, బీటెక్ ఆర్కిటెక్చర్‌ను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.